వ్యాసం – మేధావులూ స్టీరియో…

 


మేధావులూస్టీరియోటపులూ

————————————

 

 

కొన్ని మనకందరికీ తెలిసిన విషయాలు పరిశీలిద్దాం

 

- పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే వాళ్ళంతా కిరాతకులు. వీరిలో మానవత్వం పూర్తిగా మృగ్యం.

- ప్రభుత్వ అధికారులంతా లంచగొండులు.  పదో పరకా ఇస్తే చాలు (ఇస్తే తప్పా) పని కాదు.

- సినిమా హీరీయిన్లందరికీ రేటు ఉంటుంది.  ఆందరూ డబ్బిస్తే వచ్చేవాళ్ళే! అసలు వాళ్ళకి వేషాలు రావటమే అలా వస్తాయి!!

- అమెరికాలో వాళ్ళకి ప్రేమలు తెలీవు.  అమ్మా, నాన్నా, అక్కా, చెల్లీ లాటి ప్రేమలన్నీ ఒక్క మన దేశంలోనే ఉంటాయి

- భారతీయులందరూ చాలా తెలివయిన వాళ్ళు.  అమెరికన్ల కన్నా, జపనీయులకన్నా, జర్మనీ వాళ్ళకన్నా మన వాళ్ళంతా తెలివయిన వాళ్ళే

- డబ్బున్న వాళ్ళకి నిజానికి సుఖం ఉండదు.  పాపం వాళ్ళకి ఎంత సేపూ ఇన్ కం టాక్సు వాడూ వచ్చి పట్టుకుంటాడా, డబ్బు ఎలా కాపాడు కుందామా అన్న యావ తప్పించి,  కడుపునిండా తిన లేరూ, కంటినిండా నిద్రా పోలేరూపాపం.

- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (ఐటి) సంబంధించిన బిపివో, సాఫ్ట్ వేర్ వుద్యోగులు అందరూ తాగుబోతులూ, తిరుగుబోతులూ, జేబుల్లో కండోములు పెట్టుకు తిరుగు తారు,  రోజూ పిజ్జా బర్గర్లు మాత్రమే తింటారు,  పబ్ లూ, నైట్ లైఫ్ లాంటి వన్నీ వీళ్ళ కోసమే,   అమ్మానాన్నలని పట్టించుకోరు  అమెరికాని పూర్తిగా సమర్థిస్థారు, అసలు మానవ సంబంధాలన్నీ నాశన మయి పోతుండ డానికి సాఫ్ట్ వేర్ కంపెనీలే కారణం!

 

ఇవన్నీ నిజాలని మనకెలా తెలుసు అని ఆడగడం పిచ్చి పశ్న. మనకి తెలుసంతే. 

 

నేను అమెరికాలో ఉండే రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నా వచ్చారు వాళ్ళని చూడ డానికి.    పెద్దావిడ భారత దేశం కాదుకదా, ఆంధ్ర రాష్ట్ర్రం కూడా దాటి బయటకి వెళ్ళలేదని ఆవిడ మాటల్లోనే తెలిసింది.  రోజు టివీ లో హత్య తాలూకు ఉదంతాన్ని చెప్తున్నారు.  ముగ్గురు నల్లవాళ్ళు అనుమానితులు. ఇంట్లో చొరబడి దోచుకునే ప్రయత్నంలో ఇంటి ఆసామిని చంపేశారు అని  వాళ్ళ మీద అభియోగం.   పెద్దావిడ కథ విని, " నల్ల వాళ్ళంతా ఇంతే ఎక్కడున్నా.  దేశంలో వీళ్ళని ఎందుకు ఉండ నిస్తున్నారో"  అనేసింది.  నాకిప్పటికి అర్థంకాని విషయం, నల్ల వాళ్ళ విషయంలో ఇంత ఖచ్చితమయిన అభిప్రాయం ఆవిడకి ఎలా ఎక్కడ తల కెక్కిందనేది.  

 

అందుకే కొన్ని ప్రశ్నలు మనం అడక్కూడదు. మనకి తెలుసంతే!

 

పోలీసు డిపార్ట్ మెంట్ లోపని చేసే వాళ్ళంతా ఏదన్నా వేరే గ్రహం నించి వచ్చారా?  లేదా పూర్తిగా కిరాతకులనే అందులోకి చేర్చుకుంటారా అనేది మనకి తెలియదు.  లేక పోతే అందులో చేరగానే  అలా కిరాతకంగా మార్చే ట్రెయినింగ్ ప్రోగ్రాం ఏదయినా ఉండొచ్చు. ఏదయినా సాధ్యమేవిషయమేదయినా, వాళ్ళంతా కిరాతకులే అని మనకి తెలుసు.   కాకపోతే,  మన అన్నయ్యో తమ్ముడో, బాబాయి కొడుకో ఐపియెస్ లో సెలెక్ట్ అయితే  మాత్రం వాడొక్కడే విషయానికి మినహాయింపు.  వాడొక్కడే గంజాయి వనంలో తులసి మొక్క!

 

అలాగే మన బంధువులు కాని ప్రభుత్వోద్యోగులంతా దొంగలే!  అందులో చేరగానే లెక్కలు గట్టి మరీ అందరికీ లంచాలు అందించేస్తుంటారు అని కూడా మనకి తెలుసు.    సినిమా వాళ్ళగురించిన కథల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

ఇక డబ్బున్న వాళ్ళగురించి.   "మహారాజు మనీ పర్సు మాయంటావూ" అని మహాకవి గద్దించి అడిగినా, మనీ పర్సులో మాత్రం సుఖంలేదని అది లేని చాలా మందికి అదోమాదిరి వాళ్ళకే తెలియని జాలి మహారాజుల మీద.   భవంతుల్లో ఉండే వాళ్ళకి ప్రేమలు కరువు.  కలిసి భోజనం చేసే తీరికి కూడా ఉండదు.   టాంకు బండ్ మీద చాట్ తినేంత వెసులు బాటూ, క్రాస్ రోడ్దు సినిమా హాల్లో టికెట్ కోసం కష్టపడి అది సంపాయించి చూట్టంలోని థ్రిల్ వాళ్ళకి తెలీదు.   వాళ్ళకేం తెలుసు, కుండలో ఉండే నీళ్ళ రుచి?   అంతా కృత్రిమ మయిన జీవితాలు…. పాపం.

 

భవంతుల్లో వాళ్ళు అవన్నీ(టాంకు బండ్ చాట్, క్రాస్ రోడ్స్ లో సినిమా చూడ్డం)  చేస్తారో లేదో మనకి తెలీక పోయినా, అవన్నీ చెయ్యడం వాళ్ళక్కూడా ఇష్టమేననీ, అలా చెయ్యలేక పోతున్నారనీ,  అవి  లేనందుకు వాళ్ళంతా బాధ పడుతున్నారని మనకి తెలుసంతే!  పోనీ వాళ్ళకివేమీ కానీ మరో జీవితమేదో ఉండి అంతో కొంత వాళ్ళుకూడా ఆనందాలని అనుభవిస్తున్నారేమో అనే అనుమానం మనకి రాకూడదు.

 

వింతగా అనిపించచ్చు గానీ, డబ్బున్న వాళ్ళమీద జాలి పడుతున్నామని కూడా తెలీకుండా జాలిపడే కథలు, అవికూడా అభ్యుదయ రచయితలు రాస్తున్నవి మనం సులభంగా చూడచ్చు.   కథల్లో డబ్బున్న వాళ్ళంతా చెడ్డ వాళ్ళు (సినిమా విలన్లు) , లేదా జాలి పడాల్సినంత బాధితులూ, అమాయకులూ.  కానీ మనంత తెలివయిన వాళ్ళూ, మనంతగా జీవితాన్ని అనుభవించి ఆనందించే వాళ్ళూ అయ్యే  అవకాశం లేదు. 

 

ఇలాటి మరో కొత్త సమూహం మధ్యలో ఏర్పడ్డది ఐటి ఒకటి.  పోలీసు వాళ్ళలాగా వీళ్ళు కూడా మరో  గ్రహం నించి వచ్చిన వాళ్ళే.  వీళ్ళకి విలువలూ ఉండవు.  మంత్రిగారు  నైట్ లైఫ్  పబ్బులూ, బారులూ తెల్లవార్లూ తెరిపించి,  ఐటి  వాళ్ళని హైదరాబాద్  రప్పించాలంటే,   ఐటి కంపెనీలు ఇక్కడ వేళ్ళూను కోవాలంటే ఇవ్వన్నీ తప్పవూ అంటాడు.   టీవీ వాడు నగరంలో పార్టీ కల్చర్ పెరిగి పోయిందనీ,  అసభ్య నృత్యాలు, పడుపు వృత్తి పెరిగి పోయిందనీ, ఐటి ఉద్యోగుల కారణంగా నే ఇవన్నీ జరుగుతున్నాయనీ గంట సేపు వాడి అత్యంత సభ్యమైన కార్యక్రమాల మధ్య చెప్పేస్తాడు.    రచయిత కాల్ సెంటర్ లో పనిచేసే యువకుడి జేబులోంచి పొర పాటున జారిపడే కండోమ్ గురించి కథ రాస్తాడు.  దేశంలో విడాకులు పెరిగిపోవటానికి కూడా వీళ్ళే కారణం.  ఐటి లో పనిచేసే వాళ్ళందర్నీ ఇలా తయారు చేయడంలో కంపెనీలకీ, అమెరికాకీ ఏదో లాభం ఉండివుండాలి.

 

పోలీసు కాబోయే వాడు పుట్టంగానే వాడి చేతిలో బుల్లెట్ ఉంటుంది.  ప్రభుత్వోద్యోగి కాబోయే వాడు అమ్మా అనకుండా ఆమ్యామ్యా అంటాడు.   ఐటి లో చేరబోయే వాడి గుప్పెట్లో పుట్టంగానే కండోమ్ ఉంటుంది.   ఇవన్నీ మనకి  పూర్తిగా ఎలాగో ఓలాగ తెలిసిపోయిన సత్యాలు.  

 

మనకి తెలియని విషయాల గురించి, సమూహాల గురించీ  రాసే టప్పుడు చాలా జాగ్రత్తలు  తీసుకోవాలని చెప్పే అస్థిత్వ వాద రచయితలు, పై సమూహాల గురించి రాసేటప్పుడు విషయాలని మర్చేపోతారు.     దళితుల కి సంబంధించి, సినిమాల్లో (ఇప్పుడు టీవీల్లో) చూపించే పతివ్రత / ఆదర్శ కోడలూ లాటి ఆడ పాత్రల గురించి, ప్రతి మైనారిటీ వాణ్ణీ టెర్రరిస్టుగా ముద్రించే   దౌర్భాగ్యాల గురించీ  ఎన్ని మూసలని మన చుట్టూ?  వీటి పట్ల మేధావి వర్గమంతా  ఏనాటి నించో నిరసన చూపిస్తూనే ఉన్నారు.   ఇవన్నీ బాధిత గ్రూపులూ, మన ముందు నగ్నంగా అన్యాయం జరుగుతోంది కనుక మూసల్ని వెంటనే తునుమాడాలని వీళ్ళంతా ఉన్న శక్తినంతా ఒడ్డడం ముదావహం.

 

అదే సందర్భంలో, మూస అనేది ఏదయినా ప్రమాదమే అని గుర్తించక పోతే ఎట్లా?  మూస అనేది మూల నించి వచ్చినా వ్యతిరేకించే విశాల దృక్పథం మనకి ఎప్పటికి వచ్చేను?   మనకి పనికొచ్చే మూసల్ని సమర్థించి పనికి రాని వాటిని వ్యతిరేకిస్తే మేధావుల విశ్వసనీయత తగ్గిపోదా?    విజ్ఞత అంటే "బారతీయులంతా తెలివయిన వాళ్ళే" అనే మనకి నచ్చే ఆలోచనని కూడా ఖండించి  సంయమనంతో… "మా కుండాల్సిన మూర్ఖులు మాకూ ఉన్నారు" అని చెప్ప గలగటం.

 

మరో సారి పై సమూహాల గురించి చూద్డాం.  పోలీసులు కానీ, ఇతర ప్రభుత్వోద్యోగులు కానీ,  ఐటీ కానీ అనేక ఇతర సమూహాలు కానీ ప్రధానంగా మన మధ్య తరగతి నించే ఏర్పడ్డాయని వేరే చెప్పక్కర్లా.    మధ్యతరగతి విలువలు వీరిలో ఇబ్బడి ముబ్బడిగా వారినే వెంటాడి ఉంటాయని దగ్గర్నించి చూసే వారికి చెప్పక్కర్లా.   ఐటీ కంపెనీల్లో లంచ్ టైంలో నూటికి తొంభై తొమ్మిది మంది తినేది  అన్నం, కూరా!   సందు దొరికితే చూసేది తెలుగు సినిమాలే.   కంపెనీ ఇచ్చే మెడికల్ ఇన్స్యూరెన్స్  ప్రధానంగా ఉపయోగ పడేది ఉద్యోగస్థుల తల్లి దండ్రులకే.     అన్ని ఇతర ఉద్యోగస్తుల లాగానే వీళ్ళలోనూ చాలా కష్టపడే వాళ్ళూ, పని దొంగలూ ఉంటారు.    పగలూ రాత్రీ కష్టపడి పోయి  కుటుంబంతో గడపలేక పోతున్నామని బాధపడే వాళ్ళు మిగాతా చోట్ల ఎంత మంది ఉంటారో ఇక్కడా అంతమందే ఉంటారు. 

 

మరి కండోమ్ గొడవా, ఐటీ గాళ్ళ నైట్ లైఫ్  కథలూ విలువలూ లేని వాళ్ళ జీవన శైలికి సంబంధించిన గొడవా .. ఎలా అర్థం చేసుకోవడం?   (ముందుగా శీలం, పాతివ్రత్యం లాటి మూసల్ని వ్యతిరేకించే అభ్యుదయ వాదులు, ఐటీ ఉద్యోగుల శీల వర్తనమీద ఎందుకంత గొడవ చేస్తున్నారో కనుక్కోవాలి.)

 

అసలు విలువలనే వాటిని ఎవరైనా ఎందుకు ఆచరిస్తారో గమనిద్దాం.  ఒకటి మనః స్ఫూర్తిగా   విలువని  నమ్మటం. రెండోది, విలువని పాటించడం ద్వారా చుట్టూ ఉన్న సమాజపు అంగీకారం పొందటం.

 

ఉదాహరణకి నేను కుల వ్యవస్థని వ్యతిరేకించే వాణ్ణనుకోండి.  అప్పుడు విలువని పాటించడానికి కొంత నష్టమొచ్చినా భరిస్తాను.  అది వెలివేయ బడటం కావచ్చు, ఉద్యోగమో మరో లాభమో కోల్పోవటమో కావచ్చు.  ఇలా వ్యక్తులు పాటించే విలువలు నిజాయితీగా నాలుగు కాలాల పాటు ఉంటాయి.   మత సిద్ధాంతాలనో, రాజకీయ, ఆర్థిక, సాంఘిక సిద్ధాంతాలనో మనః స్ఫూర్తిగా నమ్మే వాళ్ళు కోవలోకి వస్తారు.

 

ఇక రెండవ రకం వాళ్ళు.  శీలం పోతే వీధిలో ఉండనివ్వరు.  మధ్యం పుచ్చుకునే వాడికి మా కులంలో స్థానం లేదు.  లంచం పుచ్చుకునేవాడికి మా పార్టీ సీటు ఇవ్వదు.  ఇలాటివి.    మధ్యతరగతికి  ఇలాటి  దాటకూడని గీతలు లెక్కలేనన్ని.  మధ్యతరగతి లో ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా చాలా ఎక్కువ.  ఒకరి ఒప్పుకోలు ఒకరికి లేకపోతే బతకలేని దౌర్భాగ్యం మధ్యతరగతి ప్రధాన లక్షణం.      పైకి కనపడని గీతల వల్ల మనుషుల్లో కనపడని ఆత్మవంచన (హిపోక్రసీ) పెరుగుతుంది. నాకు కులవ్యవస్థమీద నమ్మకం లేకపోయినా, మా తాత ఆస్థి రావాలంటే ఆయన చెప్పినట్టు వేరే కులం వాడికి తిండి పెట్టక పోవడం…. మందు కొట్టాలనున్నా వీధిలో రానివ్వరని దొంగ చాటుగా తాగి, పాన్ నమిలి ఇంటికి రావటం…. ఇలాటివి.     వీటన్నింటినీ విదిలించుకుని ఎప్పుడు బయట పడదామా అన్న కసి, కోపం అలా రోజు రోజుకూ లోపల్లోపలే పెరిగి పెరిగి మధ్యతరగతి మనుషుల్ని లోపల్నించి కబళించుకుంటూ వస్తాయి.    వాటి లోంచి బయట పడ్డానికి  వాళ్ళు మాతృ బాషనైనా పణంగా పెడతారూ, పిల్లల బాల్యాన్నయినా బలిపెడతారు.   జైలులాటి కార్పొరేట్ కాలేజేల్లో పదేళ్ళకి పైగా నైనా సరే హింస పెట్టి  మరీ ఎంసెట్లు రాయిస్తారూ  నిజంగా ఇదంతా హింసే

 

ఫలితం????   సరయిన సీటు దొరికి ఐటీ లో దొరికే ఉద్యోగం కావచ్చూ, దొరక్క మాదిరి ప్రభుత్యోగం కావచ్చూ, పోలీసు ఉద్యోగం కావచ్చూ.  హింస కి, కోల్ఫోయిన స్వేచ్చకి మరి పరిష్కారం ఏది?  అది ఒక్కోచోట ఒకలా బయట పడుతుంది.

 

ఐటి ఉద్యోగుల్లో అక్కడక్కడా కనపడే వికృతాలకి కారణం ఐటీ కంపెనీలనుకోవటం అమాయకత్వం.  దానికి కారణం, మధ్యతరగతి నించి బయట పడ్డ, మరే విలువలూ పాటించక్కరలేని స్వేచ్చ.    పని చేయచ్చు.  పది మంది మధ్యతరగతి యువకులు మాదిరి పట్టణం (ఖమ్మం, కర్నూలు లాటి) లో వెతికి మనిషికో కోటి రూపాయలు ఇచ్చివద్దాం.  వాళ్ళలో ఎంతమంది పబ్బుల్లో కి వెళ్తారు,  వాళ్ళ శీలాలు(?) చెడగొట్టుకుంటారూ, ఎంత మంది జీవన విధానం మారినా విలువలు(??) మారకుండా ఉంటారూ అని చూడచ్చు.   ఇప్పుడు ఐటీ లో ఉండే పది మంది ఎలావున్నారో అలాగే పది మందీ తయారవుతారని నా నమ్మకం.

 

 

 

ఇదంతా నేను ఐటీ కంపెనీలనీ, ఉద్యోగులనీ సమర్థించడానికీ అనుకుంటే నే చేయగలిగేదేమీ లేదు.  నిస్సందేహంగా ఐటీ లోనే జీవితం గడుపుతున్న వాడిగా నాకు నా వృత్తిమీద చాలా గౌరవం.  నా చుట్టూ కష్టపడి పని చేస్తూ కుటుంబాలకి వాళ్లవంతు సహకారాలని అందిస్తున్న వారి పట్ల జరుగుతున్న మూస ప్రచారం పట్ల నాకు సహజంగానే ఏవగింపు ఉంది.  విషయం ఒప్పుకోవడంలో నాకేమీ మొహమాటం లేదు.

 

ఇక సైద్ధాంతికంగా ఆలోచించి ఐటీ కంపెనీల గురించీ, గ్లోబలైజేషన్ పేరుతో సృష్టించ బడుతున్న అకస్మాత్తు ఆర్థిక అసమానతల గురించి మాట్లాడే విషయం వేరు.   అసమానతలు ఐటీ అవొచ్చూ, బయోటెక్ అవచ్చూ, మన దేశంలోనే ఉన్న టాటా, రిలయన్స్ లాటి కంపెనీలు కావచ్చు.    కొన్ని కోట్ల్ల మంది బతికే వ్యవసాయం, చేనేత, చేతి వృత్తులూ సర్వ నాశన మయి పోయి,  కొన్ని  వేలు, మహా అయితే లక్షల మందికి మాత్రమే ఉపాధి అదికూడా చాలా ఎక్కువ జీతం దక్కేలా చేసే హైటెక్ కంపెనీలకి చేయూత నిచ్చే ఆర్థిక విధానాలని సమర్థించాలా అనే ది పూర్తిగా వేరే విషయం.   వ్యాసం లో నేను చెప్ప దలచుకున్నది  కంపెనీల్లో పనిచేసే అందరి లాంటి మనుషుల గురించి.   వాళ్ళ ల్లో కూడా ఇతర సమూహాల్లో లాగానే ఆరోగ్య కరమయిన మనుషులూ, అనారోగ్య కరమయిన మనుషులూ కూడా అదే పాళ్ళలో ఉంటారని గుర్తించమని ప్రాధేయ పడుతున్నా.   

 

అక్కిరాజు భట్టిప్రోలు

 

 

 

 

 

 

3 comments to వ్యాసం – మేధావులూ స్టీరియో…

  • వర్గం మారితే వైరుధ్యం మారుతుంది. మా బంధువు ఒకతను సర్పంచ్ గా పని చేసే రోజుల్లో వాళ్ళ అబ్బాయి పాలక వర్గానికి అనుకూలంగా మాట్లాడేవాడు. పోలీసులు బూటకపు ఎంకౌంటర్లు చెయ్యడాన్నీ, పౌర హక్కుల నాయకుల్ని హత్యలు చెయ్యడాన్నీ సమర్థించేవాడు. అతని తండ్రికి సర్పంచ్ పదవి పోయి చాలా కాలం అయ్యింది. అతను, అతని అన్న టీచర్ ఉద్యోగాలలో చేరారు. అతను టీచర్ అయిన తరువాత పాలక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. టీచర్లకి కూడా పాలక వర్గం పై అసంతృప్తి ఉండడం వల్ల. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అతను రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల మంచే జరిగింది అన్నాడు. రాజశేఖర రెడ్డి నల్లమలలో అనేక మంది మావోయిస్టులని కాల్చి చంపించాడు, అందుకే అతను నల్లమల కొండల మీదే హెలికాప్టర్ కూలి చనిపోయాడు అని అన్నాడు. మావో జెడాంగ్ అభిమానినైన నాకు అతని మాట తీరు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వర్గం మారితే వైరుధ్యం కూడా మారుతుంది అని గతితార్కిక భౌతికవాదం అర్థమైన నాకు బాగా తెలుసు. ఆ అబ్బాయికి లంచాలు బాగా వచ్చే పోలీస్ ఆఫీసర్ లాంటి ఉద్యోగం వస్తే అతను మాట మార్చేవాడు కాదు. తన పాట స్టైల్ లోనే పాలక వర్గాన్ని సమర్థించేవాడు.

  • sravya

    చాల బాగా వ్రాసారండి మీరు ! ఇది చాలామంది కి ఉన్న జబ్బు ఇలాగ ఒక ముద్ర వేయటం ఆలాంటి వాళ్ళను పట్టించుకోవటమే మనం చేయగల పని .

  • ఆర్థిక అసమానతల క్వెషన్ ఆలోచించాల్సిందే. గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసులవి లంచాలు వచ్చే ఉద్యోగాలు. వాళ్ళ ఆర్థిక స్థితి సాధారణ మధ్య తరగతి కంటే ఉన్నత స్థితిలోనే ఉంటుంది. ఈ ఉద్యోగాలలో చేరేవాళ్ళు లంచం ఇచ్చి ఉద్యోగం కొనడానికి సిద్ధ పడతారు. బ్యాంక్ ఉద్యోగులకి లంచాలు రావు. ఒకవేళ తీసుకున్నా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు రికార్డుల్లో తేడాలు వస్తే తెలిసిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగులకి జీతాలు తక్కువ. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఎప్పుడైనా వాళ్ళని ఉద్యోగం నుంచి తీసెయ్యవచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కువ జీతం ఇచ్చేవి ICICI, HDFC లాంటి బ్యాంకింగ్ కంపెనీలు & సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రమే. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీలు నష్టపోయాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి క్రెడిట్ కార్డులూ, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకి లోన్లూ ఇచ్చిన బ్యాంక్ లు కూడా నష్టపోయాయి. గతంలో నగరాలకే పరిమితమైన ICICI & HDFC జిల్లాలలో కొత్త బ్రాంచ్ లు తెరిచి తమకి నష్టం రాకుండా జాగ్రత్త పడ్డాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం జిల్లాలలో బ్రాంచ్ లు తెరవలేవు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ కీ, సాఫ్ట్ వేర్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ కీ చాలా తేడా ఉంది. సాఫ్ట్ వేర్ బిజినెస్ కి పెద్ద డిమాండ్ లేదు కాబట్టి జనం ఎక్కువగా ఇతర సెక్టార్ లలో ఉద్యోగాలు వెతుక్కోవాలి. ఇతర ఉద్యోగాల కోసం వెతికేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి లంచం కూడా ఇచ్చి ఎందుకు చేరుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువ జీతం + పెన్షన్ + లంచాలు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకి జీతాలు పెంచితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంత పోటీ ఉండదు. ప్రైవేట్ కంపెనీలకి వ్యక్తిగత లాభాలు ముఖ్యం కనుక తమ ఉద్యోగులకి జీతాలు పెంచవు. ప్రైవేట్ కంపెనీలని జాతీయం చేసి ఉద్యోగుల జీతాలు పెంచొచ్చు. అప్పుడు ప్రైవేట్ వ్యాపారుల నుంచి రాజకీయ పార్టీలకి విరాళాలు రావు. ఈ వైరుధ్యాల గురించి మీరు ఆలోచించినట్టు లేదు.

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>