SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
నాయకుడు లేని చోట…
January 9th, 2010 by akkirajub

ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి జనవరి 10, 2010 ఆదివారం నాడు ప్రచురించింది.

ఈ వ్యాసాన్ని ఆంద్రజ్యోతి లో చదవాలంటే ఇదిగో లంకె! జ్యోతి లో కొద్దిగా ఎడిట్ చేసి వేశారు. పూర్తి పాఠం కావాలంటే ఇక్కడ చదవండి.

-ఆక్కిరాజు

_____________________________________

ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తుంటే, పూర్తిగా బలహీన పడ్డ పునాదుల మీద నిలబడ్డ పేద్ద భవంతిని చూస్తున్నట్టుగా ఉంది. పూచిక పుల్లల మీద నిలబెట్టిన గుండ్రాయి చందం. ఎవడిని ఎవడూ నమ్మడు. నాయకులన బడే వాళ్ళని నమ్ముదామనుకున్నా, వాళ్ళేమి నమ్ముతున్నారో, దేనికి వాళ్ళు చివరంటా నిలబడతారో ఊహించలేని పరిస్ఠితి. భాషతో, పదాలతో ఆటలు. అస్పష్ట ప్రకటనలతో ఆ క్షణాన్ని ఎలాగోలా దాటవేయాలని చూసే అసమర్థ రాజకీయ వేత్తలు.

తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకన్నా బాధాకరమయిన సమస్య మనకి ఒకళ్ళో ఇద్దరో నాయకులు లేకపోవడం. నమ్మదగ్గ నాయకులు లేకపోవడం. అసలు సమాజంలోనే నమ్మకం లేక పోవడం, లేకుండా పోవడం.

ఎక్కడో చదివాను. నీతి, న్యాయం అని. నీతి నీకు చెప్పబడ్డ మార్గం. అది చట్టం కావచ్చు, మతం కావచ్చు. న్యాయం అనేది నీ సంస్కారం, నీ విజ్నత (Conscience & wisdom) . ఈ హింస "న్యాయ"మేనా అని అర్జునుడు ప్రశ్నిస్తే, "నీతి" బోధ చేశాడు కృష్ణ్దుడు. ప్రభుత్యాలకు నీతి ఉంటుంది. నాయకులు న్యాయమని పించిన వాటిని సామాజిక నీతిగా, రీతిగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మారుతున్న సామాజిక న్యాయాన్ని ఎప్పటికప్పుడు సామాజిక నీతిగా మారాల్సిన ఆదర్శం దాగి ఉంది.

నాయకుడన్న వాడు తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఉండగలగాలి. ఇద మిథ్దంగా ఆ సంగతి చెప్పగలగాలి. దానికి అందర్నీ ఒప్పించ గలగాలి. వారందరికీ మార్గదర్శకుడు కాగలగాలి. అది ప్రస్తుత నీతికి ఎదురొచ్చేదయితే, రాళ్ళ దెబ్బలు తినే ధైర్యం ఉండాలి. రాళ్ళు విసిరే జబ్బు కాదు ఉండాల్సింది. ఎక్కడా అలాటి నాయకులు కనపడరేం? "అన్ పాప్యులర్" అయిన ఆలోచన అయినా సరే "అదే నా నమ్మకం" అని చెప్పగలిగే నాయకులు లేని వికలాంగుల ప్రజాస్వామ్యం ఇది.

ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నది రాజకీయ వేత్తలు. నాయకులు కారు. We only have politicians but not leaders. ఈ రాజకీయ వేత్తలు ప్రజల్లోకి చూస్తారు ఏది ఎక్కువ ప్రజామోద్యమయిన మార్గం అని. తమలో తాము చూసుకునే శక్తిలేక. శక్తిలేక అనేకంటే, దానివల్ల వారికి కావల్సిన లాభం లేనందువల్ల అనటం సమంజసం. పైగా అందరి మాటనే తన మాటగా వల్లె వేయడమే ప్రజాస్వామ్యమని నమ్మ పలుకుతారు. తన నమ్మకాన్ని, తన సిద్ధాంతాన్నీ, తన మార్గానికీ ప్రజామోదాన్ని సాధించి దానికి ప్రాతినిధ్యం వహించడమే ప్రజాస్వామ్యమని చెప్పే నాథుడు లేడు. అందుకే సమాజం రెండుగా అంతకన్నా ఎక్కువగానో చీలిపోయి, ఆవేశాలు బజారులోకి చేరాక, ఇలాటి రాజకీయ వేత్తలకి ఏంచేయాలో తోచదు. స్వంతగా ఓ మార్గం లేని వాళ్ళు ఎక్కడ కక్కడ, ఎప్పటి కప్పుడు ఓ మార్గాన్ని వెతుకులాడతారు, అందరి ఓట్లకోసం. అది సహజంగా ఎవరికీ రుచించని పస లేని మార్గమే అవుతుంది. లేదా అస్పష్టతలతో పరిస్థితులని జటిలంచేసే వెర్రి ప్రయత్నమన్నా అవుతుంది. "ఇప్పుడంతా ప్రజల చేతుల్లోకి పోయిందీ" వాళ్ళు చెప్పిందే మేము చేస్తున్నాము అనే వాడు నాయకుడుగా ఆత్మ హత్య చేసుకున్నట్టు, ఒకవేళ ఏనాడయినా నాయకుడయి ఉండి ఉంటే. అదే పరిస్ఠితి వస్తే నిజమయిన నాయకుడు అన్నిటికీ రాజీనామా చేసి, ఇంట్లో కూర్చోవాలి.

కావలసింది ఇప్పుడు కాస్త వెన్నెముక ఉన్న నాయకులు. ఏది తాను నమ్ముతున్నది. ఎందువల్ల అదే అనుసరణీయం అని చెప్పగల నాయకులు. అలాటి నాయకులు అలాటి భావాలూ బయటకు వస్తే, ఏ ఆలో చన వెనక ఎందరున్నారో తెలుస్తుంది. అప్పుడేమి జరిగినా బాధ ఉండదు. కాసిని తక్కువ బస్సులు తగలబడతాయి. కాసింత తక్కువ మంది ఆహుతయి పోతారు. అలాటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించ గలిగిన నాయకుల వల్ల నమ్మకం అనేది కలుగుతుంది. నాకు హిందీ జాతీయ భాషగా ఉండడం ఎంత మాత్రమూ రుచించని విషయం. ఆ విషయంలో కొన్ని తరాల క్రితం ఎన్నో ఉద్యమాలు రెండు వైపులా జరిగాయి. కానీ మొరార్జీ దేశాయ్ మాత్రం దాన్ని చివరంటా సమర్థిస్తూనే ఉన్నాడు. ఆ ఆలోచన పట్ల నాకు ఎంత వ్యతిరేక భావం ఉన్నా, మొరార్జీ ని దేశ నాయకుడు అని నేను అంగీకరిస్తాను.

అయినా అలాటి నాయకులని ఆశించే అర్హత మనకి లేదేమో. వాళ్ళు కూడా మనలోంచి ప్రజల్లోంచి రావాల్సిందే కదా? మన మెంత నమ్మ కస్తులమో ఆలో చిద్దాం. ట్రాఫిక్ పోలీసు వాడు లేకపోతే మనకి సిగ్నల్ రంగులు కనపడవు. ప్రతీ పౌరుడూ బాధ్యతగా ఉండాలంటే, ప్రతి పౌరుడి వెనకా ఓ పోలీసు వాడుండాలి. 60 లక్షల ప్రజలున్న నగరంలో 30 లక్షల మంది సాధారణ పౌరులు, 30 లక్షల మంది పోలీసులు. (పోలీసులంతా నమ్మకస్తులని కాసేపు అనుకుందాం). రోడ్ల మీద అంతా చెత్త పేరుకు పోతోంది అని గొడవ చేస్తే, ఓ కార్పొరేషన్ అధికారి టి.వి లో అన్నాడు. కొన్నిలక్షల మంది చేస్తున్న చెత్తని కొన్ని వేల మంది మున్సిపల్ పని వాళ్ళు ఎప్పటికీ శుభ్రం చేయలేరు అని. పౌరులు రోడ్ల మీద చెత్త చేయకుండా ఉండటం ఒకటే మార్గం. ఆ బాధ్యత లేని పౌరులు, శుభ్రమయిన వాతావరణానికి అర్హత లేని వాళ్ళవుతారు.

అదే రకంగా మనకి ఏ రకంగా చూసినా పక్కవాణ్ణే కాదు, ఎవడిని వాడే నమ్ముకోలేని పరిస్థితి. దిగువ మధ్యతరగతి నించి వచ్చిన నాలాటి వాడికి ఉదాహరణలుగా చెప్పడానికి అజరుద్దీన్ లాటి వాళ్ళని చూపించే వారు. ఓ సాధారణ మధ్యతరగతి లో పుట్టి, దాదాపు ప్రపంచంలోనే ఓ ఉన్నత స్థాయి క్రికెటర్ గా మారగల అకుంఠిత దీక్ష, శ్రమ, పట్టుదల చూపించగలిగిన అజరుద్దీన్ కథ ఎవరికయినా ఆదర్శం కాదగ్గ్గది. విద్యార్థి దశలో కథలు కథలు గా అజరుద్దీన్ గురించి వినడం నాకు గుర్తు. అలాటి కథానాయకుడు ఒక్కసారిగా మొత్త్తం దేశాన్నే మోసం చేశాడు అని ఋజువయితే, నా బోటి విద్యార్థులకు ఎటువంటి అపనమ్మకం సమాజం పట్ల ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గ్లోబలైజేషన్ అన్నారు. కొత్తరకం హీరోలు వచ్చారు. ఇక్కడంతా ఏ మాలిన్యం అంటని మల్లెపువ్వులు అన్నారు. అలాగే అనుకున్నాం. మధ్యతరగతికి అదో కొత్త అందుబాటులోకి వచ్చిన ద్రాక్ష తోట. వాళ్ళ బొమ్మల్ని అన్నింటా ప్రచురించి కొలిచాం. మన రాజకీయ వ్యవస్థ కి దాదాపు సమాంతరంగా వీళ్ళే మరో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్నారు, వీరే కొత్త హీరోలనుకున్నాం. అంతట్లోనే రామలింగరాజు గారు ఆ నమ్మకాన్ని కూడా కూల్చేశారు.

అసలు ఈ తరం అంతా ఇంతే. విలువల గురించి తెగ ఊదరగొట్టే పాత తరమే కాస్త నయమేమో ననుకున్నాం. స్వాతంత్ర సమర యోధుణ్ణనీ ఆ విలువలన్నీ వొంట పట్టించుకున్నాననే చెప్పే అందరికంటే సీనియర్ అయిన గవర్నర్ గారి రాసలీలలు ఆ నమ్మకాన్ని కూడా వమ్ముచేసేశాయి.

పోనీ వీళ్ళేదో వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, దాన్ని జెనరలైజ్ చేసి అందర్నీ నమ్మక ద్రోహులూ అనే జాతి నింద చేస్తున్నానను కోవచ్చు. అలా స్టీరియో టైపులు తయారు చెయ్యద్దని నేనే మరో వ్యాసం రాసి ఉన్నాను. నేను చెప్పదలుచు కున్నది, హైదరాబాదు కు దాపు రించిన ఓ ప్రత్యేక మయిన పరిస్థితి. ఎవరైతే (గవర్నర్ తప్పించి) ఈ నగరానికి వన్నె తెచ్చారని భావించామో వాళ్ళే ఈ నగరానికి నమ్మదగనిది అని చూపించారు. ఓ టెండూల్కర్ ముంబయికి, డ్రావిడ్ బెంగళూరు కి, శ్రీకాంత్ చెన్నయ్ కి దొరికి, మనకి మాత్రం అజహరుద్దీన్ దొరికాడు. ఆట విషయంలో వాళ్ళందరి సరసనా నిలవగలిగిన అజహరుద్దీన్, మనకి చేసింది సామాన్యమయిన అన్యాయం కాదు. అలాగే, ప్రేమ్ జీ, నారాయణ మూర్తి, దొరై లకి బదులు మనకి రామలింగరాజు దొరికాడు.

ప్రొఫెషనల్స్ నించి మనం ఆశించేది నీతి. నాయకులనించి ఆశించేది నీతి తో పాటు, న్యాయం. గోపీచంద్, సానియా మిర్జా, వి.వి.యస్. లక్ష్మణ్ లాంటి మంచి ముత్యాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక్క విషపు చుక్క చాలు అని మనకు తెలుసుగా. వీళ్ల మీద ఏ అపవాదూ లేకపోయినా, వీళ్ళని కూడా మనం ఎంతో కొంత అనుమానంగానే చూట్టం నేర్చుకున్నాం. ప్రపంచంలో మరెక్కడా లైఫ్ స్టల్ లాంటి షాపుల్లోకి వెళ్ళేటప్పుడు సంచులు బయట పెట్టి టొకెన్ తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఒక్క మన హైదరాబాద్ లోనూ, బారత దేశంలోనూ మాత్రమే ఈ పరిస్ఠితి. రైల్వేస్టేషన్ లో స్టీలు గ్లాసులకి చైన్లు కట్టాల్స్లిన అవసరానికి దీనికీ పెద్ద తేడాలేదు.

పెద్ద పెద్ద హోదాల్లో ఉండి, ఆఫీసు పనులమీద హోటళ్ళలో ఉండి తుళ్ళూ, సబ్బులూ ఎత్తుకొచ్చే వాళ్ళు మనకి చాలా మందే తెలుసు. ఒక వింత స్థితికి చేరాం మనం. ఎవణ్ణి ఎవడూ నమ్మలేని వికృత శూన్యంలో ఉన్నాం. నీతి కోసం, న్యాయం కోసం చూపించ దగ్గ ఉదాహరణలు లేని పరిస్థితిలో ఉన్నాం. లేరని కాదు. నమ్మకం పోగొట్టుకున్నాం. ఫలానా వాడు కాచ్ డ్రాప్ చేస్తే "ఎంత పుచ్చుకున్నాడో" ననే అనుమానం. ఓ రాజకీయ వేత్త "ఇక నించీ నేను తెలంగాణానే సమర్థిస్థాను" అంటే వీణ్ణి మరెవడో కొనేశాడు అంటాం.

ఈ పరిస్థితికి ఎవర్ని బాధ్యుల్ని చెయ్యటం? మన లెంపకాయల మీద చాచి కొట్టి బుద్ది చెప్పే ఓ నాయకుడు కావాలి. ఓట్లు వచ్చినా పోయినా తన మార్గాన్ని నిర్థుష్టంగా చెప్పగలిగిన ఓ నాయకుడు కావాలి. ఒంటరిగా, ఎవ్వరూ లేనప్పుడు కూడా రెడ్ లైట్ దాటని పురః ప్రజలు కావాలి. అప్పుడు తెలంగాణా సమస్యలాంటి సమస్యలకి ప్రజాస్వామికంగా ఎలా పరిష్కారం కనుగొన వచ్చో మనకి తెలిసి వస్థుంది. అంతటి హృదయ సంస్కారం ముందు మనలో, మామూలు మనలో వస్తే, మనలోంచే అలాంటి నాయకులు వస్తారు. అప్పటి దాకా… ఈ బస్సులు ఇలా తగల బడుతూనే ఉంటాయి.


13 Responses  
 • chavakiran writes:
  January 9th, 20102:34 amat

  జ్యోతికి పంపక పొయ్యారా. వాడేసే దిక్కుమాలిన ఎడిటోరియల్లు చదివి మెదడు పుచ్చిపోతుంది. ఇలాంటివి వేసుకునే దమ్ము కూడా వాడికే ఉందనుకోండి.

  నావో నాలుగు కవితలకు ఇక్కడ ప్రచారం ఇచ్చుకుంటున్నాను.

  ఎదురు నిలిచేవాడు వస్తాడు. —– http://te.chavakiran.com/blog/?p=720

  పిరికి వారిమైన మనం —- http://te.chavakiran.com/blog/?p=758

  పీక మీద కత్తి పెట్టి —– http://te.chavakiran.com/blog/?p=752

  For them it is just another crisis —– http://te.chavakiran.com/blog/?p=746

 • bhamidipati phanibabu writes:
  January 9th, 20102:37 amat

  Excellent post.

 • Surya writes:
  January 9th, 20103:16 amat

  చాలా బాగా చెప్పారు. ఈ మధ్య తరచూ మన నాయకుల నుంచి వస్తున్న మాటలు “ప్రజాస్వామ్యంలొ ప్రజలే న్యాయ నిర్నేతలు, ప్రజలు ఏమి చెప్తే నాయకులు అది చెయ్యాలి”. దీన్ని బట్టి మన నాయకులు ఎంత గొప్పవాల్లో అర్థంచేసుకోవచ్చు. There is dearth of leadership at every level in the country.

 • nagaraju writes:
  January 9th, 20103:19 amat

  బావుంది గురూ. కేవలం నాయకులు లేకపోవడం ఒక్కటే కాదనుకొంటాను, దాంతో పాటు:
  institutions that have become incompetent (after emergency, this country was turned into a popular democracy, not a constitutional democracy).
  corrupt politicians
  insolent executive
  toothless judiciary
  narrow minded intellectuals
  careless citizens.

  the solution for bad governance must be good governance, not more bad governance!

 • ఏకాంతపు దిలీప్ writes:
  January 9th, 20103:35 amat

  మంచి వ్యాసం!

 • సూర్యుడు writes:
  January 9th, 20103:52 amat

  Super

 • సుజాత writes:
  January 9th, 20103:54 amat

  బాగుంది. కానీ మనది అత్యాశ కదూ! అంతా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛ శీలురే కావాలి. అజహరుద్దీన్ అన్యాయం గురించి మాట్లాడే ముందు అతగాడు సాధించిన రికార్డులు, టీవీల ముందు కూచున్న జనానికి ఉత్కంఠతో పట్టించిన చెమట్లూ గుర్తు రావు. రామలింగ రాజులే దొరుకుతారు అని బాధ పడే ముందు ఆ రాజు ఎంతమంది కుటుంబాలకు అన్నం పెట్టాడో,ఎన్ని గ్రామాలకు దాహార్తి తీర్చాడో గుర్తు రాదు(ఆయన కొడుకు చేసిన అన్యాయంలో నేనూ బాధితురాలినే. ఇల్లు ఎపుడు చేతికొస్తుందో ఇంకా తెలీదు).

  ప్రపంచం అంతా స్వచ్ఛంగా ఉండాలని అత్యాశ! నాక్కూడా!

  రాజకీయ నాయకుల గురించో మీడియా గురించో మాత్రం నాకేమీ భ్రమల్లేవు. పూర్తిగా కుళ్ళిన దాన్ని ఎవడూ రిపేర్ చేయలేడు!

 • తాడేపల్లి writes:
  January 9th, 20103:56 amat

  చాలా బాగా రాశారు. తరతరాలుగా ఉన్న మన దేశీయవ్యవస్థల్ని బ్రిటీషువారు కూలద్రోసి తమ సామ్రాజ్యవ్యవస్థ నెలకొల్పారు. వాళ్ళు వెళ్లిపోయాక అధికారశూన్యతే కాక, ప్రామాణిక వ్యక్తుల శూన్యత కూడా ఏర్పడింది. ఈ శూన్యాన్నే మనం ప్రజాస్వామ్యం అని భ్రమిస్తున్నాం.

  మీరనుకుంటున్న పరిపాలకుడు మఱో పదిహేనేళ్లకి వచ్చే అవకాశం ఉంది, అదీ రాష్ట్రస్థాయిలో మాత్రమే !

 • మంచుపల్లకీ writes:
  January 9th, 20105:35 amat

  Excellent !!

 • cbrao writes:
  January 9th, 20105:53 amat

  “మీరనుకుంటున్న పరిపాలకుడు మఱో పదిహేనేళ్లకి వచ్చే అవకాశం ఉంది, అదీ రాష్ట్రస్థాయిలో మాత్రమే !” -జ్యోతిష్యమా?
  వ్యాసంలో ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి.

 • Sarath 'Kaalam' writes:
  January 9th, 20105:56 amat

  Nice.

 • Prasad writes:
  January 9th, 20109:01 amat

  మీరు చెప్పిన నాయకుడి లక్షణాలు కొంతవరకూ లోక్ సత్తా జేపీ (జయ ప్రకాష్ నారాయణ్) లో ఉన్నాయనిపిస్తుంది. కానీ రాజకీయాలలో ఇవాళ ఆయన పరిస్థితి ఏమిటో మనకందరికీ తెలుసు.

 • Chandra writes:
  March 28th, 20104:31 pmat

  Akki,

  So far I read just 2 posts on your blog and I like your style, especially they way conclude the post.
  Keep it up.

  Prasad,

  Akki clearly wrote in the end of the article: అంతటి హృదయ సంస్కారం ముందు మనలో, మామూలు మనలో వస్తే, మనలోంచే అలాంటి నాయకులు వస్తారు.

  Do not take me wrong, I have full respect for JP as one of the most sincere & result oriented politicians that our generation has.


»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa