SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కథ – గేటెడ్ కమ్యూనిటీ
February 22nd, 2009 by akkirajub

“సుధా నే వెళ్ళి పోతున్నా” బాత్ రూమ్ బయటనుంచి సుధకి వినపడేలా ఓ గావు కేక పెట్టి బయటికి నడిచాడు సతీష్.

ఇంకా కమ్యూనిటీ లో ఎవరూ బయలు దేరి నట్టు లేరు. పిల్లలందరూ ఈ పాటికే స్కూలు బస్సుల్లో ఉడాయించేసి ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా బాత్ రూముల్లోనే ఉండి ఉంటారు. తాను మాత్రం ఏదో పొద్దున్నే మీటింగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నాడు గానీ లేక పోతే మరో అరగంట తర్వాతే కదా బయట పడేది. ఆలోచిస్తూనే గబ గబా షూస్ వేసుకుని, కారు స్టార్ట్ చేశాడు. రివర్స్ చేసి కమ్యూనిటీ రోడ్డు మీద గేట్ వైపు పోనిచ్చాడు.

గేటు ఆనుకునే కమ్యూనిటీ క్లబ్ హౌస్. క్లబ్ హౌసు ముందు కొచ్చాక గుర్తొచ్చింది, ఈ రోజు రాత్రి ప్రసాదు కొడుకు పుట్టిన రోజు పార్టీ అని. క్లబ్ ముందు కారు ఆపాడు సతీష్. వాచ్ మన్ పరుగున వచ్చాడు.

“ప్రసాద్ సారు ఎన్నింటికని చెప్పిండు రాత్రి పార్టీ” తెచ్చిపెట్టుకున్న తెలంగాణాలో అడిగాడు సతీష్ వాచ్‌మాన్ ని.

“పార్టీ ఇవ్వాళ కాద్సార్. శనారం నాడు. ఈ రోజు బాబు పుట్టిన రోజు. పార్టీ శనారమయితే అందరూ వస్తారని ఆ రోజు పెట్టారు సార్. ఆయ్!”. దీర్ఘాలు తీస్తూ గోదావరి జిల్లాని నాలుగు లఘు వాక్యాల్లో ఆవిష్కరిస్తూ సమాధానం చెప్పాడు వాచ్‌మన్.

కారు క్లబ్ నీ, కాలనీ గేట్ నీ దాటి బయటికి నడిచింది.

సతీష్ అనుకున్నట్టుగానే ఇంకా ఆఫీసులకెళ్ళే పెద్ద వాళ్ళు రోడ్లమీదకి రాలేదు . స్కూలు బస్సులూ పిల్లలూ రోడ్లని ఆక్రమించి ఉన్నారు. మరో అరగంట తర్వాత బైకులూ, కార్లతో పెద్ద వాళ్ళు రోడ్లని తమవి చేసు కుంటారు. టిఫిన్ సెంటర్లూ, రెస్టారెంట్ లూ తప్పా ఇంకా ఏ షాపులూ తెరిచి లేవు.

కారు జుబిలీ హిల్స్ రోడ్డు మీదకి చేరేటప్పటికి ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయి ఉంది. రోడ్డు వెడల్పు పెంచే పనుల్లో సగం పగల గొట్టిన గోడలూ, రోడ్డుమీద వేసిన కంకర, ఇసక… వాటి మధ్య నించి ఎలాగోలా ఇరికి, దూరి, పాకి మిగతా వాళ్ళందర్నీ వెధవల్లా జమకట్టి పారిపోదామను కుంటున్న అభినవ షూ మాకర్ ల ధాటికి పూర్తిగా నిలిచిపోయిన ట్రాఫిక్.

“ఈ రోడ్డేదో అయిపోతే కనీసం అరగంట ఎక్కువ నిద్ర పోవచ్చు” భవిష్యత్తు లో జరగబోయే మంచిని తలచుకుంటూ పొద్దున్నే మూడ్ పాడవకుండా విసుగుని కాస్త దూరంలో ఉంచే ప్రయత్నం చేశాడు.

పూర్తిగా నిలిచి పోయిన కార్లోంచి యథాలాపంగ చుట్టు పక్కల చూట్టం మొదలు పెట్టాడు. మొదట ఓ నిమిషం గమనించలేదు గానీ తన కారు పక్కనే దాదాపు ఆనుకుని వున్న స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తి తననే చూస్తున్నాడని అనిపించ గానే తిరిగి అటు వైపు చూశాడు.

“సతీష్?” ప్రశ్నార్థకంగా అడిగాడు స్కూటర్ మీద వ్యక్తి.

“అవును మీరూ… నువ్వు .. .అర్జున్… అవునా ?” ప్ర శ్నించ బోయి వెంటనే గుర్తు పట్టి అడిగాడు.

“కారు ఆగంగానే చూశా… రంగు వచ్చినట్టుంది. ఆ కళ్ళజోడు… కొంచెం అనుమానించి నువ్వే పలకరిస్తావులే అని చూస్తున్నా” అన్నాడు అర్జున్.

ఇంతలో ట్రాఫిక్ కదిలింది. వెనక వాళ్ళు హారన్ మోతలు మోగించకముందే బయలు దేరటం మంచిదని “ముందు ఆపుతా” అని స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు అర్జున్.

అర్జున్ అలా కొంతదూరం ముందుకు పోయి త్రినేత్ర ముందున్న పార్కింగ్ లోకి స్కూటర్ పోనివ్వడాన్ని గమనించి కారు ఇండికేటర్ వేశాడు సతీష్. ఎదురొస్తున్న ట్రాఫిక్ లోకి అంగుళం అంగుళం చొప్పున దూరి, దాన్ని దాటి రోడ్డు కి కుడి వైపు ఉన్న పార్కింగ్ లోకి చేరాడు సతీష్.

“హైదరాబాదు ఎప్పుడు చేరావురా? నాకు తెలిసి ఖమ్మం దగ్గరే ఎక్కడో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో చేస్తున్నావని విన్నా” సతీష్ దిగుతూనే మొదలెట్టాడు.

“మూడేళ్ళనించీ ఇక్కడే ఉన్నా. గవర్నమెంట్ జాబ్ వదిలి ఇక్కడే ప్రయివేట్ కాలేజీ లో చేరా”

గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కన్నా ప్రయివేట్ కాలేజీ ఉద్యోగాలు మెరుగయి పోయాయా అనే సందేహం వచ్చినా… దానికన్నా ముందు చాలారోజుల తర్వాత కలిసిన మిత్రుడితో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉండడంతో టాపిక్ మార్చి అన్నాడు.

“నా సంగతేమన్నా తెలుసా? ఆఖరి సారి మనం కలిసింది పదేళ్ళ క్రితం అనుకుంటా. నా MTech అప్పటికి అయ్యిందా?” గుర్తు చేసుకుంటూ అడిగాడు.

“చూచాయగా తెలుసు. సాఫ్ట్ వేర్ లో చేరావనీ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జపాన్, సింగపూర్ ఎవేవో తిరుగుతున్నావనీ విన్నాలే. ఖచ్చితంగా తెలీదులే ఎక్కడున్నావో”

“అన్ని దేశాలేం తిరగలేదులే. ఆమెరికా చాలాసార్లే వెళ్ళాను. ఓ సారి లండన్, ఓసారి సింగపూర్ వెళ్ళా అంతే ప్రాజెక్ట్ పని మీద. ఎక్కడా ఉండిపోయే ఉద్దేశం లేదులే మొదట్నించీ. వెళ్ళి వచ్చేస్తుంటా. ఇక్కడే ఇల్లు కూడా కొనేసు కున్నా. ఓ భార్య, ఓ కొడుకు”

“ఓ భార్యేనా? ” సతీష్ ఆలోచించకుండా అన్న మాటని వెక్కిరిస్తూ నవ్వాడు అర్జున్. నవ్వాపుకుని అన్నాడు.

“నేనూ ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాలే ఊరి బయట. ఒకే ఒక్క భార్య, ఇద్దరు పిల్లలూ. ఇద్దరూ మొగ పిల్లలే”.

ఆఫీసు మీటింగ్ గుర్తు కొచ్చింది సతీష్ కి.

“నేను తొందరగా మీటింగ్ కి వెళ్ళాలి. నీ నంబర్ ఇవ్వు. సాయంత్రం కాల్ చేస్తా. ఇంటిదగ్గర కలుద్దాం”. అన్నాడు.

ఇద్దరు మిత్రులూ ఫోన్ నంబర్లు తీసుకుని ఎవరి ఉద్యోగాలకి వాళ్ళు బయలు దేరారు.

పదేళ్ళ తరవాత కలిసిన మిత్రుడిని అంచనా వేసే ప్రయత్నం చేశాడు సతీష్. చిన్నప్పటి కోపం ఆవేశం ఇంకాఈ మనిషిలో ఉండి ఉంటాయా?

ఓ పల్లెటూళ్ళో పదో తరగతి దాకా కలసి చదువుకున్న మిత్ర్లులు అర్జున్ సతీష్ లు. అంత చిన్న పల్లెటూరు నించి ఇంత పెద్ద ఉద్యోగం దాకా రాగాలిగానన్న గర్వం అప్పుడప్పుడూ మెదిలినా, అర్జున్ గురించి ఆలోచిస్తే మాత్రం తను సాధించింది గొప్పేం కాదనిపిస్తుంది సతీష్ కి.

ఊళ్ళో అందరికీ బట్టలుతికే చాకలి సాంబయ్య కొడుకు అర్జున్. ఏడో క్లాసులో వాడు జిల్లా లోనే 3వ రాంకు. వాళ్ళ నాన్న చదువు మానిపిద్దామనుకుంటే స్కూలు పంతుళ్ళే ఫీజులు కట్టి వాణ్ణీ ఎనిమిదో తరగతిలో చేర్చారు. గవర్నమెంటు బళ్ళలో అడీగే నామ మాత్రవు ఫీజు కూడా కట్టలేని స్థితి సాంబయ్యది. వాళ్ళింట్లో కరెంటు కూడా లేక పోవడంతో సతీషి పక్కన చేరి చదువుకునే వాడు.

అర్జున్లో ఎవరికీ తెలియని ఒక కసి ఉండేది. పగలూ రాత్రీ పడి పడి చదివే వాడు. సతీషి తన కిష్ట మయిన లెక్కలూ సైన్సూ చదువుతుంటే, అర్జున్ ప్రతీ సబ్జక్ట్ నీ ఒకే ఇంటరెస్ట్ తో చదివేవాడు.

“చాకలోడి తెలివి తేటలు కూడా లేవు” అని సతీష్ ని వేళా కోళం చేసినా, అర్జున్ పట్ల మాత్రం ఏమాత్రం అమర్యాద చూపించలేదు సతీష్ కుటుంబం. సతీష్ తండ్రి గ్రామీణ బ్యాంకులో మానేజర్ గా పనిచేశే వాడు. చదువూ, ప్రభుత్వ ఉద్యోగం నేర్పిన సంస్కారం తో పల్లెటూరి కట్టు బాట్లకు కొంత దూరంగా ఉండేది సతీష్ కుటుంబం. సాంబయ్య పొద్దున వచ్చి విడిచిన బట్టలు తీసుకెళితే, అర్జున్ మాత్రం సతీష్ తో సమానంగా కూర్చుని చదువుకునే వాడు. వూళ్ళో చాలా మందికి ఇది మింగుడు పడేది కాదు. సాంబయ్యతో సహా.

“పెద్దోళ్ళతో కూర్చుని నువ్వూ పెద్దోడి వనుకో మాక” అని కొడుకుని అప్పుడప్పుడూ హెచ్చరిస్తూ ఉండే వాడు సాంబయ్య.

సతీష్ పదో తరగతి పరీక్షలవడంతోనే నానా తంటాలూ పడి వాళ్ళ నాన్న ఖమ్మం బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ చేయించు కున్నాడు. అక్కణ్ణించీ సతీష్ చదువు బయట ప్రపంచంలో పడి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ దాటీ MTech దాకా సాగింది.

అర్జున్ భద్రాచలంలో నానా తంటాలూ పడి ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ చేశాడు. తెల్లవారు ఝామున పేపర్ వేయటం దగ్గర్నించీ, ట్య్షూషన్లు చెప్పడం దాకా అన్నిపన్లూ చేసి డిగ్రీ చది వాడు. పన్లు చేస్తూ, డబ్బుల్లేకుండా సైన్స్ సబ్జెక్ట్స్ చదవటం కష్టమని తెలిసి ఇంగ్లీషు ని ఆశ్రయించాడు. BA ఇంగ్లీషులో పూర్తి చేసి, నాగార్జునా లో MA కూడా పూర్తి చేశాడు. ప్రతీ పైసా లెక్క వేసుకుంటూ అతికష్టం మీద పల్లెటూరు చాకలి కొడుకు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం దాకా సాధించాడు.

చదువులయే దాకా ఏదో రకంగా పరిచయాన్ని కాపాడుకుంటూ వచ్చిన మిత్రులు, సొంత ఉద్యోగాలూ , జీవితాలు ప్రారంభిచాక మాత్రం దూరమయిపోయారు.

గతాన్ని నెమరువేసుకుంటూ ఆఫీసు చేరాడు సతీష్. అర్జున్ ఇక్కడి దాకా రాగలిగాడంటే, నేను బిల్ గేట్సుని దాటితే తప్పా సమ ఉజ్జీని కాలేను అని అనుకుంటూ పనిలో చేరిపోయాడు సతీష్.

2

“అవున్రా మర్చేపోయాను నీకు అర్జున్ అని ఎందుకురా పేరు పెట్టారు? ఆ ఊరి లెక్కలో అది చాలా పాష్ పేరు తెలుసా” అడిగాడు సతీష్ పక్కనే కూర్చున్న అర్జున్ ని.

“ఊరి లెక్క కాదు, మా చాకలోళ్ళకి ఆ పేరు నప్పదులే. నేను పుట్టినప్పుడు పెద్ద వాన, గాలిదుమారం. అందరూ అర్జునా, పార్థా, కిరీటీ అంటూ దండకాలు చదివార్ట. పిడుగులే పడతాయో, పసిగుడ్డుకి ఆ ఉరుముల చప్పుడుకి చెముడే వస్తుందోనని భయపడి పోయార్ట. ఏమీ కాలేదు కానీ, నాకు మాత్రం అర్జున్ అని పేరు స్థిరమయి పోయింది.” గుర్తు చేసుకుంటూ చెప్పాడు.

“అవునా?” ఆశ్చర్యంగా అంది అర్జున్ పక్కనే కూర్చున్న ఆతని భార్య మంగ. తానెప్పుడూ ఈ విషయమే అడగలేదే అని అనుకుంటూ.

శనివారం నాడు కలవాలని నిర్ణయించుకున్న ప్రకారం అర్జున్ ఇంటికి వెళ్ళి ఆతని నీ ఆతని భార్యనీ ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు సతీష్. పిల్లలిద్దరూ చదువుకుంటారులే వాళ్ళొద్దని ఖరా ఖండిగా చెప్పి వాళ్ళని చూడమని అమ్మానాన్నలకి చెప్పి బయలుదేరాడు అర్జున్.

“వీడితో ఉంటే ఇంకా చాలా సంగతులే తెలుస్తాయి నీకు” అన్నాడు అర్జున్ భార్య నుద్దేశించి.

మాటల్లోనే కారు కాలనీ గేట్ దగ్గరికి చేరింది. గేటు దగ్గరికి వేసి, పక్కనే ఉన్న రూంలో కూర్చుని ఉన్నాడు వాచ్ మన్. కారు ఆగంగానే పరిగెట్టు కొచ్చి ఓపెన్ చేశాడు.

“ఆఫీసుల్నించి వచ్చే టైంలో ఎందుకు గేట్ వేస్తావ్. రాత్రి పూట వేస్తే అర్థం ఉంది” విసుకున్నాడు సతీష్.

“లేదు సార్. అడుక్కునే వాళ్ళు దూరి పోతున్నారు. నిన్న పొద్దున గంగిరెద్దుల వాణ్ణి బయటికి పంపడానికి చాల కష్టమయింది సార్. క్రిష్ణ సార్ గేటు ఎప్పుడూ వేసి ఉంచి అందర్నీ చూసి పంపమన్నారు” వినయంగా సమాధానం చెప్తూ గేట్ ఓపెన్ చేశాడు వాచ్ మన్.

మెల్లగా కారు గేటు దాటి లోపలికి వెళ్ళింది.

“ఇందులో ఎన్ని ఇళ్ళు ఉంటాయిరా?” బయటికి చూస్తూ అడిగాడు అర్జున్.

“మొత్తం ముప్ఫయ్ అయిదు. అన్నీ ఇండిపెండెంట్ హౌస్ లే”

“ఈ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ అంటే బానే అవుతుంది. సాఫ్ట్ వేర్ వాడివి నీకేంటి లే”

“తడిసి మోపడయింది. సగం మంది అమెరికా నించి తిరిగొచ్చిన వాళ్ళే. హైటెక్ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే వాళ్ళే అంతా”

దారిలో ఉన్న క్లబ్ హౌస్ నీ, స్విమ్మింగ్ పూల్ నీ చూపిస్తూ ఇంటి వైపు పోనిచ్చాడు సతీష్.

క్లబ్ హౌస్ దగ్గర కాస్త హడావిడి కనపడింది.

“ఈ రోజు క్లబ్ హౌస్ లో ఓ బర్త్ డే పార్టీ ఉంది. అదీ హడావిడి” వివరించాడు సతీష్.

క్లబ్ వరండాలో ఓ ఇద్దరు కార్టూన్ వేషాల్లో గంతులు వేస్తున్నారు. “బార్నీ”, ” టిగ్గెర్” అంటూ పిల్లలంతా వాళ్ళ చుట్టూ తిరిగుతున్నారు.

“మరి నువ్వు వెళ్ళవా?” కార్టూన్ వేషాల్ని చూస్తూ అడిగాడు అర్జున్.

“గిఫ్ట్ ముందే కొనేశాలే. అంతా పిల్లల పార్టీనే. మా అబ్బాయి ఈపాటికే అక్కడ చేరి ఉంటాడు. అవసరమయితే కేక్ కటింగ్ టైమ్ కి ఓ నిమిషం వెళ్ళి వస్తా. అది చాలు”

అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.

“డబ్బున్న వాళ్ళ ఇళ్ళు ఇలా ఉంటాయి” భార్యని ఉద్దేశిస్తూ అన్నాడు అర్జున్.

“సర్లే దిగు. తొందరగా రెడీ అయితే క్లబ్ హౌస్ వైపు వెళ్ళచ్చు.” అంటూ కారు దిగాడు సతీష్.

కారు శబ్దం విని తలుపు తీసి బయటికి వచ్చింది సుధ.

“రండి రండి” అంటూ సాదరంగా ఆహ్వానించింది అతిథులని.

“వీడే అర్జున్ అంటే. ఆవిడ వీడి భార్య. ” పరిచయం చేశాడు సతీష్.

“మీ గురించి చాలానే చెప్పారు సతీష్. ” సుధ

“మంచా చెడా?” తేలిగ్గా నవ్వేస్తూ అర్జున్

“బాబు లేడా?” మొదటి సారి నోరు తెరుస్తూ అంది మంగ.

“వాడా ఆ క్లబ్ హౌస్ దగ్గరే పార్ట్టీలో ఉన్నాడు. మీరు పిల్లల్ని తీసుకొస్తారేమో నని తొందరగా వచ్చెయ్యమన్నా” సమధానం చెప్పింది సుధ.

“వాళ్ళు చదువుకోవాల్ట. వీడో పుస్తకాల పురుగు. కొడుకుల ని వదుల్తాడా” సతీష్

“నిజం అన్నయ్యా! చిన్న క్లాసు లే కదా పోనిమ్మంటే వినరు. చదువో చదువో ఒకటే గోల ఎప్పుడూ” భర్త మీద చాడీ చెప్పింది మంగ.

అన్నయ్య అన్న పిలుపు విని ఆశ్చర్య పోయింది సుధ. తమ హైటెక్ స్నేహితుల్లో ఇలాంటి పిలుపులు వినకపోవటంతో ఆ పిలుపెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది సుధకి. చిన్న తనంలో ఇంటి పక్క పిన్ని గారు తండ్రిని “అన్నయ్యగారూ” అని పిలవడం గుర్తొచ్చింది. ఇప్పుడు అదే పిన్ని గారు కనపడితే తాను “పిన్ని గారూ” అని పిలుస్తుందా లేక ఆంటీ అని పిలుస్తుందా? మీమాంసలో పడింది సుధ.

కాస్త స్ఠిమిత పడ్డాక ఇల్లంతా తిప్పి చూపించారు సతీష్, సుధ.

“చాలా గొప్ప వాడివయిపోయావురా” అన్నాడు అర్జున్ మిత్రుణ్ణి మెచ్చుకుంటూ.

“నా మొహం గొప్ప. రేపు మా ఆఫీసుకి రా… ఒక్కొక్కడికి ఊరంతా స్థలాలే. నిమిషం సందు దొరికితే మాట్లాడేది ఎక్కడ ఏ స్థలం ఎంత పెరిగిందనే తపన.” సతీష్.

“జుట్టున్నామె ఎన్ని కొప్పులయినా పెడుతుంది నాయనా” నవ్వి అన్నాడు అర్జున్.

భోజనాలు చేసి మిత్రులిద్దరూ చిన్ననాటి కబుర్లలోకి మళ్ళారు. ఒకరి కుటుంబాల గురించి ఒకరు అడిగి తెలుసు కున్నారు.

MSc చేసి మొన్న మొన్నటి దాకా ఏదో ఉద్యోగం చేసి మానేసిన సుధ కీ, పదో తరగతి పాసయి, ఇల్లు దాటి బయట ప్రపంచం పెద్దగా తెలియని మంగకీ మధ్య మాటలు పెద్దగా సాగలా. మాటల్లో అనుకోకుండా ఇంగ్లీషు లోకి తెలుగులోకీ మళ్ళే అలవాటున్న సుధ అతి కష్టం మీద భాషని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసింది.

అంతస్థులకి, అంతరాలకీ మించిన సంస్కారం, అభిమానం పుష్కలంగా ఉన్న ఆ నలుగురూ అపురూపమయిన ఆ స్నేహాన్ని కాపాడు కోవడానికి ప్రయత్న పూర్వకంగా ఒకరికొకరు సాయ పడ్డారు.

3

“నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య! ఒక్కటి పీకితే నియ్యబ్బ అర్నెల్లనాడు తిన్నది కక్కుతావ్ ” ఒక్క సారిగా విరుచుకు పడ్డాడు అర్జున్.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు వెనకే నిలబడ్డ సతీష్.

ర్రైలు టిక్కెట్ కొంటానికి లైనులో ఓ నలుగురి ముందు నుంచున్న ఓ కుర్రాడి మీద అర్జున్ కోపం. ఆదివారం పాత పుస్తకాల షాపులు చూడ్డానికి బయలు దేరారు మిత్రులిద్దరూ. దారిలో టిక్కెట్ కొనుక్కోవాలంటే కారు ఆపాడు సతీష్.

“అర్జున్ ఆగు” అర్జున్ ని కంట్రోల్ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేశాడు సతీష్.

“ఏమిటాగేది. ఈ నాకొడుకుని ఇందాకణ్ణుంచీ చూస్తున్నా. ఆ ముందాయన కాస్త మెతగ్గా ఉన్నాడని చూసి దూరి పోతున్నాడు. ఏవిటంటే, వాళ్ళ తాతకో అమ్మమ్మకో టిక్క్ట్ట్ట్ట్ కొంటున్నాట్ట, ముసలాళ్ళ టిక్క్టెట్ కొంటానికి లైనులో నుంచోనక్కర్లేదని ఇంగ్లీషు లో దబాయింపు”.

“మీ తాతకో వాడమ్మకో టిక్కెట్ కావాలంటే వాళ్ళనే రమ్మను… పక్కకి తప్పుకుని పోనిస్తాం. వాళ్ళ పేరు చెప్పి నువ్విక్కడ వేషాలేశావంటే మొహం పగులుద్ది” నిక్కచ్చిగా చెప్పాడు అర్జున్…. ఎంత నివారించాలని చూసినా సతీష్.

ఏదో అనబోయిన ఆ కుర్రాడు లైనులో ఉన్నా మిగతా వాళ్ళు కూడా నోరు పెంచడంతో ” I will come back and see you all – అని పొగరుగా బయటకు వెళ్ళాడు.

“ఏందిరా నువ్వుచూసేది. ఇప్పుడే రా చూసుకుందాం” అంటూ ఆ కుర్రాడి వెంటపడ బోయిన అర్జున్ ని అతికష్టం మీద ఆపాడు సతీష్.

ఇలాంటి గొడవల్లో తలదూర్చి చాలా కాలం అవటంతో కొంచెం ఎబ్బెట్టుగా ఉంది సతీష్ కి.

“ఆ టిక్కెట్ ఏదో నేనే కొనిచ్చే వాణ్ణిగా ఇంటర్నెట్ లో. ఈ పిచ్చి గొడవలన్నీ ఎందుకూ. అయినా ఆ భాషేంటి. ఇంగ్లీషు లెక్చరర్ వి. వాడు మాట్లాడిన పాటి ఇంగ్లీష్ నీకు రాదా. అక్కడున్న వాడెవ్వడన్నా నీకు ముక్క చదువురాదనుకుంటారు ఆ గొడవ చూసి” విసుగ్గా అన్నాడు సతీష్ కారు ఎక్కంగానే. కోపంగా ఓ చూపు చూశాడు అర్జున్.

“నువ్వు ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటావ్. అదో మాయా ప్రపంచం నీకు. నీకు అందులో సాగుతుంది. నాకు సాగదు. ఈ లైన్లో రేపయినా నాకీ గొడవ తప్పదు. నీలా గేటెడ్ కమ్యూనిటీ లో వాణ్ణి కానుగా… బయట ప్రపంచంతో నాకింకా సంబంధం ఉంది” ఆవేశం పూర్తిగా తగ్గక పోవటంతో అర్జున్ మాటలు ఆతని అదుపు దాటాయి.

“మధ్యలో నా జోలికి ఎందుకొస్తావ్. నీ సంగతి నాకు తెలియదు గానీ నాకందరి తోటీ సంబంధాలు అలానే ఉన్నాయి. నేనేమీ ఒదులుకోలా” సతీష్.

“ఏం ఒదులుకో లేదా…. బయట గంగిరెద్దులూ, పగటి వేషగాళ్ళూ మీ కమ్యూనిటీ వాళ్ళకి అడుక్కునే వాళ్ళు. బార్నీ, టిగ్గర్ మాత్రం ప్రొఫెషనల్స్. డిస్నీ వాడొచ్చి శ్టాంపు కొడితే తప్పా ఆ గంగిరెద్దూ, పిట్టల దొరా మీ ఇంటి గుమ్మం తొక్కలేరు. ”

సతీష్ మౌనంగా ఉండి పోయాడు. అనుకోని ఈ దాడికి ఎలా సమాధానం చెప్ప్లాలో తెలీక మౌనంగా ఉండి పోయాడు.

అర్జున్ వరద అక్కడితో ఆగలా.

“తెల్లాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఉండేవిట ఇలాంటి కాలనీలు. ఇప్పుడు కాలనీలు వేరు. అన్నిటికన్నా పెద్ద కమ్యూనిటీ ఉందిగా. ప్రపంచమంతా ఏమయినా నాకేం అనుకుంటూ, ….9/11 వచ్చి పెళ్ళున చెంప దెబ్బ తగిల్తే తప్పా తెలియలా… బయట ప్రపంచం ఏమనుకుంటోందో… ఇప్పుడు మాత్రం తెలిసిందా ఏమిటీ”

సతీష్ ఇంక భరించ లేక పోయాడు.

“నేను గొడవ ఎందుకు అన్నందుకు నన్ను తెల్లాణ్ణీ, అమెరికన్నీ చేశేశావ్. అది పోనీ… ఎంత అన్యాయ మయినా… నీలాంటి చదువుకున్న వాడు కూడా 9/11 తలుచుకుని మురిసి పోవటం బాధాకరం. వెర్రి ” కోపం కాకుండా నిజాయితీగా బాధ ధ్వనించేలా అన్నాడు.

అప్పటికి గానీ అర్జున్ కి తాను ఎంత దూరం వెళ్ళాడో అర్థం కాలా. తనని తాను అదుపులో తెచ్చుకోవడానికి కాసేపు మౌనంగా ఉండి పోయి తర్వాత అన్నాడు.

“సారీ రా. నోరు జారాను. నేను అంత చెడ్డవాణ్ణీ కాదు. నీ మీద నమ్మకం లేకా కాదు. ”

“పర్లేదులే రా… ఇదేం మొదటి సారి కాదుగా” నవ్వేశాడు సతీష్.

అంటూనే ఆలోచనలో పడ్డాడు సతీష్. అర్జున్ అన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదా అని. బయట కరంటు పోయినా తమకి జెనరేటర్ ఉంటుంది. నీళ్ళు రాక పోతే టాంకర్లు వస్తాయి. ఊరు బందు ఉన్నా ఇంటర్నెట్ లో టిక్కెట్ కొనుక్కోగలరు. నీళ్ల కోసం, కరెంటు కోసం… ప్రతిదాని కోసం వీధిన పడాల్సిన అవసరం దాటి పోబట్టే అంత డిగ్నిఫైడ్ గా ఉండగలుగుతున్నారా?

ఆలోచనలోంచి బయట పడుతూ అన్నాడు సతీష్… “కాదులేరా, కోపంలో వాగినా, నువ్వు చెప్పింది కూడా ఓరకంగా నిజమే. ”

“పోనీ రా.. వదిలేయ్ ఆ టాపిక్. ” బలవంతంగా ఆ సంభాషణ తుంచేశాడు అర్జున్.

4

“అయితే మిత్రులిద్దరూ గొడవ పడ్డారన్న మాట” అంది సుధ, సతీష్ చెప్పిందంతా విని.

“గొడవేం కాదులే. అర్జున్ తో దోస్తీ అంటే ఇలాంటి వాటికి సిద్ధ పడాల్సిందే. తిక్క వెధవ” అది మెచ్చుకోలో, తెగడ్తో తెలీకుండా అన్నాడు సతీష్.

“ఆశ్చర్యమేం లేదు. మంగతో పార్క్ కెళ్ళానని చెప్పానా అక్కడా ఇలాంటి గోలే నాకు” అంది సుధ, అంతవరకూ దాచిన సంఘటనని చెప్పడానికి సిద్ధ పడుతూ.

“మొన్న గురువారం నాడు. పిల్లలందరికీ ఏదో శెలవ. నువ్వూ, అర్జున్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు నేనూ మంగా కలిసి పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళామని చెప్పాను.. గుర్తుందా?” అడిగింది సుధ.

“ఆ.. నువ్వు ఫోన్ చేశావ్, నేనే ఎందుకు గుర్తొచ్చానా అని… ”

“అవును. నేరుగానే చెప్పిందిలే… మీతో అయితే కారులో వెళ్ళిరావచ్చు… ఈ ఎండలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని సిటీ బస్సులో వెళ్ళే ఓపిక లేకే మీకు ఫోను చేశాను అని చెప్పేసింది” అంది సుధ.

“పోనీలే ఆమాత్రం నిజాయితీ అన్నా ఉంది” అన్నాడు సతీష్.

“అదికాదు ముఖ్య విషయం. పార్కులో ఉన్న రెండు ఉయ్యాలల్లో ఇద్దరు పిల్లల్నీ కూర్చో పెట్టి ఊపడం మొదలు పెట్టింది. అరగంట అయినా వదల్దు. మన వాడు ఆ పక్క ఎవణ్ణో దోస్తీ చేసుకుని హారీ పోటర్ గురించి మాట్లాడు తున్నాడు. చుట్టు పక్కల బోలెడు మంది పిల్లలు ఆ ఉయ్యాల చుట్టూ ప్రదక్షిణాలు. మంగ పిల్లల్ని దింపి వేరే పిల్లలకి ఇస్తే బావుణ్ణని నా కెంత అనిపించినా నోరు మెదపలా. ఓ బామ్మగారు వచ్చి మంగతో పిల్లల్ని దింపి నా మనవరాల్ని ఎక్కిస్తావా లేదా అని గొడవ.

నాకు తల కొట్టేసినట్టనిపించింది. మంగ తడువుకోకుండా ఇంకో అయిదు నిమిషాలు అని తన పని తాను చేసుకు పోయింది. చుట్టు పక్కల అందరూ బయటకే వినపడేటట్టుగా ఎన్ని అన్నా చీమ కుట్టినట్టయినా లేదు మంగకి. నాకు ఆశ్చర్యమేసింది”.

“గుడ్… నువ్వేం వేలు పెట్టలేదుగా” అనుమానంగా అడిగాడు సతీష్.

“దాదాపు వేలు పెట్టలా. అంతా అయిపోయాక నోరు ఊరుకుంది కాదు. పాపం ఆ పెద్దావిడకి ఇచ్చేస్తే పోయేదేమో … ఆ చంటిది ఆవిడ ప్రాణం తీసేస్తోంది ఆ ఉయ్యాల కోసం అన్నా” గాలి పీల్చుకోవడానికి ఆగింది సుధ. ఊపిరి బిగ పట్టి వింటున్నాడు సతీష్. మళ్ళీ మొదలు పెట్టింది సుధ.

“మీకేమండీ చెపుతారూ… మీ పిల్లాడు రేపు మీ కమ్యూనిటీ పార్క్ లో ఆడుకుంటాడు. మళ్ళీ మీలాంటి వాళ్ళు కారులో తీసుకొస్తే తప్పా మా పిల్లలకి ఈ ఉయ్యాల దొరకదు. ఇంత అభిమానం, పరువు కాపాడు కోవాలంటే సిటీ బస్సులూ, పబ్లిక్ పార్కులూ కష్టం. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మా ఆయన రావాలి. ఆయన ఆదివారం తప్పా రారు. ఆది వారం నాడు ఇంకా ఎక్కువ గొడవలు పడాలి. కాసేపు చెపులు మూసు కోవటమే శరణ్యం ఇక్కడ పని కావాలంటే” మంగ అన్న మాటల్ని తానే అన్నట్టుగా అభినయిస్తూ చెప్పింది సుధ.

“హు… కాస్త జాగ్రత్తగా ఉండాలి అర్జ్జున్, మంగలతో. మర్చేపోకు, అంతకాక పోయినా అలాంటి ప్రపంచం లోంచే వచ్చాం మనం” భార్యకు చెప్తున్నట్టున్నా తనకే చెప్పుకుంటూ అన్నాడు సతీష్.

“నాకు తెలియదా. అర్జున్ సంగతి నాకు తెలియదు కానీ మంగ బంగారం. అటువంటి మనిషి అంత నిర్దయగా ప్రవర్తించాలంటే ఎంతటి క్షోభ అనుభవిస్తుంటుందో” బయటకే వినపడేలా అనుకుంది సుధ.

5

“ఏమండీ మంగ ఫోన్ చేసి ఏడుస్తోంది. ఏదో గొడవ జరుగుతోందట.” ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పింది సుధ.

“మళ్ళీ ఆ స్థలాల గొడవేనా… అబ్బా… సరే నే వస్తున్నానని చెప్పు” అర్థరాత్రి దాకా ఊపిరి సలప కుండా ఉన్న పనిరోజు మధ్యలో బయట పడితే జరగ బోయే పరిణామాల్ని అంచనా వేసుకుంటూ కారు తాళాలు తీసుకుని బయలు దేరాడు సతీష్..

పావు గంటలో అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరకు చేరాడు. మెయిన్ రోడ్డు మీదే కనపడ్డారు జనాలంతా. పోలీసులూ, జనాలూ అంతా గందర గోళంగా ఉంది. ఎక్కడని వెతకాలి అర్జున్ కోసం అనుకుంటూ కారు వేగం తగ్గించాడు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసు…. “నికాల్ నికాల్..” అంటూ హడావిడి పెట్టాడు. ఉన్న గొడవని చూడ్డానికి ట్రాఫిక్ అంతా నిలిచి పోతుందేమోనని అందర్నీ త్వర, త్వరగా పంపించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇలా కాదని కాస్త ముందుకు పోనిచ్చి పక్క సందులో కారు ఆపి మెయిన్ రోడ్దు వైపుకి నడిచాడు. ఇంతలో జనాలు ఆడా మగా మెయిన్ రోడ్డు మీదనించి పరిగెట్టుకుంటూ వస్తూ కనిపించారు. వాళ్ళ వెనక పోలీసులు లాఠీలు జుళిపిస్తూ వెంట పడుతున్నారు. ఇలాకాదని తాను కూడా వెనక్కి తిరిగి, మళ్ళీ కారు లో దూరి స్టార్ట్ చేసి, పరిగెట్టించడానికి సిద్ధంగా ఉంచి, సెల్ ఫోన్ తీసి అర్జున్ కి ఫోన్ చేశాడు. ముందే చేస్తే “నీ పని నువు చేసుకో, నాకేం పర్లేదు, ఇక్కడికేం రావక్కర్లేదు” అంటాడని తెలిసి అప్పటి దాక ఫోన్ చెయ్యలేదు.

“ఎక్కడ రా. నీకోసమే చూస్తున్నా… స్వప్న నర్సింగ్ హోమ్ ముందున్నా” అర్జున్ ఫోన్ ఎత్తగానే హల్లో కూడా అనకుండా అడిగాడు.

“వచ్చేశావా… అక్కడే ఉండు వచ్చేస్తున్నా” చాలా ప్రశాంతంగా జవాబు చెప్పాడు అర్జున్.

వీడింత ప్రశాంతంగా ఉంటే నేనెందుకు అఫీసు మానేసి వచ్చాను అనుకుంటూ రియర్ వ్యూ మిర్రర్ లో అర్జున్ కోసం చూడ సాగాడు.

ఓ మూడు నిమిషాల తర్వాత తీరిగ్గా వచ్చాడు అర్జున్. చేతిలో అప్పుడే కొన్న మంచినీళ్ళ బాటిల్. డోర్ ఒపెన్ చేసి పక్కనే కూర్చున్నాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా కారు పోనిచ్చాడు సతీష్. డ్రైవ్ చేస్తూనే అడిగాడు “ఏమిటి గొడవ” అని. “అవుటర్ రింగురోడ్డు. మా ఇళ్ళమీంచి వేస్తార్ట. ఆ గొడవ ఎప్పణ్ణించో రగుల్తోంది. ఇవ్వాళ ఎంపీ ప్రయివేట్ కాలేజీ ఓపెనింగ్ వస్తున్నాడంటే రోడ్డు మీద కాపు కాశాం… కాలేజీ మానేసి మరీ” చాలా మామూలుగా పూర్తి చేసి, బాటిల్లో నీళ్ళు రెండు గుక్కలు తాగి పూర్తి చేశాడు.

“రెండు నిమిషాల్లో ఎం.పీ వస్తాడనగా పోలీసులు లాఠీలుచ్చుకుని వెంట పడ్డారు. తలా ఓ దిక్కుకి పరిగెట్టారు…. నేను పక్కన ఫుడ్ వరల్డ్ లో దూరి ఈ నీళ్ళ బాటిల్ కొనుక్కుని బయటికి వచ్చా… నీ ఫోన్ వచ్చింది”

“ఏదో గొడవ జరిగి పోతోందని అంటే ఎవడితో పెట్టుకున్నావో నని భయ పడి ఆఫీసు నించి పరిగెట్టుకుని వచ్చా” కాస్త విసుగు ధ్వనిస్తూ అన్నాడు సతీష్.

“మంగ భయ పడి ఉంటుందిలే… మేము గొడవచేద్దామనే వెళ్ళాం. రోడ్డు మీద కూర్చ్జుని ట్రాఫిక్ ఆపేసి… ఎంపీ ఎక్కడికీ వెళ్ళకుండా చెయ్యాలను కున్నాం. అనుకున్న వాళ్ళలో సగం మంది కూడా రాలా… తెల్లారే సరికి ఎవడి ఉద్యోగం వాడికి ముఖ్యం… వెళ్ళి పోయారు. నాలాంటి వాళ్ళం కొందరం వెళ్ళాం. పోలీసోళ్ళు లాఠీ చూపించగానే అసలే పలచగా ఉన్న జనాలు… ఏం సాధిస్తాం చెప్పు.. పారి పోయి వచ్చాం. ” అనుకున్నది సాధించలేక పోయిన అసంతృప్తి ధ్వనిస్తూ చెప్పాడు అర్జున్.

“ఏమీ సాధించలేమని తెలిసినప్పుడు ఈ గొడవలెందుకు? ఆ ఎంపీ దగ్గరకే నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చుగా?” సతీష్.

మాటల్లో కారు అర్జున్ ఇంటి ముందు ఆగింది. సుధ అప్పటికే వచ్చి మంగ పక్కన కూర్చుని ఉంది. అంత వరకూ ప్రశాంతంగా ఉన్న అర్జున్ కి మంగ ని చూడాగానే చుర్రుమంది.

“ఊరంతా టాం టాం చేశావా? నేనెవణ్ణన్నా మర్డర్ చేయడానికి వెళ్ళానా… లేక పోతే ఏవన్నా టంగుటూరి ప్రకాశం లెవెలనుకున్నావా?” అంటూ వాళ్ళావిడ మీద విరుచుకు పడ్డాడు.

“లేదండీ. వాన్లకి వాన్లు పోలీసుకు దిగారు చౌరస్తాలో అని అందరూ అంటుంటే భయమేసింది. చుట్టు పక్కల ఫ్లాట్లలో ఎవరూ లేరు. నేను కదుల్దామంటే చిన్నాడు స్కూలు నించి వచ్చేసే టైం. సుధకి ఫోన్ చేసాను గానీ ఇద్దర్నీ వచ్చెయ్యమన్లా… ఏమన్నా ఫోన్ చేసి మీ కబురు కనుక్కుంటారేమో ననుకున్నా… నేను చేస్తే ఎలాగూ ఫోన్ ఎత్తరూ…” సంజాయిషీ ఇచ్చుకుంది మంగ.

“అయినా ఏమిటి గొడవ ” మళ్ళీ ముట్ట మొదటి ప్రశ్న వేశింది సుధ.

“మళ్ళీ మొదలు. ఈ ఫ్లాట్లు మాకమ్మిన బిల్డరు అన్ని పర్మిట్లూ సక్రమంగా ఉన్నాయని చూపిస్తే కొన్నాం. ఇప్పుడు అవుటర్ రింగు రోడ్డుకి అడ్డొచ్చిందని కూల్చేస్తార్ట. గొడవ మొదలు పెడితే, ఎవేవో పర్మిట్లు లేవని దబాయింపు. మేము ఇళ్ళు కొనుక్కుని రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఏమీ మాట్లాడని నా కొడుకులు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. ఆ పొలిటీషియన్లంతా… ఆ అవుటర్ రింగురోడ్డు పక్కలంతా స్థలాలు ముందే కొనేసుకుని ఉంచుకున్నాడు. ఏమడ్డ మొచ్చినా ఆ రోడ్డు ఇప్పుడు వేయాల్సిందే” బాధంతా వెళ్ళ పోసుకున్నాడు అర్జున్.

కొంత సేపు మవునంగా ఉన్న సుధ ఇంక ఉండలేక అంది. “రింగు రోడ్దు మీద గవర్నమెంటు కూడా గట్టిగానే ఉంది. కష్టమే… ఏ రోడ్డు వేసినా కొన్ని ఇళ్ళు పోక తప్పదుగా… అయినా… కంపెన్సేషన్ ఇవ్వరా?” భయం భయం గానే అడిగింది.

“అవునా… మరి ఒక్క గేటెడ్ కమ్యూనిటీ కూడా పోవట్లేదేం ఏ రోడ్డు కిందా?” వెటకారంగా అన్నాడు అర్జున్.

సుధకి ఆ వెటకారం ఏమాత్రం నచ్చలా “జుబ్లీహిల్స్ రోడ్డు చూశారా…. అందరూ డబ్బూ, పరపతీ ఉన్న వాళ్ళే… అయినా అన్నీ పడగొట్టే రోడ్దు వెడల్పు చేశారు” అంది.

హ హ హ… అంటూ విరగబడి నవ్వాడు అర్జున్…

“అమ్మాయీ నీకు చాలా సంగతులు తెలీవు. ఆ ఇచ్చే కంపెన్సేషన్ మాకెందుకు సరిపోదనుకుంటున్నావ్? మేము ఈ ఇంటిని ఎంతకి రిజిస్ట్రేషన్ చేసుంటాం? పన్నెండు లక్షల ఇంటిని అయిదు లక్షలని చెప్పి రిజిస్టర్ చేస్తాం. నన్ను తప్పు పట్టకు. అలా కాక పోతే బిల్డర్ నాకు అమ్మడు. వాడికిచ్చే బ్లాక్ మనీ వాడి కివ్వాల్సిందే. ఇప్పుడు గవర్నమెంటు అ లెక్కన… మరికొంచెం కలిపి ఏ ఆరు లక్షలో ఇస్తుంది. ఆ పోయిన బ్లాక్ మనీని ఎక్కణ్ణించి తేనూ? మేం ఎక్కువ గొడవ చేస్తే ఏదో పర్మిట్ లేదని చెప్పి అదికూడా ఎగ్గొడతామని బెదిరింపులు ”

అందరూ వింటున్నారో లేదోనని గమనించి మళ్ళీ మొదలు పెట్టాడు.

“ఇక జుబ్లీ హిల్స్ మారాజుల సంగతి. పాపం వాళ్ళ ఇళ్ళని కూడా కూల్చారు కదా! మీరు చదివారో లేదో… ఆ ఇళ్ళు పడగొట్టడానికి ముందు… ఆ ఏరియానంతా కమర్షియల్ జోన్ గా డిక్లేర్ చేసింది గవర్నమెంటు. ఒకే అంతస్తు ఉన్న ఇళ్ళు ఇప్పుడు మూడు నాలుగంతస్తులూ, కమర్షియల్ కాంప్లెక్సులూ కట్టుకోవచ్చు. అంటే, నాలుగు వందల గజాల స్థలంలో ఓ వంద గజాలు పోయినా, మిగిలిన మూడు వందల గజాలకీ కొత్త పర్మిట్ల కారణంగా పెరిగిన ధర అంతకంటే చాలా ఎక్కువన్న మాట. వాళ్ళ బ్లాక్ మనీ చూడు ఎంత భద్రంగా ఉందో. వాళ్ళుపోగొట్టుకునే బ్లాక్ మనీని మార్కెట్లోంచే వాళ్ళు సంపాదించుకుంటారు. మా పరిస్థితి అదికాదు. ”

ఓ రెండు నిమిషాలు అందరూ మవునంగా ఉన్నారు. నోరు తెరిచి సుధ అంది.

“మీరేమనుకోనంటే ఓ మాట చెపుతా… మీ కష్టాన్ని అర్థం చేసుకుంటా. అందుకే నేనూ, సతీష్ మీకోసం పరిగెట్టుకుంటూ వచ్చింది. కానీ మేమంటే… గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామంటే ఏదో పాపం చేసి, అన్యాయంగా దోచుకున్న డబ్బేదో తినేస్తున్నట్టుగా మాట్లాడుతుంటేనే బాధగా ఉంటోంది. మా మట్టుకు మేము నెల నెలా జీతాల్లోంచి ఖచ్చితంగా టాక్సులు కడుతున్నాం. మాకు తోచినంత చారిటీ పని చేస్తున్నాం. వ్యక్తులుగా మమ్మ్లల్ని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదు. ఎవరి మీద కోపమో మామీద చూపిస్తారేంటీ? ఏం… మీ చాకలి పని మానేసి మీరు ఇప్పుడు ఈ ఫ్లాట్ లోకి రాలేదా… మీ కజిన్ ఇంకా శ్రీనగర్ కాలనీ లో ఇస్త్రీ బండి పెట్టుకున్నాడని మీరే చెప్పారు… అతని దృష్టిలో మీరూ ఓ మాదిరి గేటెడ్ కమ్యూనిటీనే. రేప్పొద్దున మీ పిల్లలిద్దరూ చదూకుని మాయింటి పక్కనే చేరొచ్చు… అప్పుడు మీకేమీ తప్పనిపించదు కదా” ఎడా పెడా తన ఆవేశాన్ని దించేసుకున్న సుధ తన కళ్ళలో నీళ్ళు తిరగడాన్ని గమనించలా…

మంగ గబ గబా సుధ దగ్గరికి వెళ్ళి భుజంమీద చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసింది. ఇంత అకస్మాత్తుగా సుధ ఇలా విరుచుకు పడుతుందనీ, అర్జున్ మాటలు ఆమెని ఇంత బాధిస్తున్నాయనీ గమనించక పోవడంతో మవునంగా చూస్తుండి పోయాడు సతీష్.

“లేవండి ఇంటికి పోదాం. నన్ను దింపేసి మీరు ఆఫీసు కి పోదురు గాని” కర్చీఫ్ తో కళ్ళు తుడిచేసుకుని లేచింది సుధ.

అంత సేపు మవునంగా వింటున్న అర్జున్ మెల్లగా లేచాడు. సుధ దగ్గరగా వెళ్ళి చనువుగా ఆమె చేతులు పట్టుకుని అన్నాడు.

“అయామ్ సారీ సుధా! మీమీద నమ్మకం లేక కాదు. నువ్వన్నట్టుగా నన్ను దాటి నాపిల్లలు ముందుకెళ్ళాలనేగా తాపత్రయం. బాధేమిటంటే మనం ఏం వదిలేసుకుని ఏం సాధించుకుంటున్నామని. బయట పడలేని ఏదో వెర్రి లో పడి కొట్టుకు పోతున్నాం అందరం. ప్రతివాడి చుట్టూ గోడలే. మనందర్నీ కలిపి బాధించే విషయమేదీ కనపడదేం? ఎవరి మీద చూపించాలో తెలియని కోపాన్ని మూర్ఖంగా మీమీద చూపించాను. వీడు గాంధీ… ఏమన్నా నోరు మెదపడు… నా నోటి కొచ్చునట్టు వాగొచ్చనుకున్నా…. నిన్ను గమనించక పోవడం తప్పే… ప్లీజ్ డోంట్ లీవ్” ఆఖరి మాట అంటూ సుధ తల మీద చేయి వేసి బతిమాలుతున్నట్టుగా అన్నాడు అర్జున్.

“ఇంగ్లీషులో ప్లీజ్ అంటే అన్నీ సర్దుకు పోతాయా… నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య” మొదటి సారి అర్జున్ భాషలో అతణ్ణే అనుకరిస్తూ దాడి చేశాడు సతీష్… నవ్వుతూ…

***


6 Responses  
 • Jaga writes:
  June 29th, 200912:20 amat

  Hi Akki,

  My knowledge of Telugu is limited to the six years of schooling I did in Andhra. Still I managed to go thru your story with interest. I particularly liked the sensitivity with which you have dealt with the topic. Something rare these days…

 • rnp writes:
  June 29th, 200911:12 amat

  ఇదే తొలిసారి మీ బ్లాగ్ చదవడం ! ఎంతో చక్కగా, మనసుకు హత్తుకునేట్టు రాసారండి ! ఒక కథ చదివితే, రోజంతా గుర్తుంటే, అదీ మంచి కథంటే !

  ఒకే ఒక్క కథ చదివి, నేను మీ అభిమానిని ఐపోయాను ! 🙂

  దయచేసి మీ బ్లాగ్ background, తెలుపు, అక్షరాలు నలుపుకి మార్చగలరా ? అప్పుడు చదవటానికి కూడా హాయిగా ఉంటుంది ! ఈ ఆకుపచ్చ, నలుపు, ఎరుపులు చదవడానికి అంత సౌకర్యంగా అనిపించటం లేదు !

  అయినా, మీ కథ ఆసాంతం చదివేట్టు చేసింది ! ఇంతకీ మీ రేడియో ఇంటర్వ్యూ లో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన రేడియో, ఆ వ్యాఖ్యాత గారు ఎవరండి ? 🙂

 • మురళి writes:
  June 30th, 20091:34 pmat

  బాగా రాశారు.

  కొంత inconclusiveగా అనిపించింది. But probably all our lives are inconclusive to an extent and your story reflects that.

  -మురళి

 • vasanta lakshmi. writes:
  March 7th, 201012:25 pmat

  Gated community has become an island in itself, where as we are already living in our own spaces, aloof from one another. Islands and community islands, the futility, the friction, the controversies, the helpless ness, the anger, the frustration, all chained with friendship. superb.. I liked your story… No other words…

 • T. Srinivasa Rao writes:
  January 25th, 20115:35 amat

  Dear Akki
  Your blog is nice. The story of gated community is very nice. In gated community you can see the barrier between the community and the other society where as we can not see the barrier between the individuals. Now the society we are living in it is surrounded by the hypocrites. Due to hipocracy & inhibitions people are are not expressing them selves. Human values are diminishing and commercial or materialistic values are becoming the basic principles of human beings. You have touched that part in some extent. Keep it up.
  With regards
  Srinu 9848017162.

 • వేణూశ్రీకాంత్ writes:
  September 7th, 20113:49 pmat

  చాలా బాగుందండి. చక్కగా రాశారు..


»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa