"రమాదేవి ఎందుకు రమ్మంది?”
మరోసారి ఆలోచనలోకి జారిపోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో అతనికే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్‌మెంట్‌లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్‌కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్లకి చెప్పుల లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన ఆలోచనలు ఇక సాగవని తెలిసి, ఆ ప్రయత్నం మానేశాడు. తన చెప్పులు వెతికి పట్టుకుని పక్కనే ఉన్న పాత బ్రీఫ్‌కేస్‌ని చంటి పిల్లని దగ్గరకి తీసుకున్నట్టుగా దగ్గరికి తీసుకుని బయటకు చూడసాగాడు.ఎప్పుడో ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి వచ్చాడు హైదరాబాదు. మళ్లీ ఇప్పుడు ఇలా … అయినా..
"రమాదేవి ఎందుకు రమ్మంది?”
మళ్లీ ఆలోచనలోకి జారకుండా జాగ్రత్తపడి పక్కనున్న ప్రయాణీకుడితో మాట కలిపాడు.
"హైదారాబాద్‌లో ఓ మాదిరి హోటల్‌రూం ఎంతవుతుంది?”
"సెక్రటేరియట్లో పనయితే లక్డీకాపూల్లో ట్రయ్ చేయండి. హైదరాబాద్‌లో ఉండే వాళ్లకి హైదరాబాద్ హోటల్ రేట్లు ఎట్ల తెలుస్తయ్ సార్. లక్డీకాపూల్లో అన్నిరకాల హోటళ్లుంటాయ్. స్టార్ హోటల్ నుండి చిన్న హోటల్ దాకా.”
తనకి అవసరమైన విషయం దొరక్కపోవడంతో ఇక రెట్టించే ఉద్దేశం లేక మిన్నకుండి పోయాడు రాజారావు. రెండు రోజులు హోటల్లో ఏనాడూ గడపలేదు. ఎంతవుతుందో తెలీదు. తెచ్చిన డబ్బులు సరిపోతాయో లేదో అంతకన్నా తెలీదు. ఇంతకు మించితే ఇంట్లో ఏమని చెప్పాలి? రోట్లో తలపెట్టి రోకటి పోటుకు భయపట్టమా? సమాధాన పర్చుకున్నాడు.రైలు ఆగిన వెంటనే దిగేశాడు. పెళ్లాం, పిల్లలూ, సామానూ లేకపోతే ఎంత త్వరగా దిగగలిగేనా అని ఆశ్చర్యపోయాడు.
రమాదేవి వస్తున్న రైలు మరో గంటకి వస్తుంది కరక్ట్ టైంకి వస్తే. తనని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీద మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చుని ఉండమంది. అలవాటు లేని స్టేషన్. మిగతా అందరూ హడావిడిగా నడుస్తుంటే, రాజారావు మాత్రం బెరుకు బెరుగ్గా చూసుకుంటూ ఆ ప్లాట్‌ఫాం ఒకటి మీదకి చేరాడు. మెయిన్ ఎంట్రన్స్ ఏదో కనిపెట్టి అక్కడే కూర్చున్నాడు. నిజానికి బయటికి వెళ్లి అర్జంటుగా సిగరెట్ తాగాలని ఉంది. కాని ప్లాట్‌ఫాం మీద కాలిస్తే పోలీసులతో గొడవ. దిగకముందే రైల్లో బాత్‌రూంలో తాగకపోవటం తప్పు. ప్లాట్‌ఫాం నుండి బయటకి వెళ్లేటప్పుడు టికెట్ తీసేసుకుంటే మళ్లీ లోపలికి రావటం కష్టం. అన్ని లెక్కలూ వేసుకుని సిగరెట్ తాగడాన్ని ప్రస్తుతానికి విరమించడమే శ్రేయస్కరమనుకున్నాడు.రమాదేవిని తాను గుర్తు పట్టగలడా ఇప్పుడు? పదిహేనేళ్ల క్రితం చుడీదార్లో చూసిన క్లాస్‌మేట్‌ని, ముప్పయి అయిదేళ్ల చీరలోకి అనువదించి మనసులో బొమ్మవేసుకోవటానికి ప్రయత్నించాడు.
తనకున్న తెలివితేటలకి తగినట్టుగా, విజయవాడలో సీటు దొరికిన కాలేజీలో సీటు దొరికిన డిగ్రీ చదివాడు రాజారావు. ఓ మాదిరి కాలేజి. కో ఎడ్యుకేషన్. నలభయ్ మందున్న క్లాసులో పదిమంది అమ్మాయిలు. అందులో ఒకర్తి రమాదేవి. ఎలా మొదలయ్యిందో తెలీదు. తనేమీ గొప్ప అందగాడూ కాదు. ఆస్తిపరుడూ కాదు, తెలివయిన వాడు అసలే కాదు. అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ చెప్పుకోతగ్గ ఏ గొప్ప విషయమూ లేని సర్వసాధారణమయిన రాజారావుకు రమాదేవి ‘గర్ల్‌ఫ్రెండ్‘ అయి కూర్చుంది.
రాజారావు దృష్టిలో రమాదేవి చాలా తెలివయింది. అందరి దృష్టిలోనూ ఆమె అందగత్తెకిందే లెక్క. వాళ్ల నాన్నకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో చాలా భూములూ గట్రా ఉన్నాయని కూడా క్లాసందరికీ తెలుసు. అసలు ఆమె నెల్లూరు వదిలి విజయవాడ వచ్చి ఆ కాలేజీలోనే ఎందుకు పనికిరాని చదువు చదవాల్సి వచ్చిందో కూడా రాజారావుకు గుర్తులేదు.మీరు లవ్వర్సా” అని అడిగేవారు ఫ్రెండ్స్ రాజారావును. "పెళ్లి చేసుకుంటారా,” " ఏరా ఎంత దూరం వచ్చావ్… చెయ్యెయ్యనిచ్చిందా?” ఇంకా చాలా ఎన్నెన్నో."తనకి నేనంటే ఇష్టం. నేనే ఏమీ ఆలోచించుకోలా” అని చెప్పేవాడు.
తన సినిమా ఖర్చులకీ, సిగరెట్ ఖర్చులకీ రమాదేవి వుంటం మూలాన డిగ్రీ చదివినంత కాలం రాజారావుకు ఇబ్బంది కలగలా!
ఓ సారి ఇద్దరూ కూర్చున్నప్పుడు మరో క్లాస్‌మేట్ నేరుగా అడిగింది. " ఇంతకీ మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఫైనల్ యియర్ అవంగానేనా?” అని . రాజారావుకు గొంతులో వెలక్కాయ పడింది. రమాదేవి వెకిలిగా, పెద్దగా నవ్వటం మొదలు పెట్టింది. "రాజా… ఏదో అడుగుతోంది చూడు” అని రెట్టించింది పైగా. తానేమీ మాట్లాడకపోయేసరికి రమాదేవే మాట్లాడింది, నవ్వాపి కాస్త కరుగ్గా…"నీకెందుకే, మేమేం చేస్తే… నీకు రాజాని చేసుకోవాల్నుంటే అడుగు… నేను పక్కకి వెళ్తా”అంది.
నిజానికి రాజారావుకు భయంగా ఉండేది … రమాదేవి పెళ్లి మాట ఎక్కడ ఎత్తుతుందోనని. ఆమెది చాలా పేరున్న డబ్బున్న కుటుంబం అని తెలుసు. ఆ మాట ఎత్తితే వాళ్ల వాళ్లు తన్ని తగలేసినా దిక్కులేదు. ఒకవేళ ఆ ప్రమాదం తప్పి, పెళ్లే జరిగినా కట్నం గిట్నం లాంటివేవీ దక్కవు. ఆ కట్నం డబ్బు తేకపోతే సొంత ఇంట్లో తన్నులు తినాలి. పోనీ అవి కూడా తప్పినా … ఇంత బరితెగించిన డబ్బున్న పిల్లతో తనెక్కడ బతగ్గలడు.రమాదేవి ఏనాడూ రాజారావును ప్రేమిస్తున్నానని గానీ పెళ్లి చేసుకుందామని గానీ అడగలా. అసలామెకి అలాంటి ఆలోచన ఉందో లేదో తెలీదు రాజారావుకి. ఇప్పటికి కూడా. అందమయిన అమ్మాయి పక్కన నడుస్తుంటే ఊరుకునేంత బుద్దిమంతుడేమీ కాదు రాజారావు. ఓ రోజు సినిమాహాల్లో చాలా మామూలుగా చేతిమీద చేయి వేశాడు. రమాదేవి ఏమీ అనలేదు. ఓ వారంలోపు ఎవరూ లేకుండా చూసి కౌగిలించుకునేదాకా వచ్చేశాడు. ఏమీ అనలా. సినిమాహాల్లో చీకట్లో ఇంకా చాలా దూరం వెళ్లినా ఏమీ అనలా రమాదేవి. ఎప్పుడు సినిమా కెళ్దామన్నా సరే అనేది. అక్కడి దాకా వచ్చాక కూడా ఏమీ అనకపోవటంతో "ఈమెకు ఇంతకుముందే అలవాటుందేమో … జాణ” అని అనుమానపడేవాడు కూడా ఒక్కోసారి.
"ఎక్కడికన్నా రమ్మంటే రాత్రికి కూడా వచ్చేస్తుంది రమాదేవి” అని చెప్పేవాడు ఫ్రెండ్స్‌కి రాజారావు. "అయితే సీరియస్ కాదా? వాడుకొని వదిలేయడమేనా? లక్కీ నా కొడకా” అని కుళ్లుకునే వాళ్లు స్నేహితులు. గర్వంగా ఉండేది రాజారావుకి ఇల్లాంటి మాటలు వింటం.
ఆమెను అనుభవించేద్దామని ఎంత తహతహ ఉన్నా సాహసించలేకపోయాడు ఏనాడూ. తానేమి చేసినా కాదనదు. శరీరం స్పందిస్తున్నట్టున్నా ఈమె మనసుకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదే అని తికమక పడేవాడు. అయినా గీత దాటితే ఏం జరుగుతుందోనని భయం. ఏ భయమూ లేనట్టు రమాదేవి ఉండటం చూస్తే ఒక్కోసారి కోపమొచ్చేది. తను వద్దని వారించవచ్చు కదా అని తనకే అర్థంకాని విసుగేసేది. ఆమె ఉద్దేశ్యం ఏమిటో మాత్రం తెలిసేది కాదు.ఎ.సి టు టయిర్‌లో నిద్రలేచి కూర్చుని చూస్తూ ఉంది రమాదేవి. ఈ పాటికే రాజా చేరిపోయి ఉంటాడు. "ఇంకా చొంగ కార్చుకుంటూ కనపడ్డ అమ్మాయిల పయిటల్ని ఆబగా చూస్తూనే ఉంటాడా?” తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. "అసలు ఇలాంటి వాడితో నీకు చనువేమిటి” అనేవాళ్లు స్నేహితులు.
"కావల్సింది ఏ రిస్కూలేని మగాడేగా… కావాల్సినవన్నీ చేయించుకుని డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు… ఏమే పిల్స్ వాడుతున్నావా?” అని కూడా నవ్వేవాళ్లు స్నేహితులు.
ఏం చెప్తుంది. "అలాగే అనుకోండి” అని వదిలేసేది. కొంతవరకూ నిజమేగా అని కూడా అనుకుంది. నిజంగా డబ్బూ, పరపతీ ఉన్న కుటుంబమే ఆమెది. మామూలు వ్యవసాయ వ్యాపారాల్లోంచి సారా కాంట్రాక్టుల్లోకి, కాంట్రాక్టుల కోసం రాజకీయాల్లోకి, రాజకీయాలకోసం కొట్లాటల్లోకి సహజ పరిణామం చెందిన కుటుంబం. ఈ మార్పులన్నీ తన ఎదుగుదలతో పాటే జరగటంతో ఒక్కొక్క స్వాతంత్య్రమూ కోల్పోతూ వచ్చింది రమాదేవి. అన్నీ వదిలేసి రోడ్డుమీద పరిగెట్టాలని ఉండేది ఆమెకి. ఏ లక్ష్యమూ లేకుండా ఇంటికి దూరంగా పెద్ద కష్టపడే అవసరం లేని చదువుకోసం వెతుక్కుంది. తర్వాత ఎలా అన్న ఆలోచన లేదు. ఏ బాదరబందీ లేకుండా తిరగాలి అని తప్ప మరో ఆలోచనలేదు.ఏ పోటీలూ, ఏ ఆశయాలూ, ఏ ఆశలూ లేని రాజారావు ఆమెకి సహజ మిత్రుడనిపించాడు. మంచి చెడుల ప్రసక్తిలేదు. కక్కుర్తి పడి చెయ్యేసినా కాదనలేదు… తనకొచ్చే నష్టమేమీ లేదు. పోను పోను అదీ బానే ఉందనిపించేది. రాజారావు లాంటి అర్భకుడు అంతకుమించి దూరం ఎలాగూ పోలేడని తెలుసు. ఒకవేళ ఆ మనిషి ధైర్యం చేసి అంతదూరం పోయినా కాదనే ఉద్దేశ్యం గానీ అదేదో కొంపలంటుకుపోయే వ్యవహారం అనిగానీ లబోదిబోమని ఏడ్చే తత్వం కాదు ఆమెది.చివర్లో పెళ్లి చేసుకుంటానంటాడేమోనని కొంత ఆశపడిన మాట నిజం. బతుకంతా అనవసరపు ఆర్భాటాలు లేకుండా గడిపేయొచ్చని ఆశ. అయినా ఆమెకి తెలుసు. రాజాకి తాను పెద్ద బరువే అవుతానని. తానే అడిగి అతణ్ణి ఇబ్బంది పెట్టదలచుకోలేదు.
ఓ సారి ఆ సందేహం తీరిపోయాక పెద్దవాళ్లు చూపించిన సంబంధాల్లో తనకి నచ్చిందే ఏరుకుంది. సహజంగా తమలాంటి ఆస్తీపాస్తీ ఉన్న కుటుంబమే. గుడ్డిలో మెల్లలా… కాస్త రాజకీయాలకీ గొడవలకీ దూరంగా ఉండి చదువుకుని లెక్చరర్‌గా పనిచేస్తున్న పెళ్లికొడుకుని భర్తగా ఏరుకుంది. చూచాయగా రమాదేవి ప్రవర్తన గురించి తెలిసిన పెద్దవాళ్లు, అంత చక్కగా ఆమె సంసారంలోకి ఇమిడి పోతుందని అనుకోలేదు.
పదేళ్ల సంసారం తర్వాత రమాదేవి భర్త మంచాన పడ్డాడు. ఎప్పుడో ఓ సారి పేకాట ఆడ్డం తప్ప ఏ వ్యసనమూ లేని భర్త మంచం పట్టడం పెద్ద బాధే రమాదేవికి. ఎంత ఖర్చయ్యే, వైద్యానికయినా లొంగని జబ్బు అంటుకున్నాక ఇంక చేసేదేముంది? అన్ని ఆశలూ వదిలేశాక. భర్త పోరు పళ్లేక ఇంటికే తెచ్చేసింది. ఇంట్లోనే ఓ నర్సునీ ఇతర అవసరాల్నీ ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ సిలిండర్‌తో సహా అన్నీ ఇంట్లోనే సమకూర్చి… తనకి తెలియకపోయినా … ఆ ఆఖరి ఘడియలకోసమే ఎదురుచూస్తోంది!భర్తని చూస్తే ఆమె కడుపు తరుక్కు పోతుంది. చెప్పలేని జాలి. ఇద్దరి మధ్యా సినిమాల్లో చూపించే ప్రేమలాంటిది ఎంత ఉందో తెలీదు గానీ, ఒకరికొకరు అండగా, గౌరవంగానే బతికారు. "ఇంత ఖర్చూ పెట్టి, ఇంత అవస్థ పడి ఇంకో ఆర్నెల్లో సంవత్సరమో బతక్కపోతే ఏం… పోనీ రాదూ” అనేవాడు.
"అందరం అంతే… ఎవరు చూడొచ్చారు నే ఎక్కే ఆటోని ఏ బస్సువాడో గుద్దేస్తే మీకంటే నేనే ముందు పోతా” అనేది.
ఏదేమయినా ఒకటి మాత్రం నిజం. రమాదేవికి మళ్లీ స్వాతంత్య్రం పోయింది. భర్త ఉద్యోగం వదిలేయడంతో అంతకుముందునుండీ ఉన్నప్పటికీ అంతగా పట్టించుకోని తమ వాటా ఆస్తీ, వ్యాపారాలు బంధువుల చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకుంది. వ్యాపారాలు, పిల్లల చదువులూ, ఇల్లూ, నర్సూ, హాస్పిటలూ, డాక్టర్లూ, మందులూ … ఇదీ ఇప్పుడు రమాదేవి జీవితం. భర్తతో కలిసి సినిమాలకి వెళ్లటం, సరదాలూ, సరసాలూ అన్నీ కోల్పోయింది.
ఎంత తిక్కగా, నిర్లక్ష్యంగా ఉండేదాన్ని చదువుకునేటప్పుడు … అప్పుడు మాత్రం బాధ్యతలు లేవా, అప్పుడెలా అలా ఉండగలిగాను అనుకునేది. అప్పట్లో రిస్కంటూ ఉంటే తన ఒక్కదాని గురించే కాబట్టి అలా ఉండగలిగాను అని సమాధానపడేది. ఇప్పుడు మాత్రం రిస్కులేని మార్గం దొరికితే ఎంజాయ్ చెయ్యకుండా ఉంటానా అనుకుంది.
రాజారావు గురించి వాకబు చేసింది. ఎక్కడున్నదీ తెలిసిన వెంటనే ఫోన్ చేసింది. అన్నీ ఉంటే చేసేదాన్నేనా అని ప్రశ్నించుకోలేదు. ‘హైదరాబాద్‌లో బ్యాంకు పనికోసం వెళ్లినప్పుడు రమ్మంటే‘ అని ఆలోచించింది. ‘మళ్లీ ఒళ్లంతా తడుముతాడా? ఇంకా ముందుకే వెళ్తాడేమో? రాజారావుతో దొరికే ఆ రిస్కులేని, ఏమంత గొప్ప విషయాలు ఆశించని ఆ అమాయకపు రిలీఫ్‌కోసం … అదేమంత పెద్ద విషయనిపించలేదు ఆమెకి.
ఏమయినా రాజారావుకి తన కష్టాల గురించి చెప్పొద్దనుకుంది. తన మీద జాలిపడి ఎప్పటిలా ఉండడేమో అని భయపడింది. చుట్టుపక్కల అందరి దగ్గర్నించీ అనుభవించీ అనుభవించీ ఆ జాలిలోంచి పారిపోవాలనే ఆమె ప్రయత్నం! ‘మళ్లీ రాజారావు కూడా తనమీద జాలి పట్టం మొదలు పెడితే? వద్దులే‘ అనుకుంది.
ఆలోచనల్లోనే ఊరు దగ్గరవటం గమనించింది. మెల్లగా అన్నీ సర్దుకుని దిగటానికి సిద్దమయింది.రాజారావు తన ఆలోచనల్లో తనున్నాడు.
తను డిగ్రీ తీసుకుని వెళ్లేటప్పుడు కూడా ‘రాజా చెప్పేదేమన్నా ఉందా‘ అని అడిగింది ఆఖరిసారి కలిసినప్పుడు. తర్వాత ‘పెళ్లి సంబంధాలు చూస్తున్నారు‘ అని రాసింది.
ఆ తరువాత శుభలేఖ వచ్చింది. ఆ తర్వాత ఇంకేమీ రాలా. గుర్తుచేసుకున్నాడు. రమాదేవి వెళ్లిపోయాక చాలా అవస్థే పడ్డాడు రాజారావు. సిగరెట్లకీ సినిమాలకీ డబ్బులు లేక. పైపైన తడమడానికే అయినా ఆ ఆడస్పర్శ కూడా కరువవటంతో సినిమాల్లో హీరోయిన్లను చూసినప్పుడల్లా తట్టుకోలేక ఉద్రేకానికి లోనయ్యేవాడు. ‘ఎవర్తినో రేప్‌చేసేస్తే గానీ తాపం తీరేట్టులేదు‘ పైకే అనేవాడు రాజారావు కసిగా.
‘ముప్పయి రూపాయలు తేరా, ఫామిలీ టైపు సెటప్చేస్తా‘ అంటూ ‘దగ్గరకొచ్చి పయిటమీద చెయ్యెయ్యనిచ్చిన పిల్లనే ఏమీ చేయలేని దద్దమ్మవి. నీకు అమ్మాయిలెందుకులే‘ అని తేల్చేసేవాడు రాజారావు స్నేహితుడు ఒకడు.
ఏదో ప్రయివేట్ స్కూల్లో లెక్కలు చెప్పేందుకు చేరాడు. 20 మందితో ప్రారంభమైన స్కూలు బాగానే పెరిగి ఇప్పటికీ తనకి సరిపడీ సరిపడని జీతాన్నిస్తోంది. గవర్నమెంటు ఉద్యోగం తనకు ఎలాగూ దొరకలేదు.
రమాదేవి వెళ్లిపోయిన రెండేళ్లకి 40 వేలు కట్నం తీసుకుని ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. ఆ కట్నం డబ్బులు పెళ్లాం పేరు మీద బ్యాంకులో ఇప్పటికీ అత్తామామలే లెక్క చూడటం ఒళ్లు మండే వ్యవహారం రాజారావుకి.
పెళ్లాం రావటంతో పోయిన ఆడతోడు దొరికింది. ధైర్యంగా సంసారం చేసి రెండేళ్లలో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అల్లుడి మీద నమ్మకం ఉండబట్టో, లేకపోబట్టో తెలీదుగానీ, అత్తామామలే కూతుర్ని తీసుకెళ్లి మరింక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి పంపించారు.
రమాదేవికి కూడా ఇద్దరు పిల్లలనుకుంటా. ఎప్పుడో ఓ క్లాస్‌మేట్ చెప్పిన గుర్తు. నెల్లూరులోనే ఉంటోందని కూడా వినటమే. గత పదేళ్లుగా ఆమె సంగతే వినలేదు రాజారావు.
సడన్‌గా ఎలా తెల్సుకుందో తెలీదు. తన సెల్‌కి ఫోన్ చేసింది. ఎవరో స్కూల్లో పనిచేసే క్లర్క్ వాళ్ల ఊరివాడనీ, తన ద్వారా నంబర్ సంపాయించాననీ చెప్పింది.
రాజారావుకి ఏమీ మాట్లాడ్డానికి కనపళ్లా. అడిగిన వాటికి సమాధానం చెప్పాడు. ఎక్కడ ఉంటున్నాడు, పిల్లలేం చేస్తున్నారు అలాంటివన్నీ అడిగింది. ‘సినిమాలు చూస్తున్నావా, మీ ఆవిడకి చూపిస్తున్నావా?’ అని అడిగి సమాధానం కోసం చూడకుండా పగలబడి నవ్వింది. ఎందుకో తెలీకపోయినా కోపం వచ్చింది రాజారావుకి. ‘ఛీ! మొగుడూ పెళ్లాల గురించి మాట్లాడే మాటలేనా ఇవ్వి‘ అనుకున్నాడు. కానీ బయటకి అనలేకపోయాడు.
తన దగ్గర్నించి పెద్ద ఆసక్తి కనపడక పోవటం మూలాన అనుకుంటాను. రమాదేవి మరో ఒకటి రెండుసార్లు ఫోన్ చేశాక మానేసింది.
ఓరోజు అకస్మాత్తుగా మళ్లా ఫోన్ చేసి అడిగింది. ‘హైదరాబాద్ వస్తావా‘ అని.
‘ఎందుకు‘
‘నిన్ను చూడాలని ఉంది. సినిమాకి కూడా వెళ్దాం‘ వినపడీ వినపడకుండా నవ్వు.
‘ఒక్కదానివే వస్తున్నావా? నేనూ ఒక్కణ్ణే రావాలా‘
‘అవును. రాగలవా? ఓ రెండు రోజులు గడిపి వచ్చేద్దాం.‘
‘అమ్మో మా ఆవిడకి తెలిస్తే?’
‘అవన్నీ నువ్వు చూసుకో. నేను మా ఆయన్ని వదిలి రావట్లా!‘
‘నువ్వు వేరు ఎంతకయినా తెగించిన దానివి.‘
‘……’ నిశ్శబ్దం అటునుంచి.
‘చూస్తా ఆలోచించుకుని చెప్తా.‘
‘రేపు ఫోన్ చేస్తావా‘
‘ఎల్లుండి. నువ్వే చెయ్యి. నా సెల్‌లో రిసీవింగ్ మాత్రమే ఉంది.‘
అప్పట్నించీ ఆలోచిస్తున్నాడు.
‘రమాదేవి ఎందుకు రమ్మంది?’
‘మొగుడు చాతకాని వాడా? అతని వల్ల సుఖం లేదా? అప్పుడు తీరని నామీది మోజుని ఇప్పుడు తీర్చుకోవాలని వస్తోందేమో!‘ ఎన్నెన్నో ఆలోచనలు … దేనికీ సమాధానం దొరకలా.
అత్తారింటికీ, గుళ్లకీ, సినిమాలకీ తప్ప ఎక్కడికీ తిరగని రాజారావు రెండు రోజులు హైదరాబాదు వెళ్లి రావటానికి తగిన కారణం వెతకడానికి చాలా అవస్థ పడ్డాడు.
మొత్తానికి ఏదో ఒకటి చేసి రైలెక్కాడు. ఇప్పటికీ తెలీదు … రమాదేవి ఎందుకు రమ్మందో…
‘ఎందుకన్నా రమ్మననీ … ఇద్దరికీ పెళ్లిళ్లయి పోయాయి. ఎవరికీ దొరకనంత వరకూ ఏం చేసినా గొడవ లేదు. పదిహేనేళ్ల క్రితం ఉన్న భయాలేవీ ఇప్పుడు లేవు. రమాదేవి బయటపడి తన మెడకు చుట్టుకోలేదు. తనూ తప్పు చేస్తోందిగా? దొరికిందే సందు, ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడమే‘ రాజారావు ఉన్న డబ్బులు తీసుకుని రైలెక్కి వచ్చేశాడు.అత్తింటివాళ్లను వేధించి రెండేళ్లక్రితం సాధించుకున్న వాచీలో టైం చూసుకున్నాడు. మరో పావుగంటలో వచ్చేస్తుంది రమాదేవి రైలు. ఇక్కడ హైదరాబాదులో తనని గుర్తు పట్టేవాళ్లు లేరు కదా అని ఓ సారి చుట్టూ చూశాడు.
ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వస్తున్న వాళ్లు కనపడేట్టుగా కూర్చున్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అందర్నీ చూస్తున్నా ఎలా మిస్ అయ్యాడో తెలీదు… దగ్గరకొచ్చిందాకా గమనించలా. నీలంరంగు కాటన్ చీరలో, వెనక కూలీ నెత్తిన సూట్‌కేస్‌తో, చేతిలో హేండ్‌బాగ్‌తో వస్తున్నది రమాదేవి.
రమాదేవి ఎంత దూరం నించి గుర్తించిందో తెలీదు గానీ, "రాజా ! నువ్వేగా?” అంటూ దగ్గరకొచ్చేసింది.
"నేనే” అంటూ మరో మాట రాక, రమాదేవిని పైనించి కిందదాకా చూడ్డం మొదలుపెట్టాడు. అప్పటికంటే కొంచెం లావయింది. కళ్లు లోతుగా ఉన్నాయి. బహుశా రాత్రి నిద్ర లేకపోవటాన కాబోలు. ఇప్పటికీ అందగత్తె కిందే లెక్క.రమాదేవి చనువుగా రాజారావు చేతిని చేతిలోకి తీసుకుని "పద. తీరిగ్గా బయటకి వెళ్లి మాట్లాడుకుందాం”అంటూ వెంటే రమ్మని కూలీకి సైగచేసి ప్లాట్ ఫాం బయటకి నడిచింది.
"నీకేమన్నా ఊరు తెలుసా? ఆటోవాణ్ణి అడిగి వెళ్దామా?” అయోమయంగా చూస్తూ అడిగాడు.
"నువ్వలా సిగరెట్ తాగుతూ ఉండు. మిగతావి నే చెప్తాగా” అంటూ సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. అరనిమిషం మాట్లాడిందో లేదో ఫోన్ కట్ చేసి 2413 నంబరు కారు వస్తుంది చూడు అంది. మరో నిమిషం గడిచిందో లేదో, తెల్ల అంబాసిడర్ కారు మెట్ల దగ్గరికి వచ్చి ఆగింది.
‘ఈమెకి ఎప్పుడూ డబ్బుకి కొదవలేదు. ఊళ్లో దిగకముందే టాక్సీ ఏర్పాటు చేసుకుని మరీ వచ్చింది. చూడబోతే అన్ని ఏర్పాట్లూ చేసుకునే వచ్చినట్టుంది. ఈ లెక్కన హోటల్ ఖర్చు కూడా నాకు తప్పినట్టే ఉంది‘ మనసులోనే ‘హమ్మయ్య‘ అనుకున్నాడు.
"ఇప్పుడు చెప్పు. ఎలా ఉన్నావు?” కారు కాస్త దూరం వెళ్లాక మొదలుపెట్టింది రమాదేవి.
"నాకేముంటాయి రమా. ఏదో చిన్న బళ్లో లెక్కలు చెప్పుకుంటున్నాను. నువ్వే చెప్పాలి. ఆ బెజవాడ తప్ప నాకేం తెలీదు” కాస్త నిజాయితీగానే చెప్పాడు.
కాసేపు మామూలు కబుర్లు. పిల్లలూ, సంసారం కష్టాలూ సుఖాలూ అన్నీ దొర్లి పోయినయ్. మాట్లాడుతూనే హైదరాబాద్ నగరాన్ని వింతగా చూస్తున్నాడు.
"నెల్లూరు నించి వచ్చిన నేను బాగానే ఉన్నాను. బెజవాడలాంటి నగరాన్నుంచి వచ్చి అంత పల్లెటూరివాడిలా చూస్తావేం?” అంది రమాదేవి, సిటీ చూస్తూ ముభావంగా సమాధానాలు చెప్తున్న రాజారావుతో.నువ్వు దేశాన్నంతా తిరిగేసినట్టున్నావు. నాకు ఆ బెజవాడే ప్రపంచం. పెద తిరుపతి సంవత్సరానికి ఒకసారి వెళ్లివస్తా. అంతకు మించి పెద్ద తాహతు లేదు నాకు” కిటికీ లోంచి సిగరెట్ పొగ బయటికి వదులుతూ చెప్పాడు.
"అవునులే. హైదరాబాద్ వస్తూనే ఉంటాం మేము” అంది రమాదేవి.
‘ఎవరితో‘ అని అడగబోయి ఆగిపోయాడు. "ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం?” అని అడిగాడు. చూడబోతే కారు ఊరు దాటి బయటకి పోతున్నట్లు అనిపించింది. మిలటరీ వాళ్ల ఏరియాలో ఉంది కారు. "ఇంకో ఐదు నిమిషాలు. ఊరిబయట రిసార్ట్ కి” వివరించింది.
"రిసార్ట్ అంటే?”
"ఊరిబయట పెద్ద తోటలో హోటల్ రూముల్లా ఉంటాయి. రెండురోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండాయ ఉండొచ్చు” చేతి మీద చేయి వేసి చెప్పింది
.
పూర్తిగా తయారయే వచ్చింది అనుకున్నాడు. మరో పావుగంటలో రిసార్ట్ చేరారు. ఆఫీసులోకి వెళ్లి అన్నీ తనే మాట్లాడి వచ్చింది. పెద్ద ఖరీదయిన బట్టలేమీ వేసుకోలా రమాదేవి. అయినా ఆమెలో ఏదో తనకు లేని దర్పం ఉందనిపించింది. అలా అనిపించిందే తడవు అందరూ తననే చూస్తున్నారనిపించింది. మగాడు బెరుకు బెరుగ్గా దిక్కులు చూడడమేమిటి, ఆడది చురకత్తిలా అన్నీ చేసుకుపోవడమేమిటి?కాటేజీలా చెట్ల మధ్యలో ఉన్న రూము తాళం చెవులు తీసుకుని వచ్చాడు బాయ్. మీ లగేజ్ అని చేతిలో ఉన్న నా చిన్న బ్రీఫ్‌కేస్ వంక విచిత్రంగా చూసి మారు మాట్లాడకుండా తన చేతిలోకి తీసుకున్నాడు. రూము తలుపులు తీసి, రూములో ఉన్న ఎ.సి. ఆన్‌చేసి అక్కడే నిలబడ్డాడు. బాత్ రూంలోకి వెళ్లబోయిన రమాదేవి ఆగి హేండ్‌బేగ్ లోంచి పదిరూపాయల నోటు బాయ్ చేతిలో పెట్టి పంపించింది. అలా నిలబట్టానికి అర్థం టిప్ కోసమని తెలియలేదు రాజారావుకు.
ఇద్దరూ స్నానాలు చేసేటప్పటికి రూముకే బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. అసలు అలాంటి ప్రపంచమే చూసెరగని రాజారావుకు అంతా అయోమయంగా ఉంది. సుబ్బరంగా తినేసి మళ్లీ మరో సిగరెట్ కాల్చాడు.
తయారయి రిసార్ట్ అంతా తిరిగారు. మధ్యలో రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేశారు. చూడాల్సినవన్నీ అయిపోయాక, ఓ మూలగా ఉన్న చెట్ల పక్కన కూర్చున్నారు. అప్పటికి మాట్లాడడానికి ఉన్న మామూలు రోజువారీ సంగతులు అయిపోయాయి. రిసార్ట్ ప్రత్యేకతల గురించిన ఉత్సాహం తీరిపోయింది.
ఆనుకుని కూర్చున్న రమాదేవి నడుమ్మీద చెయ్యివెయ్యాలన్న కోరికను అతి కష్టంమీద ఆపుకున్నాడు. పొద్దుట్నించీ ఆనుకుని నడుస్తున్న రమాదేవి మీద చెయ్యి వేసినా ఏమీ అనదు అని నమ్మకం ఉన్నా సాహసించలేకపోయాడు. అలా ఎంతసేపున్నారో తెలీదు. మళ్లీ ఊసుపోని కబుర్లు.త మాట్లాడుతూనే ఉన్నాడు గానీ రాజారావు ఇంకా తేలట్లేదు…
‘రమాదేవి ఎందుకు రమ్మంది?, ఎందుకు వచ్చింది?’
ఎంత ఆలోచించినా మరో ఆలోచన రావట్లేదు. తనతో శారీరకంగా కలవడానికి కాక అంత ఖర్చుపెట్టడానికి ఎందుకు సిద్ధపడుతుంది? ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా మెల్లిగా కదిలి ఆమె నడుమ్మీద చెయ్యి వేశాడు. ఊహించినట్టుగానే రమాదేవి ఏమీ అనలేదు. మాట్లాడుతూనే ఉంది. ఏమీ తెలియనట్టు మెల్లిగా దగ్గరగా జరిగింది కూడా. ఆ ఒక్క కదలికతో మళ్లీ కాలేజి రోజులు తిరిగి వచ్చేశాయి.
ఇంక సందేహం లేదు. ఆమె అందుకోసమే వచ్చింది. అని నిర్ణయించేసుకున్నాడు రాజారావు. కొద్దిగా క్లూ దొరికితే చాలు చాన్స్ వదలకూడదని
నిరయించేసుకున్నాడు. నిర్ణయమయితే తీసుకున్నాడు కానీ, ఇలాటి నిర్ణయాలు లోగడ కూడా చాలానే తీసుకున్నానని గుర్తురాలేదు. తనతో ఆ సుఖం కోసమే వచ్చేసిందని నిర్థారణకి వచ్చేశాక ఇంకేం క్లూ కావాలి అని ఆలోచన రాలేదు. రెండ్రోజులూ ఎదుర్చూస్తూనే ఉన్నాడు తన పక్కకి రమ్మంటుందేమోనని. కాని రమాదేవి ఎప్పటిలానే రమ్మనదు, పొమ్మనదు.
పోనీ తానే ధైర్యం చేసేద్దామా అని ఆలోచించక పోలేదు. మళ్లీ పూర్తిగా చెడుతుందేమోనని భయం. అక్కడిదాకా వచ్చాక ఛీ,ఫో అంటే…మళ్లీ పిలవకపోతే…
రెండ్రోజులూ గడిచిపోయాయి… ఏదో అనుభవిద్దామనుకున్న రాజారావు ఏదీ అనుభవించకుండానే ఇంటిముఖం పట్టాడు.రాజారావు గారూ మీకు నెల్లూరు రమాదేవిగారు తెలుసటగా. క్రితం నెల నా దగ్గర మీ నెంబరు తీసుకున్నారు.”
"అవునండీ, మా క్లాస్మేటు” చాలా మామూలుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ సమాధానం చెప్పాడు రాజారావు.
"మీకు చెప్పే ఉంటారు … ఆయనకి ఇంకా సీరియస్ అయిందిట” క్లర్క్.
"ఎవరికీ?” రాజారావు.
"ఇంకెవరికీ, రమాదేవిగారి భర్తకి. ఏదో పెద్ద జబ్బే. సంవత్సరంనించీ మంచం మీదే ఉన్నారు. ఇక రేపో మాపో అనుకుంటున్నారు. మీకు ఫోన్ చేశానంటే చెప్పే ఉంటారనుకున్నాను.” అని పూర్తి చేశాడు క్లర్కు.
"ఆ మరే” అని చెప్పి అక్కణ్ణించి తప్పుకున్నాడు రాజారావు. షాక్ తగిలినట్టుగా ఉంది. ఒక్కమాట కూడా చెప్పలేదే, తనతో రెండు రోజులు గడిపినా?
‘అనుకున్నట్లే … ఆస్తికోసం మొగుడు… ఇతరత్రా వాటికోసం నేను… రసికురాలు… అనవసరపు అనుమానాలతో, భయాలతో వచ్చిన అన్ని అవకాశాలూ వదులుకున్నాను. రమ్మనదు, పొమ్మనదు…మనసులో ఏముందో తెలీదు‘ మనసులోనే విసుక్కున్నాడు.
‘ఇప్పుడిక సందేహం లేదు. ఈ సారి దొరకనీ వదిలేది లేదు‘ అనుకున్నాడు.
అటూ ఇటూ చూసి మెల్లగా వీలు చేసుకుని ఫోన్ చేశాడు రమాదేవికి.
"హలో మీ ఆయనకి బాగాలేదటగా… నాకు చెప్పలేదేం?”
"నువ్వుమాత్రం ఏం చెయ్యగలవు రాజా”
"కనీసం నీ కోరిక అయినా తీర్చి ఉండే వాణ్ణి. నువ్వెందుకు రమ్మన్నావో తెలీక భయపడి నీకు దూరంగా ఉండిపోయాను.”ఎంత దగ్గర చేరినా ఎందకో గీత దాటలేకపోయిన తన ఆ రెండురోజుల అసక్తతనీ గుర్తు చేసుకుంటూ అన్నాడు.
"ఈ సారి చెప్పు. ఎప్పుడంటే అప్పుడు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు. పగలూ రాత్రీ, ఎక్కడంటే అక్కడ…” ఇంకా ఏదో చెప్పబోయాడు.
"పెట్టరా ఫోను. మళ్లీ చెస్తే చంపేస్తాను” అని అరిచి ఫోన్ పెట్టేసింది రమాదేవి.
"రమా … రమా… ఏమయింది…” అరుస్తూనే ఉన్నాడు రాజారావు…. అప్పటికే లైన్ కట్ చేసేసింది రమాదేవి.
ఎన్నిరోజులయినా అర్థం కాలా రాజారావుకి ఆమె ఎందుకలా చేసిందో … గుర్తొచ్చినపుడల్లా అదే అర్థంకాని ప్రశ్న అతగాడికి…
‘రమాదేవి ఎందుకు రమ్మంది?’
——————–
కధలో వాస్తవాలు ఆలోచింప జేసాయి. బాగుంది.
EE KATHA NU NENU GATHAM LO CHADIVANU .
CHAALA BAGUNDI
కథ చదివించింది. రమాదేవి కోణంలోంచి కథ చెప్పకపోతే ఇంకాస్త బాగుండేదనిపించింది. (అంటే ఆమె ఆలోచనలూ వగైరా.)
బ్లాగు బాగుంది గానీ—aarg!—ఈ టెంప్లేటు, ఆర్మీగ్రీన్ మీద ఎరుపు అక్షరాలు, చదవడానికి కష్టంగా వుంది.
నాకు ఈ కథ కంటే ఆథర్స్ కట్టే నచ్చింది.