SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
జాతస్య…
Mar 14th, 2009 by akkirajub

అరుణ పాణిని గారు  “ముగ్గురు ముసలమ్మలు” అనే కథని  మే 2007 లో రాశారు.    ఆ కథ నేను అప్పట్లో చాలా సార్లు చదివాను.   మనకున్న దురలవాట్లలో, ప్రతీ కథని “మంచి కథ” లేదా “చెడ్డ కథ” అనే ఏదో ఒక కేటగిరీలో పెట్టాలి అని ప్రయత్నం చేయడం.   ఎన్నిసార్లు చదివినా  ఈ కథని ఎటూ పెట్టలేక పోయాను.   నా వల్ల కాలేదు.   చావు ఈ కథలో ఎక్కడైనా రొమాంటిసైజ్  అయ్యిందేమో నని అప్పట్లో న అనుమానం.  మన పల్లెల్లో మరే మార్గంలేక  చావుని నిశ్శబ్దంగా ఆశ్రయించే వాళ్లందరిదీ   “డిగ్నిఫైడ్ డెత్” ల జాబితాలో చేర్చేయాల్సొస్తుందేమోననే  “పొలిటికల్ కరక్ట్ నెస్”  భయం.

ఎన్నో సార్లు చాలా తెలిసిన వాడిలా  ఏదొ రాద్దామని మొదలు పెట్టి ఆపేశా.  కథ బాగారాశారు అని మాత్రం మెయిల్ పంపి ఊరుకున్నా.

ఆ కథ వచ్చినప్పటి నించీ ఇప్పటి లోపు నేను దాదాపు పది చావుల్ని చుశాను.  బహుశా మధ్య వయస్సులోకి చేరేవాళ్ళకి ఇలాంటి సమయం తప్పదనుకుంటా.  మెల్లిగా ఓ తరం దాటిపోతున్న ఓ కౄరమైన సందర్భంలో ఉన్నా ప్రస్తుతం.   వీటన్నిటికీ పరాకాష్ట ఒకరి వెంట ఒకరు మా  నాన్నా, అమ్మా వెళ్ళిపోవటం.

మా నాన్న నాస్థికుడు, కమ్యూనిష్టు, రకరకాల మెటీరియలిజాలు చదివేసి ఓపికున్నంత కాలం కనబడ్డ వాళ్ళకల్లా ఆ పాఠాలు చెప్పిన మనిషి.    కానీ ఆయన  వయసుతో వచ్చిన అనివార్యమయిన మార్పుల్ని మాత్రం అంగీకరించలేక పోయారు.   మంచి ఫిట్ నెస్ చివరిదాకా కొనసాగించిన ఆయన, దాదాపు చివరి దాకా ఓ కిలో మీటరు నడవగలిగే వారు… ఎనభయ్యేళ్ళకి దగ్గరపడ్డాకూడా.  రెగ్యులర్ గా చెకప్పులూ, మందులూ అన్నీ నిక్కచ్చిగా చూసుకున్నారు.  కానీ చివర్లో ఇక ఇంతకు మించి ఏమీ సాధ్యం కాదు అని ఓ నిర్ణయానికి కష్టంమీదే వచ్చారని నా అనుమానం.   అంతకుముందు ఎన్నోసార్లు, కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఎమర్జెన్సీకి పరిగెత్తిన ఆయన,  చివరికి ఒకే రోజులో మేమంతా మళ్ళీ మామూలుగా ఇంటికి వస్తారు అనుకుని హాస్పటల్ కి తీసుకు వెళ్తే తిరిగి రాలేదు.  కొన్ని గంటల్లో కనీసం నాకు హైదరాబాదు నుండి కొత్తగూడెం వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా వెళ్ళి పోయారు.    మా నాన్న చావుని చివరిదాకా అంగీకరించలేదు, ఇది నిజం.

మా నాన్న పోవడానికి ముందునుంచే అనేక రుగ్మతలతో మా అమ్మ బాధ పడుతోంది.  నిజం చెప్పాలంటే, తను లేకుండా, మానాన్న ఉండ గలగడం ఊహించలేనిది (శ్రీరమణ రాసినిఅ మిథునం కథ గుర్తుందా?).  అందుకోసమే బండిలాగిందేమో ననేది చావుల్లో కూడా రొమాంటిసిజమ్ చూడగల నా సినిమాటిక్ ఊహ అయుండొచ్చు.   కానీ, మా అమ్మ కొత్తగూడెంలో సీరియస్ అయినా, హైదరాబాద్  అంబులెన్స్ లో తీసుకొచ్చే అవకాశం ఇచ్చింది.   ఇప్పటికీ అది (హైదరబాద్ తీసుకురావడం) మంచిపనో కాదో తేల్చుకోలేకుండా ఉన్నాను.   అది మొదలు మాత్రమే.  అలా తేల్చుకోలేక పోయిన విషయాలు హైదరాబాదు వచ్చిన దగ్గరనుంచీ ఆవిడ పోయిన దాకా ఎన్నని?

ఆవిణ్ణి అడిగే స్థితి, ఆవిడ అభిప్రాయం తీసుకునేంత స్పృహ కూడా ఆవిడకి పూర్తిగా ఉండదు.  సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి.   బ్రహ్మాండ మయిన ఇన్స్యూరెన్సూ,  కావాల్సినంత బాంక్ బాలెన్సూ ఉన్ననాకు తీసుకెళ్ళలేని ఆస్పత్రి గానీ డాక్టర్ కానీ హైదరాబాద్ లో లేరు.   చెప్పలేనన్ని ఆప్షన్స్,  ఇంకేమన్నా చేయొచ్చెమో, తెలియని తనంతో చెయ్యట్లేదేమో ననే తపన.    ఏది బాధో, ఎంత ప్రెమో, ఎంత అపరాధ భావనో (గిల్టీ ఫీలింగ్) తెలీదు.

డాక్టర్లు విసుక్కుని “ఇక్కడ ఓ సంవత్సరం ఉంచేస్తే ఏమన్న అవుతుందను కుంటున్నారా?”  అనేదాకా లాగాం.  అప్పటికీ  మా అన్నయ్య వచ్చి పెద్దరికం వహించేదాకా నేను చేయని రచ్చ లేదు.   అమ్మకూడా ఒంటరిగా ICU  రోజుల తరబడి ఉండి,  “ఇక ఇంటికి తీసుకు పొండిరా  ఇక నావల్లకాదు” అనేదాకా సాగ దీశాం.

(“అలిసిపోయిన ఆమె గుండెను ఇంకా ఎన్ని రోజులు కష్టపెడతారు, కొన్నిసార్లు మనుషులకు కూడా దేవుడిపై కొంత జాలి ఉండాలి”   అని అరుణగారి కథలో డాక్టర్ అనటం అప్పుడర్థమయింది)

మనిషి పూర్తిగా ఎముకల గూడు అయిపోయి, వంటిమీద సూదిగుచ్చేందుకు కుడా కొత్త కొత్త మార్గాలు వెతికేస్థితి.  తీసిన సూది మరకలతో శరీరం పూర్తిగా నల్లబడి పోయి….  మాఅమ్మ….  ఏమిటి చేసేది?    ఇంటికి తీసుకు వచ్చేశాం.  వచ్చిన కొన్ని రోజుల్లో సినిమాల్లో చూపించినట్టు లిటరల్ గా నా చేతుల్లో నా వంకే చూస్తూ పోయింది మా అమ్మ.

ఆవిడ పోయే గంట ముందుకూడా నేను మా అన్నని బతిమిలాడుతూ, దెబ్బలాడుతూ ఉన్నాను,  వేరే హాస్పటల్ కి తీసుకెళ్దాం అవస్థ పడుతోంది అని.  నా గోల పళ్ళేక మళ్ళీ డాక్టర్ కి  ఫోన్ చేశాడు మా అన్నయ్య.  “దయచేసి ఆవిణ్ణి ఇంకా అవస్థ పెట్టకండీ” అన్నాడు డాక్టరు.  ఆ ఫోన్ చేసిన గంటలో అంతా అయిపోయింది.

ఆవిడ పోయేదాకా ఆవిడకి ఇంకేదయినా చేయాల్సింది చేయట్లేదేమో నని “గిల్టీ”.  ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే,  ఏ హాస్పటల్ కయినా తీస్కెళ్ళగలను, ఏ వైద్యమయినా చేయించ గలనూ అన్న నా అహంకారంతో   ఆవిణ్ణి కొన్ని వారాలు అవస్థ పెట్టానేమో నని పిస్తుంది.

వెనక్కి తిరిగి చూసుకుంటే “ముగ్గురు ముసలమ్మలు”  కథ చదివినప్పటికి,  ఆ కథని అర్థంచేసుకో గల విగ్నత  అప్పటికి నాకు లేదని అర్థమయింది.   తెలియని విషయం గురించి అప్పుడేమీ రాయనందుకు ఇప్పుడు ఆనంద పడుతున్నాను.

NPR  లో రకరకాల  Podcasts డౌన్లోడ్ చేస్కుని  iPod లో వినడం నా కలవాటు.  ఈ మధ్య  “Good Death” అని ఓ ఎపిసోడ్ వచ్చింది.   ఇందులో ఉన్నది  డేవిడ్ రీఫ్ (David Rieff) అనే రచయిత రాసిన  “swimming in a sea of death” అనే పుస్తకం గురించిన చర్చ అదీ ఆ రచయితతోనే.  ఆయన తల్లి మరణం చుట్టూ రాసిన పుస్తకం అట అది (నేను పుస్తకం చదవలేదు….  కనీసం మరో అయిదేళ్లదాకా అయినా ఆ పుస్తకం చదివే ఉద్దేశం లేదు నాకు)

అసలే నా ఆలోచనల్లో సతమత మవుతున్న నాకు అదో పెద్ద షాక్.   చావునంగీకరించలేని తల్లిని గురించి కొడుకు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే మామూలు మధ్యతరగతి తెలుగు సెన్సిబిలిటీస్ ఎలా తట్టుకుంటాయి?  చాలా చాలా ఆలో చించాల్సి వచ్చింది, ఆ కొడుకు మాటల్లోని ఓ కఠోర సత్యాన్ని, ఓ నిత్య సత్యాన్ని,  పొద్దున సూర్యుడు పొడవడం లాంటి ఖచ్చిత మయిన విషయాన్ని  ఆకళింపు చేసుకోవాలి అనే మాటని  “హేతు వాదిని” అనే నేను  ఒప్పుకోవాల్సిందే కదా?

ఇంకా ఈ రచయిత ఇలా అన్నాడు…

“I don’t believe a word (good death) of what you just said. I don’t know whether you believe it or not. But I know this argument very well. First of all, I think that argument does a real disservice to human variety. People are very different in their lives and very different in their deaths. The idea that one good death fits all seems incredibly reductive to what human beings are all about. It’s like saying all human beings should be cheerful. I don’t know that being cheerful is better than being a melancholy person. People have different temperaments. When you say “grace,” it lets family members off the hook. They don’t have to feel so bad that the person is going. So I don’t buy it.”

 

బేరీజు వేసి చూస్తే,  ముగ్గురు ముసలమ్మలు కథలో జరిగింది ఇదేనా?   ఒక చావుని మంచి చావుగా గుర్తించి, మిగతా వాటిని దాంతో పోల్చి న్యాయ నిర్ణయం చేయడం సబబేనా?  అలా చేయొచ్చా?

ముసలమ్మల కథలో మరో కోణం, అందులో డాక్టర్ ఇలా అనుకుంటుంది..

“ఒకవైపు దేవుడు, భక్తి, నమ్మకం అంటున్నా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి. టెక్నాలజీ, అది వాడటానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి ఈ టెంప్టేషన్ ఉండదేమో! అందరమూ మరణాన్ని ఒక డిగ్నిటీతో ఒప్పుకుంటామేమో!”

ఎన్ని సార్లు అన్నానో తెలీదు మా ఆవిడతో, మా అన్నయ్యతో,    మన   affordability  అమ్మకి మేలు చేయట్లేదేమో, మరింత అవస్థ పెడుతోందేమో నని.  అంటమయితే అన్నాను కానీ ఎవరిమాటన్నా విన్నానా చివరిదాకా?    మానవ సంబంధాల్లోని ఆర్థిక సూత్రాలు ఎన్ని వింత పోకడలు పోతాయో కదా!

ఇప్పుడు చెపుతా వినండి.   ముగ్గురు ముసలమ్మలు కథ ఓ అద్భుతం.  అద్భుతం అంటే మంచా, చెడా అని కాదు.   దీంట్లో చర్చించిన అనేక విషయాల పట్ల  నిన్న అంగీకరించినవి రేపు అంగీకరించక పోవచ్చు.  ఈ రోజు ఉన్న సందిగ్ధం రేపు అర్థమయినట్టు ఉండచ్చు.   లేదా అందుకు విరుద్ధం.     అన్నిటినీ అంగీకరించె “పొలిటికల్ థాట్” ఉంటే నే మంచి కథ అంటాను అనే రకం స్కేల్ కి లొంగని కథ ఇది.

కథ నిర్మాణం గురించి చెప్పాలంటే, శిల్ప పరంగా ఇంకా బాగుండొచ్చు.  ఓ డాక్టరే రాశారు కథ అని పాఠకులకి తెలియక్కర్లా J    నిజానికి ఈ కథని ప్రత్యేకంగా చర్చిద్దామని కాదు ఇది రాసింది.    సాహిత్యానికీ మనం ఉన్న సందర్భానికీ  సంబంధం ఉంది.   హడావిడి పడి చేసే ఓవర్ నైట్ సాహిత్య నిర్ణయాలు  ప్రమాద కరం.

నా వ్యక్తిగత విషయాల్ని చాలా ఇక్కడ రాసేశాను.  David Rieff ఇంటర్వ్యూ విన్నాక/చదివాక అది తప్పులేదనిపించింది.    ఈ టార్చర్ లో ఉండగా  అన్నాను మా ఆవిడతో బేలగా  “ కనీసం అందరిలా అన్నా పెరిగితే బాగుండేది.  ఈ అనవసరపు అర కొర “మేధస్సు” నాకెందుకు.  హాయిగా  గుడికెళ్ళి భగవంతుడా నీదే భారం అనేసి కాస్త “గిల్టీ” ని దేవుడికి పంచే అవకాశం కూడా లేని ఈ నాస్తికత్వం నాకే ఎందుకు రావాల్సొచ్చింది” అని.

 

-అక్కిరాజు

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa