రిసైకిల్ : టైటానికి కథ గురించి

కథ : టైటానిక్ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : సురేష్
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : జులై 2001
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2)
__________________________________________

"….యేరుశనగ మిరపల వర్తకాల్లో కొందరిని జంక్సను కాడ మిల్లులు, మరికొందర్ని టేశను కాడ మిల్లులు – పెద్ద వర్తకులు – యీలకన్న లోకం సూసినోల్లు – యీల్లను ముంచీసినారు. అయితే ఆ మిల్లులన్న ఇప్పుడున్నాయా? ఆట్నన్నింటిని అంతకన్న పెద్దమిల్లులు ఆవదాలవలసవి మింగీసినాయి. మరి అవైన వుంటాయా? నాకు తెల్దు గాని ఆట్ని కూడ మింగుతున్నవీ, మింగబోయేవీ ఎక్కడో ఏవో పుట్టి పెరుగుతూనే వుంటాయి…." అంటాడు అప్పల్రావుడు యజ్ఞం కథలో.

అప్పల్రావుడి వుపన్యాసంలో తనకి తండ్రి దగ్గర్నించి వచ్చిన రెండు తులాల బంగారం, యీసిన్నర యెండి, కొంత భూమి ఎలా న్యాయబద్ధంగా చేతులు మారాయో చెపుతాడు. 1964 లో రాసిన కథ యజ్ఞం. ఆముదాలవలస మిల్లుదాకా చూడగలుగుతాడు అప్పల్రావుడు. మరాతర్వాత ఏంజరిగింది? అతగాడి ఆ ఆస్థి ఇన్నేళ్ళ తర్వాత కొత్త శతాబ్దిలోనైనా దారి మార్చి వెనక్కి వచ్చే సూచనలేమైనా కనపడుతున్నాయా? కనీసం ఏ సరిహద్దుదగ్గరన్నా చేరి స్థిరపడిందా? లేదూ, ఉన్న సరిహద్దుల్ని కూడా దాటేసి కొత్త తీరాలకి చేరుతోందా? దానికి సమాధానమే టైటానిక్ కథ. అప్పల్రావుడు చెప్పినట్టుగా ఆ " చిన చేపని పెద చేప, చిన మాయను పెను మాయ " కథ నడుస్తూనే వుంది, విసుగూ విరామం లేకుండా.

"… ఎవరి పరిస్థితి బాగుందని? స్వతంత్రని వదిలేశాక నాకు మాదాపూర్ లో జాబొచ్చింది. రెండేళ్ళు బానే గడిచాక ఇవాళ పొద్దున మాకంపెనీ బోర్డు మారిపోయింది. రాత్రే శాంస్ ఇంక్ వాళ్ళు మా సాఫ్ట్ వేర్ కంపెనీని వోవర్ టేక్ చేశారు. ఇక్కడి కంటే చైనాలో బెటరని హైదరాబాదు కంపెనీని మూసేశారు …" ఇవి శ్రీహరి మాటలు, టైటానిక్ లో. ఇవి అప్పల్రావుడి మాటల్లా వుండటం యాదృచ్చికం కాదు. ఒకే తాడు, మొదలు పట్టుకు మాట్లాడాడు అప్పల్రావుడు, అదే తాడు శ్రీహరి పరీక్షిస్తున్నాడిప్పుడు.
దేశం అభివృద్ధి చెందిపోయింది, కోక్, పెప్సీ ల కాంపిటీషన్ లో కూల్డ్రింకుల రేటు పడిపోయింది అని ఆనంద పడిపోతున్న ఆత్యాధునికులకు అత్యవసరమైన కథ ఇది.

కథలో రచయిత పడ్డ శ్రమ కూడా తెలుస్తోంది. ఆ ప్రాంతాలు తిరిగి, "ఆంధ్రా స్టీల్సు" గేటు తీసుకు లోపలికి వెళ్ళిన వాళ్ళే ఆ కథ రాయగల్రు. ఇన్వెస్టిగేటివ్ రచనల పేరుతో జనాల్ని చావ బాదుతున్న రచయితలు ఈ రచయితనించి నేర్చుకోవాల్సింది చాలావుంది. నాదృష్టిలో ఇది నిజమయిన ఇన్వెస్టిగేటివ్ కథ. ఇన్నాళ్ళూ "ఇన్వెస్టిగెటివ్ రచన, రచయిత" అని వెటకారంగా మాత్రమే వాడేవాణ్ణి, ఇప్పుడిక జాగ్రత్తగా వుండాలి.

దేశ సరళీకృత విధానాన్ని వడకడితే కనపడే చిత్రం ఈ కథ. ప్రధానంగా, ఇందులో ఎవడిది తప్పు అని విచారించిన తీరు. చాలా సులభంగా (వేలూరి గారన్నట్టు) గుజరాత్ భూకంపాన్ని కూడా అమెరికా వాడి నెత్తిన రుద్దచ్చు. కథలో ఎక్కడా "స్వతంత్ర" ని కానీ బహుళజాతి సంస్థల్ని గానీ విలన్లు గా చూపే ప్రయత్నం చేయలేదు. అది కథని పూర్తిగా నీరస పరిచేది. దోచుకునే వాడెప్పుడూ సిద్ధంగానే వుంటాడు. వాడిగురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఇందుకు సమధానం చెప్పాల్సిన వాళ్ళంతా జనం డబ్బు తీసుకుంటూ జనం కోసం కాకుండా "స్వతంత్ర" కి పనిచేసినవాళ్ళు. ఓ మూసలో పోసినట్టు సాగే రాజకీయ ధోరణులకీ, వాటికి అద్దం పట్టే కథలకి భిన్నమయిన కథ ఇది.

మరో విశేషం. ఇందులో ప్రధానమైన పాత్రలు కల్పితం కావచ్చు గానీ, కొన్ని పాత్రలు నిజ జీవితంలోనివే. ఆ యండి కల్పితం కాదు, ఆ మంత్రులూ కల్పితం కాదు. ఆ సంఘటనలూ కల్పితం కాదు. ఇలాటి కథ తెలుగులో చదివిన గుర్తు నాకు లేదు. హే రాం సినిమాలో గాంధీ నెహ్రూల మధ్య కమలహాసన్ పాత్ర నడిచినట్టు. ఓ యండమూరి కథలో ఆంధ్రానించి వెళ్ళిన క్రికెట్ ఆటగాడు కపిల్దేవ్, గవాస్కర్లతో కలిసి ఆడతాడు. కానీ అందులో ఆ పేర్లు తప్పా వాళ్ళ ప్రవర్తన గానీ ఆటగానీ నిజ జీవితాన్ని ప్రతిబింబించదు.

సురేష్ ఈ కథతో నా అభిమాన రచయితల్లో ఒకరయ్యారు. పై చెప్పిన అన్నికారణాలతో పాటు, మరో ముఖ్య కారణం… భద్రాచలం , పాల్వంచ, ఇల్లందు, కొత్తగూడెం వంటి ముఖ్యమైన ప్రాంతపు నేపథ్యంలో సరయిన కథలే లేవనే కొరత ఈ కథతో కొంత తీరినందుకు.

ఇంత మంచి కథలో కూడా నాకు కొన్ని విషయాలు రుచించలేదు.

ఓ ప్రధానమైన ప్రశ్న మిగిలిపోతుంది ఈ కథ పూర్తిగా చదివినతర్వాత. పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలు తెలియని వ్యక్తి ఈ కథ చదివితే అనుకునేది "స్వతంత్ర" అనే కంపెనీ "ఆంధ్ర స్టీలు" ని మింగేసింది అని. నిజమే! అలాంటప్పుడు "ఆంధ్రా స్టీలు" బయటవున్న "చిన్న చిన్న వర్క్ షాపులూ, ఫౌండ్రీలూ, వాళ్ళ కుటుంబాలలో వేలకొద్దీ జనాలూ… అన్నీ ఎవడో మాంత్రికుడు చెయ్యి వూపినట్టు.." ఎలా మాయ మయి పోయాయి? అంతలా హీరోషిమా గుర్తొచ్చేలా అదీనూ! "స్వతంత్ర" పనిచెయ్యటానికి కూడా మనుషులు కావాలీ, వాళ్ళకీ ఈ సదుపాయాలన్నీ కావాలి కదా?

రెండో ప్రశ్న, ఆంధ్రా స్టీలు కార్మికులని "స్వతంత్ర" ఎందుకు తీసుకోదు? నా మట్టుకు నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసనే అనుకుంటున్నాను. కానీ ఈ కథలో మాత్రం ఈ ప్రశ్నకి సమాధానం మృగ్యం. అలాగని, ఆ కార్మికులని స్వతంత్ర తీసుకోవటంతో సమస్య తీరిపోయిందని కూడా నా అభిప్రాయం కాదు. అలా ప్రజల సొమ్ము కైంకర్యం చేయనిచ్చిన వాళ్ళు అప్పుడు కూడా జవాబు దారులే, అందులో రాజీ లేదు.

కథనంలో కూడా కొన్ని చోట్ల మరికాస్త జాగ్రత్త పడుండొచ్చేమోనని నా అభిప్రాయం. ఆ బ్రాకెట్టులు ఎక్కడపడితే అక్కడ ఎందుకో తెలీదు. అవి నా దృష్టిలో పూర్తిగా అనవసరం. సాప్ట్ వేర్ భాషలో చెప్పాలంటే, కథ ఓ ప్రోగ్రాం లాంటిది, బ్రాకెట్టులు అందులో కామెంట్లు. కథలో అవసరమైన ముఖ్యమైన వాక్యాలని బ్రాకెట్లలో పెట్టటం మూలంగా అవి execute కావని నా భయం. ఉదాహరణకి "…అయితే మరి ఇరవయ్యేళ్ళకల్లా మొదటిది దివాళా తీసింది…" అన్న వాక్యం.

పాత్రల పరిచయం చేసిన తీరుకూడా. ఈ కథలో ప్రధాన మైన సమస్య ఇందులో ఉన్న పాత్రల సంఖ్య. చెప్తున్న కథకి అన్ని స్థాయిలలో ఉన్న పాత్రల అవసరం వుంది, నిజమే. కానీ పరిచయం చేసేటప్పుడు మొదటి పేజీలో, మూడు లైన్ల వ్యవధిలో అయిదు పాత్రల్ని (జీపులో) పరిచయం చేస్తే పాఠకుడికి కష్టమవచ్చు. ఒకేసారి పది పాత్రల్ని సృష్టిస్తే ఎవరెవరో ఎలా గుర్తుపెట్టుకునేది? పాఠకుడు కథ మొదలు పెట్టినప్పుడు కొత్త కాలేజీ, కొత్త క్లాసులో చేరినట్టుగా ఫీల్ అవుతాడు. క్లాసులో 25 కొత్త మొఖాలూ, 25 కొత్త పేర్లూ, వాళ్ళ వాళ్ళ భాషలూ, వాళ్ళ వాళ్ళ వూర్లూ అన్నీ తెలిసొచ్చి, మనకి మితృలయ్యే టప్పటికి కనీసం రెణ్ణెల్లు పడుతుంది. చేరిన రోజే అందరూ ఒక్కసారిగా మీద పడి "హల్లో" అంటే అది రాగింగ్ అవుతుంది గానీ పరిచయం కాదు. అలాగే కథ! ఓ పాత్ర పరిచయం అయ్యాక దాంతో పాఠకుడికి ఓ లింక్ ఏర్పడాలి. ఇన్ని పాత్రలున్న కథలో ఇదెలా సాధ్యమో నాకు తెలీదు, ఇంకొంచెం బాగా పరిచయం చేసే మార్గం ఉందేమో చూడమని మాత్రమే నా సూచన. (చెప్పటం బహుతేలిక సుమా!).

సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. నాటకం C లేదా pascal లాంటిది. పాత్రలన్నీ ముందే డిక్లేర్ చేసెయ్యాలి, "పాత్రలు" అనే హెడ్డింగు కింద. కథ C++, అంతా Object Oriented, అవసరమయినప్పుడు మాత్రమే పాత్రని construct చెయ్యాలి. నాలుగు పేరాల తర్వాత, నాలుగు సంఘటనల తర్వాత అవసరమయ్యే పాత్రని ఇప్పుడే పరిచయం చెయ్యడం అనవసరం. నా Coding standards document ఒప్పుకోదు. కథ ముందుకూ వెనక్కీ నడవటం బానే వుంటుంది. కానీ ఇన్ని పాత్రలూ ఇన్ని సంఘటనలూ ఉన్న కథలో అలా చేస్తే కొంచెం తికమక (confusion) గా వుండే ప్రమాదం వుంది.

సాఫ్ట్ వేర్ భాషలో మళ్ళీ. ఓ సంఘటన, అందులోని వ్యక్తుల గురించి చెప్ప్తున్నప్పుడు, పాఠకుడి బుర్రలో ఓ చిత్రం పెయింట్ అయ్యి వుంటుంది. అప్పుడు సడన్ గా పాఠకుణ్ణి ముందుకో వెనక్కో లాగేస్తే, పాఠకుడు ఆ చిత్రాన్ని పక్కకి జరిపి (page fault) కొత్త చిత్రాన్ని పెయింట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది అవసరం, ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్నీ బేరీజు వేసి చెప్పాల్సి వచ్చినప్పుడు. కానీ పదే పదే ముందుకీ వెనక్కీ ఉయ్యాల వూపితే పాఠకుడికి చాలా శ్రమ. (ఫాఠకుడి బుర్రచేత exercise చేయిస్తానన్న రచయితకి క్రితం తానా ప్రైజు వచ్చింది, ఇంక అక్కడితో చాలు. అందరూ ఆ దార్లో వెళ్ళక్ఖర్లా!)

చివరిగా నాకు కొన్ని వాక్యాలు నచ్చలేదు. "కాగితాన్ని కిందకీ పైకీ శల్య పరీక్ష…" చెయ్యడం అని అనొచ్చా? నాకెందుకో అలా వాడడం సబబు కాదనిపిస్తోంది. నాకు తెలిసినంత వరకూ మనుషులకి మాత్రమే వాడతాం శల్యపరీక్ష అని. ఇది నా తెలియని తనం అయ్యుండొచ్చు కానీ, కాగితానికైతే "నిశితంగా పరిశీలించడం" అని రాయడం బాగుంటుందనుకుంటా. ఎవరైనా పెద్దవాళ్ళు చెపితే ఈ విషయంలో నేను వాదించకుండా బుద్ధిగా వింటాను. మరో రకంగా అలోచిస్తే, మనిషి మాటకన్నా ఆ కాగితం ముక్కకే ప్రధానమని, మనిషిని కూడా కాయితాల్లోనే చూడటం నేర్చుకున్నాము అని రచయిత smart గా చెప్పడానికి అలా వాడాడంటే, సరే. "ఆయనకి పాపం డబ్బు చేసింది" అన్న ముళ్ళపూడి మాటలా.

అలాగే జలీల్, సనాల సంభాషణలో "మిలియనీర్" అనే పదం రావడం నప్పలేదు. అది ఇంజనీర్ల మధ్య అయితె సరే గానీ జలీల్, సనాలకి సరిపడదు. ఆ ప్రాతంలో ఆ పాత్రలకి వాడదగిన పదం "షావుకారు". "ఈని తండల ఈడే సావుకారన్నట్టు" అంటే బాగుండేది.

పైన చాలా వరకూ నా అభిరుచి (Taste) కి సంబంధించిన విషయాల్లానే తోస్తోంది. పరిచయంలేని రచయితే గనక ఈ కథ రాసుంటే, మొదటి ప్రశ్ననీ, పాత్ర చిత్రణనుగురించిన నా శంశయాన్నీ మాత్రమే స్పృశించి వదిలేశేవాణ్ణి బహుశా. -

-అక్కిరాజు భట్టిప్రోలు

రిసైకిల్ : అస్థిత్వానికి అటూ ఇటూ గురించి

చాలా కాలం క్రితం నించీ నేను అంతర్జాలం లో అవీ ఇవీ రాస్తున్నాను. కథలు రాయటం కొత్త వ్యసనమయితే, ఇంటర్నెట్ లో జనాల్ని విసిగించడం దాదాపు పది పన్నెండేళ్ళనించీ నిరవధికంగా సాగుతూనే ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని బానే రాశాననీ అనిపిస్తుంది… కొన్ని నాకే నా అప్పటి అమాయకత్వం మీద జాలి కలుగుతుంది. ఒకటి మాత్రం నిజం… కథలు రాయటానికి ముందు నేను మరింత ఎక్కవగా నోరు (పోనీ కీ బోర్డు) పారేసుకునేవాణ్ణి. అలాటి అప్పటి రాతల్లోంచి నాకు దాచుకోవాలనిపించిన వాటిని మెల్లిగా నా బ్లాగు లోకి చేరుద్దామనుకుంటున్నాను.

నేను ఈ మధ్య రాసిని "కొత్త కథకుల కష్టాలు" అన్న వ్యాసం రాశాక నేను ఏకథనీ ఉదహరించకుండా పైపైన రాశానని కొందరన్నారు. పూర్వాశ్రమంలో ఒకటి రెండు కథల మీద నా అనాలిసిస్ రాశాను. వాటిని మళ్ళీ ఇక్కడ వేద్దామనుకుంటున్నాను.

________________________________________
కథ : అస్తిత్వానికి అటూ ఇటూ (తానా బహుమతి పొందిన కథ)
రచయిత : మధురాంతకం నరేంద్ర
కథ ప్రచురణ కాలం : జులై 2001
నా అనాలిసిస్ రాసిన కాలం : అగస్టు 2002
నా ఒరిజినల్ పోస్టు దాని అనుబంధ చర్చ ఇక్కడ.

ఇక నా పైత్యం :
అస్థిత్వానికి అటూ ఇటూ చదివినప్పుడు ఓ అభిప్రాయం ఏర్పరచుకుని, రచయిత చెప్పదల్చుకున్నది ఇదీ అని ఓ నిర్ణయానికి వచ్చాను. కానీ అలా అనుకుని వెనుతిరిగే లోపులో ఈ కథమీద రివ్యూలు రావటం మొదలు పెట్టాయి. కానీ ఏ రివ్యూలోనూ నేనకున్నట్టుగా ఈ కథని ప్రస్తావించకపోవడం నాకాశ్చర్యం వేసింది. అందుకని ఈ కథని నేనెలా అర్థం చేసుకున్నానో అందరికీ చెప్పే ప్రయత్నం ఇది.

ముందుగా ఓ ప్రశ్న. మనిషి మారడం అంటే ఏమిటి

సినిమా ఫక్కీలో విలన్ గారు ఆఖరిసీన్లో "నన్ను క్షమించమ్మా…. నేను మారాను" అని హీరోయిన్ కూతురుతో చెప్పి చేతికి బేడీలతో జీప్ ఎక్కి జైలు కెళ్ళిపోవడం లాంటి జోకులు కాదు నేను మాట్లాడుతున్నది!

తాను మనసా, వాచా నమ్మిన ఓ ఆలోచనని, సిద్ధాంతాన్ని, పంథాని… తన ఆలోచనలతోటి, "హేతువు" తోటి నిర్మించుకున్న తనదైన వ్యక్తిత్వానికి ఎదురువాదం ఒకటి వచ్చినప్పుడు, దానికి ఎదురు నిలిచే, ఎదురొడ్డే సమాధానం తన దగ్గర లేనప్పుడు, ఆ మనిషిలో సంచలనం కలగొచ్చు. దానికి ప్రతిగా వ్యక్తి తన "వ్యక్తిత్వాన్ని" తన "నమ్మకాన్ని" మార్చుకోవాల్సి రావచ్చు, మార్చు కోవచ్చు… నిజంగా ఆ మెచ్యూరిటీ, హుందాతనం ఆ మనిషిలో ఉంటే. ఎంతో మంది తత్వవేత్తలు కూడా ఇలా ముందుకూ వెనక్కీ లాగి పీకి తాము చెప్పినవాటికి తామే కాలక్రమంలో మార్పులూ చేర్పులూ చేశారని విని వున్నాం. ఇదీ మనిషి మారటం అంటే!

మరో రకం ఉంది. దీన్ని కూడా "మారటం" అనే అంటారేమో? అనొచ్చేమో? అలా అనొచ్చంటే, బహుశా నేనిది రాయక్కర్లేదనుకుంటాను!

చిన్నప్పుడు అమ్మ నేర్పించిందని నిద్దర్లేవంగానే ఎడంచేత్తో బ్రష్షు పట్టుకుని కుడి చేత్తో దాని మీద పేస్టు వేసుకుంటాం! ఓ ఎడమ చేతి వాటం గాడికి ఎప్పుడో పొరపాటున రివర్స్ చేసి చూసిందాకా… తానింతకాలం చేసింది తనకు నచ్చిన, సులువైన పని కాదనీ, అందుకు విరుద్ధమైన పనే నిజానికి తనకి తగిన పనీ అని గ్రహించ లేక పోవచ్చు! అది గ్రహించడం ఆ మనిషిలో మార్పు అని నేననలేను.

అదేరకంగా దేవుణ్ణో, మరో సిద్ధాంతాన్నో నమ్మటం, నమ్మక పోవటం కూడా. ఎవరో ఒకాయన అన్నాడు, ప్రపంచంలో 90% మంది భక్తుల 90% భక్తి, 90% మంది నాస్థికుల 90% నాస్థికత్వం రెండూ అబద్ధమే అని. అంకెల్లోకీ, ఈ విషయంలో నిజా నిజాల్లోకీ వెళ్ళద్దు గానీ, ఇందులో ఓ ముఖ్యమైన ప్రశ్న ఉంది.

ఎంతమంది ఆస్థికులు దేవుణ్ణి నమ్మటానికి, క్రతువులూ గట్రా చెయ్యడానికి తమకంటూ ఓ రీజనింగ్ ని ఏర్పరచుకుని వున్నారు? అలాగే, అలాంటి ప్రశ్నే నాస్థికులని కూడ అడగొచ్చు. చిన్నప్పట్నించీ చుట్టూతా వున్న పెంపకం వాతావరణం ప్రకారం అలా గుడ్డిగా చేసుకు పోవటమే తప్పా, సొంతంగా కూర్చుని ఆలోచించుకునే తత్వం ఎందరికి ఉంటుంది? ఎన్ని విషయాల్లో ఉంటుంది? తరచి చూసుకుంటే అందరిలోనూ ఇలా తెలియకుండా జీవితంలో రొటీన్ అయిపోయినవి, ఆలోచించకుండా ఆచరించుకుంటూ వస్తున్నవి ఉంటాయి అని నా భావన. అది చిన్న విషయాలనించి పెద్ద విషయాల దాకా! మనం నమ్ముతున్నామనుకుంటున్న కొన్ని నమ్మకాలతో సహా! "మడి కట్టుకో", "బొట్టు అడ్డంగా పెట్టుకో", "క్రాసు మెళ్ళో వేసుకో", "ముక్కు మీద చెయ్యి పెట్టుకో", "పిడికిలి బిగించు", "ముక్కు మీద చెయ్యి తియ్యకుండానే మమ అనుకో", "బిగించిన పిడికిలి గాల్లో ఊపి లాల్ సలాం అని అరువు"… ఇలాంటి వన్నీ కూడా.

మనిషి తనని తాను తన మేధస్సు తోటీ, హేతువు తోటీ తరచి చూసు కోకుండా చుట్టూతా వున్న వాతావరణాన్ని యథాతథంగా అనుసరించడం వల్లా, అలా అనుసరించేటట్టు అతగాణ్ణి తయారు చేయడం వల్లా వచ్చే స్థితి ఇది.

ఆ మనిషి ఆ వాతావరణం నించి బయట పడ్డమో, లేదా తనకి తాను సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఎదురయినప్పుడో అకస్మాత్తుగా తనకి తెలిసి వస్తుంది. తానింత కాలం ఆచరించిందీ, నమ్మిందీ తన ప్రవృత్తే కాదని. ఇలా జరగటం మనిషి మారడం కాదు, తనని తాను తెలుసు కోవడం!

నరేంద్ర గారి కథలో నా కదే కనపడింది. ఒకే ఒక్క సంఘటన, అదెంత బలమయినదయినా సరే ఓ ఆస్థికుడు నాస్థికుడు గానూ, ఓ నాస్థికుడు ఆస్థికుడు గానూ మారతాడంటే నేన్నమ్మను…. ఇందాకటి సినిమా విలన్ మళ్ళీ గుర్తొస్తాడు!

నేనీ కథని రెండు పాత్రల (సంజీవి, జానీ) కోసం విడి విడి గా చదివాను, ఒక్కళ్ళమీదే ఫోకస్ చేస్తూ. సంజీవి ఎక్కడా తాను వైదిక కర్మల్ని లోతుగా నమ్మేస్తున్నట్టుగాను, అందుకు తనకంటూ ఉన్న కారణాలను గానీ వివరించలేదు. అది అతగాడు కావాలని ఏర్పరచుకున్న వ్యక్తిత్వం కాదు. వాళ్ళమ్మ తనని నిష్టగా పెంచిందిట, ఇతగాడు భక్తితో, నిష్టతో అన్నీ నిర్వర్తించాడుట… అందుకని ఏ అపకారం జరక్కూడదుట! నిజంగా స్వతహాగా అంత భక్తి ఉన్న వాడయ్యుంటే ఏదో అపచారం జరిగుంటుందని మళ్ళీ శాస్త్రి గారిని చూడ్డానికి వెళ్ళుండే వాడు. అంతేగానీ అకస్మాత్తుగా నాస్థికుడయిపోడు.

కథంతా జాగ్రత్తగా చూడండి. ఆచారాలకీ, వ్యవహారాలకీ జరిగిన "ఎమెండ్మెంట్ల" గురించిన మాటొచ్చినా, ఆ పేరుతో జరుగుతున్న వ్యాపారాల గురించిన సంభాషణ అయినా దీని గురించిన బాధ, ఆసక్తీ జానీ లోనే ఎక్కువ కనపడతాయి. వీటి పట్ల ఓ అవగాహనా ఓ ఇతమిథమయినా ఆలోచన ఏర్పరచు కున్నవాడే అయితే సంజీవి ఆ సంభాషణల్ని అలా తుంచేయడం గానీ, ఆసక్తి చూపించకుండా ఉండడం గానీ చెయ్యడు. జానీ నిజంగా అంతటి నాస్థికుడే అయితే ఆ జరిగే వ్యవాహారాల్లో అంతకగా బాధపడి పోవాల్సిన పనిలేదు. సంజీవి ఏదో రకంగా పని చేసుకుపోదాం అని చూస్తుంటే, జానీ ఏమో ప్రతి దాన్నీ తరచి చూస్తున్నాడు.. ఎందుకని?

అంచేత, సంజీవి, జానీలలో వచ్చింది మార్పు కాదు. వాళ్ళు నమ్ముతున్నామనుకున్న నమ్మకాలనించి వాళ్ళకి విముక్తి దొరికింది. అసలు ఇదీ నేను నమ్ముతున్నది, ఇన్నాళ్ళూ ఎలా తెలుసుకోలేక పోయాను అనుకున్నది అంతే!

బాల్యంలో ఆలోచించడం, ప్రశ్నించడం నేర్చుకుంటున్న సమయంలో స్వంతంగా వ్యక్తిత్వాన్నీ ఏర్పరచుకునే అవకాశం లేకుండా , నెత్తిమీద భక్తి, ఆచారం, సిద్ధాంతం అంటూ ప్రశ్నించే అవకాశం కూడ ఇవ్వకుండా రుద్దేస్తే తయారయే అర కొర వ్యక్తులకీ, వ్యక్తిత్వాలకీ ప్రతీకలు ఈ పాత్రలు రెండూ, జానీ, సంజీవిలు.

- అక్కిరాజు భట్టిప్రోలు

శ్రీకారం

ఒకప్పుడు గుండెకాయ, తలకాయ కవలల్లా ఒకే సైజు లో ఉండి ఒకే మాట మాట్లాడేవి. ఏ సమస్యా ఉండేది కాదు. కాలం గడిచిన కొద్దీ ఒక్కోటీ ఒక్కో కోణంలో పెరిగి (?) పోయి నేనంటే నేనని విసిగిస్తున్నాయి. మనిషికి మనసే కాదు, అర కొర మెదడు కూడా తీరని శిక్షే!! కథలు రాయటం మొదలు పెట్టినా ఇద్దరు బాసుల్లో ఎవరో ఒకరు మొహం మాడ్చుకోవటమే తప్పా కలిసి కంగ్రాట్స్ చెప్పింది లేదు. ఎన్నో ఆలొచనలు వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరికి నచ్చక నాలోనే మిగిలి పోతున్నాయి. ఇలా పూర్తిగా ఓ రూపు తెచ్చుకోని ఆలోచనల్ని నలుగురితో పంచుకోవటానికే ఈ బ్లాగు.

నా మొదటి కథ మూడు బీర్ల తరవాత. ఇదసలు కథా కాదా అనే ప్రశ్న కూడా వేశారు అప్పట్లో. అది కథ అయినా కాక పోయినా కథ అని ప్రచురించబడిన నా మొదటి రచన. తన కేమి కావాలో తనకే తెలీని సందిగ్ధంలో ఉన్న ఓ మనిషి తిక్క వాగుణ్ణి రికార్డు చేసే ప్రయత్నం ఆ కథ. మదికీ, మేధకీ మధ్య లింకు తెగ్గొట్టేస్తే మనిషి వింత పశువే. ఆ లింకు తెగ్గొట్ట డానికి వాడిన ట్రిక్ మూడు బీర్లు! అందుకే అదే పేరు ఈ బ్లాగుకి సరిపోతుందనిపించింది!

కొన్ని కొన్ని సార్లు మనం చిన్నప్పట్నించీ మెదిలే కొన్ని భావాలకి అకస్మాత్తుగా ఓ కొత్త పుస్తకం చదవటం మూలంగానో, ఎవరితోనో మాట్లాడ్డం మూలంగానో సమాధానం దొరుకుతుంది. అలాటిదే ఇటీవల నేను చదివిన పుస్తకం "Emotional Intelligence (1, 2, 3)". దీన్ని మా ఆఫీసులో మానేజెమెంట్ కి అవసరమయిన పుస్తకంగా గుర్తించి చదవమన్నారు. నిజం చెప్పొద్దూ… అవసరానికి మించి ఏ మేనేజ్ మెంట్ పుస్తకాన్నీ నేను శ్రద్ధగా చదవలేను. అంతే నిరాసక్తంగా ప్రారంభించినా ఈ పుస్తకంలో నాకు కొన్ని ఊహించని సమధానాలు దొరికాయి.

(ముందుగా ఈ పుస్తకం గురించిన విమర్శలు కూడా చాలాఉన్నాయి అనిచెప్పాలి. ఇది పూర్తిగా "సైంటిఫిక్" ఏమీ కాదనీ, Fortune 500 కంపెనీల కోసమే, వారికి నచ్చేట్టుగా రాసిన పుస్తక మని కూడా విమర్శలున్నాయని పుస్తకం చదివాక అంతర్జాలం లో తెలుసు కున్నాను. అంత లోతుల్లోకి వెళ్ళేటన్ని తెలివితేటలు నాకు లేవు గానీ, ఆ పుస్తకం ఫేస్ వాల్యూ మీద ఆధారంగా మాత్రమే ఈ నా నాలుగు మాటలూను)

ఏమిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. మనకి పుట్టుకతో వచ్చేది ఎమోషనల్ మైండ్. తార్కికంగా ఆలోచించే మెదడు తయారవక ముందే ఇది తయారయి కూర్చుంటుందన్న మాట. ప్రపంచంలో ఎక్కడయినా కోపం, భయం, తాపం, విరహం, ప్రేమ లాంటి ఆవేశాలు మనిషిని కమ్మినప్పుడు శరీరంలో కలిగే భౌతిక మార్పులు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి
కోపం : ఆయుధాలని తీసుకుని యౌద్ధానికి సిద్దమయే మార్పులు శరీరంలో కలుగుతాయి
భయం : కాళ్ళల్లో రక్త ప్రసరణ హెచ్చుతుంది. పారిపోవడానికి గానీ దాక్కోడానికి గానీ శరీరం సమాయత్త మవుతుంది
సంతోషం: చెడు ఆలోచనలన్నింటినీ తొక్కిపెట్టి, శరీరమంతా శక్తిమంతమవుతుంది… ఆ మంచిని పూర్తిగా అనుభవించి దాచుకోడానికి.
ఆశ్చర్యం : కళ్ళు పెద్దవిగా తెరుచుకుంటాయి సాధ్యమయినంత ఎక్కువ వివరాలను సేకరించ డానికి.

ఇలాగే చంటి పాపకి ఎలా తెలుసు తల్లి స్థనం నోటి దగ్గరకు రాంగానే ఏం చేయాలో?

పాతకాలపు 9 తరగతి తెలుగు మీడియం చదివిన నాలాటి వాళ్ళకి వీటిని "అసంకల్పిత ప్రతీకార చర్యలు" అనీ "క్షోభ్యత" (impulse) అనీ అంటారని తెలుసు. అయితే అవి మన మస్తిష్కాల్లోకి ఎలా వచ్చాయి?

ఎవల్యూషన్లో మనని మనం కాపాడు కోవడానికీ, మన సంతతిని వృద్ధి చేసుకోవడానికి అవసరమయిన ఈ లక్షణాలు జన్యుపరంగా మనకి సంక్రమించాయని చెప్పుకోవచ్చు.

ఆతర్వాత తీరిగ్గా మనిషి పెరుగుతున్న కొద్దీ ఆలోచించే మెదడు (neocortex) పెరుగుతుంది. కానీ సైంటిస్టులు కనిపెట్టిందేమిటంటే మన ఆవేశపు మెదడు (emotional mind) ఒక్కోసారి ఏదయినా ప్రమాదమని గుర్తిస్తే, అదే ఇతర శరీర భాగాలకి ఏంచేయాలో చెప్పేస్తుందట. ఆలోచించే మెదడు విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని సరయిన ప్రతిక్రియని తయారు చేసే లోగా జరగాల్సింది జరిగి పోతుందన్న మాట! (Emotional Hijacking).

ఇలా ఇంత పేలవ మయిన Design తో ఎందుకు మన మెదడు తయారయింది అంటే చెప్పిన కారణం, ఎవల్యూషన్ అనేది చాలా మెల్లిగా జరిగే తంతు. మిలియన్ల సంవత్సరాలుగా మన ఆవేశపు మెదడు తయారయితే అతి తక్కువ సమయంలోనే మన ఆలోచించే మెదడు తయారయిందట. ఆది మానవుడు సింహం మీద పడితే వెంటనే ఏదో చేయాలి గానీ, తీరిగ్గా ఆలోచించే సమయం లేదు. అందుకే ఆవేశపు మెదడుకు శరీరం మీద ముందునించీ అదుపు ఉండింది. ఇంకో రకంగా చెప్పాలంటే జంతువులకు ఒక్క ఆవేశపు మెదడే ఉంటుంది, ఆలోచించే మెదడు దాదాపు ఉండదు.

అందుకే, మనం గనక ఆవేశపు మెదడు మీద ఆధారపడి పని చేస్తే ఆటవిక/ఆది మానవుల్లానో, చిన్న పిల్లల్లానో, జంతువుల్లానో ప్రవర్తిస్తామన్న మాట! అందుకే ఒక్కోసారి ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు మనకే వింతగా తోస్తుంది తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే. అవేశపు మెదడుతో అన్నీ సమస్యలే కాదు, కొన్ని సందర్భాల్లో దాని మూలంగానే బయట పడతాం కూడా! ఆ ఆవేశపు మెదడు లేక పోతే, పూర్తిగా తర్కం మీదే ఆధారపడే స్థితి వస్తే, మనకీ రోబోట్లకీ తేడా ఉండదన్నమాట!

నేనెప్పుడూ (ఈ పుస్తకం చదవక ముందునుంచీ) అనుకునే వాణ్ణి… చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు గానీ నిజానికి వాళ్ళు జంతువులతో సమానమని. ఈ పుస్తకం చదివాక అది రూఢి అయింది. మల్లిక్ చిట్టి కార్టూన్ లయినా, ముళ్ళపూడి బుడుగయినా చుట్టూతా ఉన్న Socially Accepted Behaviour కి బయటే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. నా అనుమానం పిల్లల్లో నిజానికి సహజమైన హింస కూడా దాగి ఉంటుందని. దాన్ని తగ్గించి సంస్కరించడమే వాళ్ళని జంతువులనుండి మనుషులుగా మార్చడం. (Domestication Of Emotions)

ఈ దృష్టిలో చూస్తే అన్ని మతాలూ చెప్పే టెన్ కమాండ్ మెంట్స్ లాంటి సూత్రాలన్నీ ఈ Domestication Of Emotions అనే ప్రక్రియ కోసమే నేమో? హేతు వాదం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నప్పటికీ హేతువుకి లొంగని ఇన్ని రకాల నమ్మకాలు, దేవుడూ, దెయ్యమూ, మతమూ తదితరములు ప్రపంచాన్ని ఎలా గుప్పిటిలోకి తీసుకున్నాయో అంటే ఇలా అర్థం చేసుకోవాలా?

ఈ సందర్బంలోనే న్యూయార్క్ టైంస్ లో మతాన్ని శాస్త్రీయంగా (scientific) ఎలా అర్థం చేసుకోవాలీ అన్న దాని మీద ఓ ఆర్టికల్ Darwin’s God వచ్చింది. డార్విన్ సిద్దాంతం ప్రకారం ఏ జంతువయినా తన సంతతి వృద్ధి పొందే మార్గంలో (survival) తన ప్రవర్తనని రూపొందించుకుని భావి తరాలకు అందిస్తుంటుంది. మరి ఈ ఎవల్యూషన్ సూత్రంలో మతాన్ని ఎలా అర్థం చేసుకోవటం?
ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ నమ్మటం (Faith) సర్వైవల్ కి ఎదురు నిలుస్తుంది (counter productive) కానీ సహాయం చెయ్యదు కదా! నిజానికీ అబద్ధానికీ మధ్య అంతరం చావునో బతుకునో నిర్ధారిస్తుంది అడవిలో. అక్కడ సింహం ఉంటే ఉంది లేక పోతే లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు, లేని దాన్ని లేనట్టు మాత్రమే నమ్మి ప్రతిక్రియ ఏర్పరచు కోవాలి అక్కడ. ఇక్కడ నమ్మకం (Faith) అన్న దానికి చోటేలేదు. అంచేత survival అనే ఒక్క సూత్రంతో మనిషి మతాన్ని, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాడో చెప్పలేం!

కాకపోతే పైన చెప్పిన survival అనేది జంతు రాజ్యంలో, అనాగరిక రాజ్యంలో. ఆ రాజ్యంలోంచి ఒక్క సారిగా బయట పడి ఇన్ని తెలివి తేటలుసంపాయించు కున్న మనిషి ఆ జంతు survival instincts లోంచి బయట పడ్డానికే, ఆ ఆవేశపు మెదణ్ణి కాస్త ప్రలోభ పెట్టి, తర్కాన్ని పీఠ మెక్కించడానికి కాస్త మత్తు మందు కావాలి… ఆ మందుకే మతమనీ, ఆచారమనీ, సాంఘిక కట్టుబాట్లనీ ఇన్ని పేర్లు!

ఇంత కాంట్రడిక్షన్ నేను ఇంతకు ముందు వినలా. హేతువుని పీఠమెక్కించడానికి మతం కావాల్సొచ్చిందని తేల్చాం!

అందుకే నాకున్న మరో ప్రశ్న, మనిషి కాకుండా వేరే ఏ జంతువయినా దేవుణ్ణి నమ్ముతుందా అని. అంటే మన శ్రీకాళహస్తి కథలో కనపడే ఏనుగూ, సాలె పురుగూ, పామూ నిజంగా ఉండే అవకాశం ఉందా అని! ఈ పుస్తకమూ, ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నా కనిపించేది… అది సాధ్యం కాదు అని! జంతువులకు Domestication Of Emotions అనేది ప్రమాదం…. మనిషికి అవసరం!

ఇంత ఆలోచించాక అప్పుడు నేను రాసిన మూడు బీర్ల తర్వాత కథ నాకే కొత్తగా అర్థమయింది. నేను చేసిందల్లా ఆ మనిషిలోని ఆలోచనల మెదడికి విశ్రాంతి నిచ్చి, వాడి ఆవేశాలకి పట్టం గట్టి… ఓ జంతువుని సభ్యసమాజం లోకి వదిలి చోద్యం చూశా!

ఇప్పుడదే పని నాకు చేయాల్నుంది ఇక్కడ! అందుకే… ఆ మూడో బీరు కావాలి…. ఎవరక్కడ!!

అక్కిరాజు భట్టిప్రోలు