కథ – మూడు బీర్ల తర్వాత

 

 

 

 “హేనికెన్ ప్లీజ్”  కౌంటర్లో నల్లావిడ ఆకుపచ్చ హేనికెన్ బాటిల్ ఓపెన్ చేసి, నాప్కిన్ తో తుడిచి నా ముందుకు తోసింది.

“థాంక్యూ” అంటూ దాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాను.  ఆవిడ దాన్ని ఎంత శుభ్రంగా తుడిస్తే  మాత్రం ఏం ప్రయోజనం! చల్లటి బాటిల్ మీద మళ్ళీ నీళ్ళు చేర్తున్నాయి.

వాతావరణంలో నీటి ఆవిరి యుండును, మనుషుల్లో ఆశలు ఉండును, మనసుల్లో కొరతలు యుండును , ఇది భౌతిక శాస్త్రం.

“హే రావ్”

“హే మార్క్”

“రావ్, నువ్వు ఈ పార్టీకి రావని చెప్పాడు డేవ్, నిన్నిక్కడ చూడ్డం ఎంతో బాగుంది”

ఏడిశావ్, నీకూ నాకూ అంత స్నేహం లేదని మనిద్దరికీ తెలుసు.  రేపో ఎల్లుండో నాతో ఏదో పని కావల్సి వుంటుంది. యమ అర్జెంటుగా ఈ రోజు స్నేహం చేసెయ్యాలని వచ్చుంటావు. ఈ పార్టీకి నే రాక పోయినా నీ కొచ్చే నష్టమేమీ లేదని నాకు తెలుసులే.

“లేదు మార్క్, నేనూ రాననే అనుక్కున్నాను.  మాకు రిలీజ్ దగ్గర పడింది కదా, కొంచెం కష్టంగా ఉంటోంది.  మధ్యాహ్నం ఎందుకో నెట్వర్క్ డౌన్ అవటంతో అక్కడింక చెయ్యగలిగిందేమీ లేదు, అదీ గాక……”

“ఓ అలాగా ఏమయితేనేం నువ్వు రాగలిగావు, అదే సంతోషం. మళ్ళీ కలుద్దాం”

నా మాటలు పూర్తవక ముందే సంభాషణ అర్థాంతరంగా ముగించి ఎంతో సభ్యతగానే సెలవు తీసుకున్నాడు మార్క్.  నే పార్టీలో కనపడినందుకే మహదానంద పడిపోయిన మార్క్.  పోనీలే ఇదే నయం.  ఇండియాలో అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ గంటా ఇక్కడే ఉండి ఇద్దరికీ విసుగు తెప్పించే వాడు.

మెల్లిగా అక్కణ్ణించి కదిలాను.   దూరంగా మా గ్రూప్ వాళ్ళు కూర్చుని ఉన్నారు.   మరి కొంచెంఒ దూరంలో దేశీ గాళ్ళంతా అంటరాని వాళ్ళలా మరో గుంపుగా కూర్చుని వున్నారు.  ఈ రెండిట్లో ఎటు వైపుకు నడిచేది?

 

అమెరికా వాడి పక్కన కూర్చుని  వాడి బెడ్రూం ఎలా పెయింట్ చేశాడో, వాడి కుక్క గాడికి వచ్చిన రోగం ఏమిటో వినడం బాగుంటుందా లేక భారతీయ జనాభా పక్కన కూర్చుని  హెచ్ 1   వీసా కోటా పెరిగా అవకాశాల గురించీ, ఫలానా  పాండేకి ఫలానా ఇంటర్నెట్ కంపెనీవాడు ఎంత స్టాక్ ఆప్షన్ ఇచ్చిందీ, వాడెంతలో మల్టీ మిలియనీర్ అవబోయేదీ…..   కాదూ కూడదూ అంటే, కొంత మందూ దేశభక్తీ  కల్సికట్టుగా ఎక్కువయితే కాసేపు పాకిస్తాన్నీ, తురకాణ్ణీ  తిట్టి,  మరింకెన్ని న్యూక్లియర్ టెస్టులు చేస్తే ఇండియా అమెరికా అయిపోతుందో చర్చించడమా?

“రావ్”

నేను నా మీమాంసలో ఉండగానే వచ్చింది సుడిగాలిలా లారా.  బంగారు రంగు జుట్టు.  పచ్చటి శరీరం. ఇండియాలో 3 వ తరగతి పిల్ల కూడా డబ్బంటూ ఉంటే ఇంతకంటే పెద్ద చొక్కా వేసుకుంటుంది.   చిరిగిపోయేలా ఉన్న  ఆ ఇరుకైన  టీ షర్టు ఆమె స్త్రీత్వాన్ని దాచలేక పోతోంది.    నా పిచ్చి, ఆమె దాచే ప్రయత్నం చేస్తోందని ఎవరు చెప్పారు నాకు?   అసలామె ఎందుకు దాచవలెను?  అది సరే గానీ, ఆమె వక్షం ఇవ్వాళ మరింత పెద్దదిగా నేల కనపడుచున్నది?   కొంత నా మూడవ బీర్ ప్రభావమూ, మరికొంత ఆమె వేసుకున్న డిజైనర్  వేర్ మహత్యమూ అయ్యుండొచ్చు.

“ఓ లారా!  ఇదేనా రావటం?”

లేదు రావ్, వచ్చి చాలా సేపయింది.  రిచ్ తో మాట్లాడుతున్నాను.  నీ సంగతేమిటి, పార్టీ మహారంజుగా  జరుగుతున్నట్టుంది?”

ఈమె ఇంగ్లీషు ఓ పట్టాన్ అర్థమయి చావదు.  వంటిని అటూ ఇటూ వూపి మాట్లాడుతుందేమో, శ్రద్ధగా విందామన్నా సాధ్యమవదు.

“అవును లారా!  చాలా కష్టమయిన టైం నాకు.  వచ్చేవారం రిలేజేమో, చాలా ఎక్కువ పని చెయ్యాల్సి వస్తోంది.  ఈ పార్టీ నిజంగానే మంచి రిలాక్సేషన్ నాకు”

ఈ పార్టీలెందుకిస్తారో నాకు బాగానే తెలుసు.  మా పాలేళ్ళకి ఊడ్పుల రోజుల్లో ప్రతిరోజూ మందు పోయించే వాడు మా తాత.   అదే విషయాన్ని ఇక్కడెవడో యూనివర్సిటీ వాడు రిసెర్చి చేసి మరీ చెప్పి  వుంటాడు.   “అడపా దడపా పార్టీలూ, పిక్నిక్కులూ ఇవ్వడం ద్వారా ఉద్యోగులలో ఉద్యోగము పట్ల ఆసక్తి పెరుగునూ, తద్వారా ఉత్పత్తి పెరుగును. అది లాభసాటి పెట్టుబడి”  అనెవడో స్టాటిస్టిక్సు తో సహా ఋజువు చేసేసి  ఓ డాక్టరేటు,  “పార్టీలు లాభసాటిగా చేయుట ఎట్లు”  అనే ప్రొసీజర్ కి ఓ పేటెంటు కూడా నొక్కేసి వుంటాడు.  

 

“నిజం రావ్!  నాక్కూడా కష్టంగానే  వుంది.  పోనిద్దూ… మీ ఫ్రెండ్ వెంకట్ ని కలిశావా, మొన్ననే ఇండియా నుంచి వచ్చాడు.   తినడానికి ఎన్ని తెచ్చాడనుకున్నావ్…. బాయ్  ఇండియానించి ఎవరేం తెచ్చినా నాకు నచ్చేస్తాయి”

 

అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా.   ఈమెని చూస్తే నాకో అనుమానం.  ఈమె మాట్లడుతుంటే   “చూశారా నేనెంత అందమయిన దాన్ని , ఇన్ని తెలివితేటలున్న దాన్ని, ముఖ్యంగా అమెరికన్ని, అందునా తెల్లటి తెల్లని దాన్ని…. అయినా సరే చూశారా ఏ తేడా చూపించకుండా మీ బోటి ఆఫ్టరాల్  ఏషియా గాళ్ళతోటి తింటూ తిరుగుతున్నాను.  చూశారో నేనెంతటి మంచిదాన్నో “   అన్నట్టుంటాయి.  శంకరాభరణం  శంకరశాస్త్రి మంజుభార్గవిని ఎంతో “దయ” తో వంటగదిలోకి రానిచ్చినట్టు.

“థాంక్స్ లారా!  అదంతా నీ అభిమానం. అంత దూరం నించి మేమేం తెచ్చుకున్నా అన్నింటిలోకి మాకిష్టమయినవే కదా తెచ్చుకుంటాం.  అందుకే సహజంగా అవ్వన్నీ మంచి రుచికరమైనవే  అవుతాయి అంతే”

హమ్మయ్య,  “మాడెస్టీ” ని బానే నటించాను.  ఇంక ఇక్కడే వుంటే ఆవిడలా ఇండియాని పొగుడుతూనే వుంటుంది,  నేనలా నా మాడెస్టీలో ఇరికిపోతూ, సిగ్గు పడుతూ, చిరునవ్వులు నవ్వుతూ……. నో, ఇంక నాకు ఓపిక లేదు.

“ఎక్స్యూజ్ మీ లారా!”  మాగ్రూప్ వాళ్ళంతా నాకోసం వెతుకుతున్నారు, నువ్వేదో తెచ్చుకోవడానికి వెళ్తున్నట్టున్నావు.  అదిగో ఆ స్థంభం పక్కన కూచున్నారు మావాళ్ళంతా,  తప్పకుండా వచ్చి కలుస్తావు కదూ?”

హమ్మయ్య  బయట పడ్డాను.  మెల్లిగా మాగ్రూపున్న వైపుకు కదిలాను.  జోరుగా లైవ్ బాండ్ రాక్ సంగీతాన్ని మోగిస్తోంది.  ఇలాంటప్పుడే  నాక్కొన్ని విచిత్రమైన ఆలోచన్లొస్తుంటాయి.  ఇప్పుడు నేవెళ్ళి అకస్మాత్త్తుగా ఘంటసాల భగవద్గీత క్యాసెట్ పెడితే ఎలా వుంటుంది?

మొత్తానికి అలాటి పనేమీ చెయ్యకుండానే  మా గ్రూపు వాళ్ళున్న టేబిల్ దగ్గరకు చేరాను.  మొత్తం  అయిదుగురు కూర్చున్నారక్కడ.   ఒకడు  భారతీయుడు, ఒకడు చైనీయుడు, ముగ్గురు అమెరికన్లు (అలియాస్ తెల్లటి అమెరికన్లు).

 

నేను చేరే టప్పటికి నారాయణ్  ఏదో సీరియస్ గా మాట్లాడేస్తున్నాడు.  అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు… నటిస్తున్నారు.    నేను ఇంతకు ముందు దాకా ఇక్కడే కూర్చుని వెళ్ళానేమో, నా రాకకి వాళ్ళెవ్వరూ పెద్దగా కదల్లేదు.  నేను నా కుర్చీలో కూర్చున్నాను.   మా మానేజర్ ఫ్రాంక్  మాత్రం నా రాకని గమనించి, జరుగుతున్న సంభాషణని నాకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.

“రావ్, ఏమీలేదు,  నారాయణ్ ఇప్పుడే మీ ఇండియా గురించి చెప్తున్నాడు.  మీరు స్త్రీలని ఎంతో గౌరవిస్తారనీ, దేవతలుగా కొలుస్తారనీ చెప్తున్నాడు….”

అబ్బా! ఇక్కడా అదే గొడవా.  ఎందుకీ వెధవ వాగుడు. ఎప్పుడూ మీరలా, మేమిలా అనుకుంటూ ఎందుకీ న్యూసెన్సు.  జాతీయతలూ, రేసులూ (తెగలు), రంగులూ తేడాలే లేవని కబుర్లూ… సందు దొరికితే చాలు మీరిలాగా, మేమిలాగా…. అనవసరమైన్ గోల.     వొరే నారాయణ్, ఎప్పుడైనా అమెరికా వాడు “మేమింత  గొప్పవాళ్ళం సుమా”  అంటం విన్నావురా?   మనమెందుకు ప్రతీ నిమిషం “మేమంత వాళ్ళం, ఇంత వాళ్ళం” అంటూ రభస చెయ్యడం?  మనకి మన మీదే నమ్మకం లేదు.   ఇది తెల్లాణ్ణి నమ్మించే ప్రయత్నం కాదు, మనని మనమే నమ్మించుకునే ప్రయత్నం…… నో!   నా పర్టీ మూడ్ పాడయి పోతోంది.

“అవును ఫ్రాంక్…. ఆడవాళ్ళనే కదూ…. అవును నిజమే…. మనుషులుగా మాత్రం చూడం”  అన్నాను.

నారాయణ్ మొహం కొద్దిగా రంగు మారినట్టనిపించింది.  మరెవరికీ నా మాట సరిగా అర్థం కాలేదనుకుంటాను.   బహుశా  “బాడ్ ఇంగ్లీష్” అనుకుని వుంటారు….  నాకే మంచిది.

నారాయణ్ అలా మాట్లాడుతూనే ఉన్నాడు.  నాకు చిరాకు పెరిగి పోతోంది.  “ఇది పార్టీరా, వీళ్ళెవరికీ నీ వాగుడు మేద ఆసక్తీ లేదు, నమ్మకమూ లేదు” అని చెపాలనుంది.    చెపితే వింటాడూ?  వాడేదో నికార్సయిన దేశభక్తుడిలా అంతెత్తు నుండి అధోపాతాళంలో ఉన్న నన్ను చూస్తున్నట్టుగా ఓ చూపు చూస్తాడు.  నాకేల  ఆగోల…

ఇక్కణ్ణుంచి కదిలి ఆ అంటరాని భారతీయుల్ని కలవటమే బాగుండేలా ఉంది.  కనీసం నాలుగు మసాలా సినిమా కబుర్లూ , క్రికెట్ కబుర్లన్నా తెలుస్తాయి.

మాజనాల దగ్గర మెల్లిగా అనుమతి తీసుకుని లేచాను.  నా చేతిలో బాటిల్ ఖాళీ అయిందని గమనించాను.

గాలిలో తేలుతున్నట్టుంది నాకు.  రెండు గంటల్లో మూడు బాటిళ్ళు… వంటి బరువు సగం తగ్గిపోయినట్టుంది.   ఈ రోజు వెనుతిరిగేది లేదు.   అప్రయత్నంగా కౌంటర్ దగ్గరకెళ్ళి నాలుగో బాటిల్ తెచ్చుకున్నను.   నేరుగా దేశీయుల టేబిల్ దగ్గర చేరాను.   మొత్తం అయిదుగురో ఆరుగురో  వున్నారు.  లెక్కించే స్థితిలో లేను నేను.    అందులో ఒక జడపదార్థం (జడ వేసుకున్న పదార్థం) కూడా ఉంది.   ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాల్సింది.   ఒళ్ళు తూలితే పర్లేద్ గానీ, మాట తూలనీయకూడదు.   ఈ మత్తులో గొడవ ఇదే…. నా ఆలోచనలన్నీ మాటలయి పోతాయి.  మాట్లాడొద్దని అనుకున్నా సరే ఏదో శక్తి పట్టి వాగిస్తుంది.   కోర్టులో భగవద్గీతల్నీ, బైబిళ్ళనీ తీసేసి మందు బాటిళ్ళని పెట్టాలి.  అప్పుడిక లై డిటెక్టర్లు కూడా అక్కర్లేదు.

 

హలోలు, కైసా హైలూ, హౌ ఆర్యూలూ  అయిన తర్వాత కుర్చీలో కూలబడ్డాను.

“నో మాన్! ఇండియన్ మానేజర్ దగ్గర పని చేయలేను.”  పాండే.

“ఓ యా, మాగ్రూపులో కూడా దేసీ గాళ్ళు పెరిగి పోతున్నారు… ఇట్సె పయిన్”  షర్మ (శర్మ కాదు, షర్మ)

“ఐ హేట్ ఇండియన్స్”

“ఐ హేట్ దట్,  ఐ హేట్ దిస్”

………

……….

………..

అందరూ తమ తమ కారణాలు, భారతీయులను అసహ్యించుకోగలందులకు తెలియజేశారు.   అకస్మాత్తుగా అందరూ నన్ను చూస్తున్నట్టనిపించింది.  ఏదో ఒకటి మాట్లాడేయాలి.

“అవునవును,  ఈ టేబిల్ మీద లేని ఆ ఫలానా భారతీయులందరూ వెధవలే, ఒప్పుకుంటాను”  అన్నాను.  ఆన్నాననే అనుకుంటున్నాను.  మొహాల్లో ఆరంగలు చూస్తుంటే అనే ఉంటానని పిస్తోంది.   నే చూస్తున్నానను కుంటున్న రంగులు  నిజంగా ఆ మొహాల్లోని వేనా?

సంభాషణ సాగిపోతోంది.  నా బాటిల్ కరిగి పోతూనే వుంది.

“రేపు శాన్ ఫ్రాన్సిస్కో ఎవరైనా వస్తున్నారా?”  ఓ బెంగాలీయుని ప్రశ్న.

“చైనాలో మానవ హక్కుల పునరుద్ధరణకు గాను ఓ ప్రదర్శన వుంది, ఎవరైనా వస్తారేమోనని”  బెంగాలుని జవాబు.  ఆ జవాబు చెప్పడంలో  ఆ మొహంలో తళుక్కున ఓ గంభీర ముద్ర వెలిగింది.  నా స్థాయికి మీరంతా రాగలరా అనే అనుమానం ఆ మొహంలో!   ఔరా ఏమి వీని సామాజిక చింతన!

ఈ మనిషే, చదువుకునే వాడికి రాజకీయాలూ, ఇతర గొడవలూ పట్టకూడదని ఐ.ఐ.టి చదువయి అమెరికా వచ్చిందాకా నమ్మినవాడు.   ఈ మనిషికి వెళ్ళేందుకు ఏ సమస్యా, ప్రదర్శనా  కనపడినవి కావు భారతంలో.   మరక్కడ ప్రదర్శన అంటే చక్కటి ఫ్రీ టీ షర్టూ, స్పాన్సర్డ్ సోడా (అంటే కోక్ లూ గట్రా  అన్న మాట),  షార్టుల్లో అమ్మాయిలూ వుండరు కదా.   చెమట కంపూ, పోలీసు లాఠీలే కదా దొరికేవి.  ఇంతా చేసి ఓ పర్సెంటు తక్కువ మార్కులు వస్తే,  ఆ కంపులోనే జీవితాలు ఏడవాలి. అమెరికా ఎక్కడ దొరికేను.

అయ్యో ఇదంతా నేను గాని బయటకే అనేయట్లేదు కదా?  ఎందుకలా అందరూ నా వంకే చూస్తున్నారు?  మళ్ళీ ఏదో ఒకటి వాగక తప్పదు.

“లేదు, ఈ సారి ఇరాక్  మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏదైనా ప్రదర్శన వుంటే చెప్పు…. నాకు మిడిల్ ఈస్టర్న్ (మధ్య తూర్పు)  అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం.

నేనే మన్నా తప్పన్నానా?   జాగ్రత్తగానే మాట్లాడాలనుకున్నా… ఎందుకలా బెంగాలీవాడు అంత కోపంగా లేచెళ్ళి పోతున్నాడూ?  ఇక నేనేమీ మాట్లాడాను.

సంభాషణ హైదరాబాద్  ఆటోలా, న్యాయార్క్ క్యాబ్లా అడ్డదిడ్డంగా  సాగిపోతోంది.  నేను వింటం  మానేసి టేబిల్ మీద ర్యాక్ బ్యాండ్ కి అనుగుణంగా తాళం వేస్తున్నాను.

అకస్మాత్తుగా భుజం మీద చెయ్యి పడ్డంతో ఈ లోకం లోకి వచ్చాను…. రాగలిగినంత.     ప్రసాద్, తోటి తెలుగు వాడు,  హిందీలో అందరికీ అభివాదం చేసి కూర్చున్నాడు.  వాణ్ణి నేను చదువుకునే రోజుల్నుండీ ఎరుగుదును.

వాడికి హల్లో చెప్పేసి నా యోగంలోకి నేవెళ్ళి పోదామనుకున్నాను.  ఇంతలో…..

“ఈ సంగతి తెలుసా, బాలమురళి కన్సర్ట్ వచ్చే నెల్లో బే ఏరియాకి వస్తోంది తెలుసా?”    అందర్నీ వుద్దేశించి ప్రసాదు.

నేను ఉలిక్కి పడ్డాను.  వీడు బాలమురళి  సంగీతం వింటం ఎప్పుడు మొదలు పెట్టాడో నాకు తెలీదు.  నాకు తెలిసినంత వరకూ,  విజయశాంతి బొడ్డు గురించి వీడు చేసినంత రెసెర్చి మరెవడూ చేసి వుండడు.  వీడా మాస్ టేస్టుల నుండీ  క్లాస్ టేస్టులకు ఎప్పుడు ఫిరాయించాడో తెలియదు.  అమెరికా ఖండమా!   నీ పాత్ర ఇందులో ఎంత?

ఇంక అక్కడే వుంటే బాలమురళి బొడ్డు గురించి వాడి అభిప్రాయం అడిగేస్తానేమోనని భయం వేసింది.  ఇంక ఇంటికి వెళ్ళటమే మర్యాదగా తోస్తోంది.

లేచి ఇక నేను వెళ్తానని చెప్పాను.  అందరూ “హమ్మయ్య పీడ విరగడయ్యింది” అనుకుంటున్నారని నా అనుమానం….  దొంగ నా కొడుకులు.

లేచి నడవ బోయాను.  కొద్దిగా తూలినట్టున్నాను.

“నిజంగా మీరు డ్రైవ్ చెయ్యగలరా?  నేను కారు తేలేదు.  మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, పొద్దున్నే వెళ్ళగల్ను కావాలంటే”

ఎవరదీ?  నాకింతటి స్నేహితుడెక్కడున్నాడబ్బా  ఈ జనంలో అని చూశాను.  అది మనీష్.  కొత్తగా బే ఏరియాకి, మా కంపెనీకి వచ్చాడు.  ఇతగాడు పెద్దగా మాట్లాడడం నేనింత వరకూ చూసి ఎరగను.

నా ప్రవృత్తికి విరుద్ధమైనా ఎందుకో తెలీదు “సరే” అన్నాను.

ఇద్దరం మెల్లిగా బయటకు నడిచాము.  పార్కింగ్ లాట్ లో కారు ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను.  మావూరి కంసాలి వాడన్నా లేడు.   వాడు అంజనం వేసి చెప్పేవాడు…. ఫలానా కాపు గారి గేద్ పక్కూరి బందెల దొడ్డిలో వుందని.  వాణ్ణే  ఇక్కడ పార్కింగ్ లాట్ ముందు గనక కూర్చో బెట్టగలిగితే బ్రహ్మాండమయిన  బిజినెస్.  వారంలో కనీసం మూడు సార్లన్నా మర్చేపోతాను నేను, కారు ఎక్కడ పెట్టానో.  వెతుక్కుంటే గానీ దొరకదు.

మొత్తానికి అంజనం వెయ్యకుండానే కారుని పట్టుకో గలిగాము.   నిర్మొహమాటంగా తాళంచేతులు మనీష్ చేతిలో పెట్టి, కుడి చేతి వపు సీట్ లో కూర్చున్నాను.     తల వెనక్కి వాల్చి, మనీష కారు స్టార్ట్  చెయ్యడం,  తనకి తగ్గట్టుగా మిర్రర్స్ ని మార్చుకోవడం చూస్తున్నను.

కారుని మెల్లిగా రివర్స్ చేసి దారిలో పెట్టాడు మనీష్.  ఇంత సహాయం చెయ్యడానికి వచ్చిన మనిషి, పెద్దగా స్నేహం కూడా లేని మనిషి, ఇంత సేపటిలోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.    కారు చిన్న రోడ్లు దాటి ఫ్రీ వే మీదకు చేరింది.

“రావు గారూ!  మీరు నిద్ర గానీ పోవట్లేదు కదా?” నా ఆలోచన పసిగట్టినట్టుగా వచ్చింది ప్రశ్న. అదీ తెలుగులో!

“చెప్పండి మనీష్, మీరు తెలుగు వారనుకోలేదు నేను”

“తెలుగుదేశాన్ పెరిగిన కారణాన తెలుగు వాణ్ణి నేను.  అందుకే అంత అదృష్టం నాకు.  మీ ఇంగ్లీషు గొణుగుళ్ళతో పాటు తెలుగు గొణుగుళ్ళు కూడా అర్థమయ్యాయి నాకు”

ఇతగాడి మీద గానీ నా తిక్క ప్రయోగించ లేదు కద?  ఆ కక్ష తోనే వస్తున్నాడా ఈ పెద్ద మనిషి?

“మరేం పర్లేదు లెండి.  నేను మీ జోలికి గానీ, మీరు నా జోలిక్ గానీ రాలేదు….. ఇంత వరకూ”

బ్రతుకు జీవుడా అనుకున్నాను.  చూడబోతే ఈ పెద్ద మనిషి నన్నేదో ఇరుకున పెట్టాడానికి బయల్దేరినట్టుంది.

“అవును సుమండీ, మీరు పెద్దగా మాట్లాడ్డమే చూసి ఎరగను” అన్నాన్నేను.

“అది సరే రావు గారూ, ఒక్క సంగతి చెప్పండి, ఎందుకు మీరలా కావాలని తెలిసి తెలిసి  అందర్నీ  కించపరుస్తారు?”  

“నేనెవర్నీ  కించపర్చలేదు, సూటిగా మాట్లాడాను అంతే”

“అని మభ్య పెట్టుకోకండి,  నా కొక్కటే సమాధానం  కావాలి,  మీరు చేస్తున్నది పరనిందా, ఆత్మనిందా?”

“నిందా లేదు, గిందాలేదు …. ఇక్కడంతా తెల్లాడి బానిసలు.   ఈ బతుకులకి సొంత  ఆలోచనల్లేవు… అసలు సొంత బతుకులే లేవు.  వీళ్ళందరికీ  ఆ సంగతి తెలుసు.  నటిస్తున్నారంతే, పురుగులు “

“హల్లో, హల్లో …. మళ్ళీ మీ ధోరణిలోకి పోకండి…..   మీ ఎదుర్గుండా కూర్చున్న వాడు మీలా ఆలోచించట్లేదని మేకెట్లా తెలుసు?”

“చేస్తున్నాడేమో…. నాకేం బట్టింది, వాడి ఆలోచన వాడిది”

“మిమ్మల్ని మినహాయించుకుని మిగతా అందర్నీ పురుగుల్ని చేసేస్తానంటారు”

“నేను చేసేదేమిటి?  ఇక్కడున్నవన్నీ పురుగులే, నేనూ మీరూ కూడా….  నన్నేమీ మినహాయించుకోలేదు.”

“ఈ సంగతి మీ ఒక్కళ్ళకే తెలుసనీ, ఎదుర్గుండా వాడు ఇటువంటి ఆలోచన కూడా చెయ్యట్లేదనీ   ఏ ఆధారంగా చెప్తున్నారు?”

“నాలుగో బీర్ సార్….. అది నా నాలుగో బీర్ ఆధారంగా చెప్తున్నాను.   అదిగో  ఆ వచ్చే ఎగ్జిట్టే మీరు తీసుకోవాల్సింది.

 

-       అయిపోయింది

 

 

 

2 comments to కథ – మూడు బీర్ల తర్వాత

Leave a Reply

 

 

 

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>