సెప్టెంబర్ నెలలో నేను రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధి దగ్గర ఉన్నాను. అక్టోబర్ లో మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్ చూశాను అట్లాంటాలో. ఈ రెంటి మధ్యలో మా అమ్మానాన్నలు చనిపోయి ఓ సంవత్సరం గడిచిన రోజు. భధ్రాచలం డివిజన్లో గిరిజన విద్యార్థుల కోసం ఎంతో శ్రమించిన మానాన్న జ్నాపకాలు మమ్మల్ని ముంచెత్తుతున్న సమయం. అదే సందర్భంలో బలగోపాల్ చనిపోయారని వార్త.
బాలగోపాల్ గురించి అనేక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ చదివాక, ఓ మామూలు పౌరుడిగా నేనెందుకు బాధ పడాలి బాలగోపాల్ గురించి అని చెప్పాలనిపించింది. ఆయన్ని ఎప్పుడన్నా కలిశానేమో గుర్తుకూడా లేదు నాకు. బహుశా ఏ సాహిత్య సభలోనో మరో చోటో ఒకే చోట ఉండి ఉండొచ్చు. కానీ ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం సున్నా. అయినా ఆయన మరణం నన్నెందుకు అంతగా బాధించాలి?
కథ 1 :
మా ఆవిడ క్రెడిట్ కార్దు పోయింది. పోవటమే కాదు, దాన్ని ఎవడో వాడడం కూడా మొదలు పెట్టాడు. దాదాపు 15 వేలు ఖర్చు పెట్టేశాడు. విషయం తెలిసిన వెంటనే బాంకుకు ఫోన్ చేసింది. బాంకు వాడు పోలీసు కంప్లయింట్ ఇచ్చి ఆ రిపోర్టు చూపిస్టే ఆ 15 వేలు ఇచ్చేస్తానన్నాడు. (అమెరికా లో ఇలాగే జరిగితే పోలీసుల తో పని లేకుండానే బాంకులు తిరిగి ఇచ్చేస్తాయి). సరే ఉండేది కొండాపూర్ కదా, మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కంప్లయింట్ ఇవ్వడానికి. వాళ్ళకి రెండు సమస్యలు కనపడ్డాయి. ఒకటి, ఆ దొంగ చివరి సారి ఎక్కడ ఖర్చు పెట్టాడో అక్కడికి వెళ్ళి కంప్లయింట్ ఇవ్వాలి. రెండోది, మీ ఆయన లేకుండా ఒక్కళ్ళే ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్ కి అని! తను మళ్ళీ రెండో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళింది. అక్కడా అదే పరిస్థితి. మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని. మీ అయన ఏడీ అని.
మా ఆవిడకి వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. అన్నిటి కన్నా ప్రధానమయింది, నువ్వులేకుండా నేను పోలీసు స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ చేసే హక్కు నాకు లేదా? ఇంత అవమానమా అని! ఆ కోపంతో మేం వెళ్ళలా. ఆ 15 వేలూ అలా మాకు తిరిగి దక్కలా. ఆ అవమానానికి మా ఆవిడ దాదాపు కళ్ళనీళ్ళు పెట్ట్టుకుంది. ఒక్కదాన్నీ ఆఫీసు పని మీద దేశాలు తిరగ్గలిగిన దాన్ని, ఉన్న ఊళ్ళో పోలీస్ స్టేషన్ కెళ్ళాలంటే నాకు ఆ పాటి వ్యక్తిత్వం లేదా అని! (ఇప్పుడు ఓ మహిళ హోం మంత్రి కూడా).
కథ 2 :
మా చుట్టాల్లో ఒకాయనకి మరెవరూ లేరు. గుండెలో నొప్పి అంటే యాంజియో గ్రామ్ చెయ్యాలన్నారు. సరే నేను చేయిస్తానన్నాను. అపోలోలొ ఒకే రోజులో అయిపోతుంది వెళ్ళి 16 వేలు కట్టండి అన్నారు. సాయంత్రం 4 గంటలకి వెళ్ళి కడితే 7 గంటల కల్లా వెళ్ళి పోవచ్చునన్నారు. సరే అయిపోతుంది కదా అనుకున్నాం. మా ఆవిడా నేను, ఒకళ్లు ఇంట్లో మా అమ్మాయి దగ్గర. మరొకళ్ళు హాస్పటల్లో ఉండి చేయించచ్చు అనుకున్నాము. టైం గడుస్తుంది కానీ పని జరగదు. కొత్త కొత్త టెస్టులు రాస్తారు, యాంజియో గ్రాం మాత్రం జరగదు. డాక్టర్ లేదు అని ఒకసారి. ఏదో బ్లడ్ టెస్తు రిజల్టు సరిగ్గాలేదు అని ఒకసారి ఇలా సాగి పోతూనే ఉంది. మా అమ్మాయిని కార్లో డ్రవర్ దగ్గర ఉంచి ఇద్దరం హాస్పటల్లో అటూ ఇటూ పచార్లు. చీకట్లో డ్రవర్ తో పాటు తెల్లారి బడికి వెళ్ళాల్సిన మా అమ్మాయి గంటకి పైగా ఎదురు చూడ్డం. అంతా చేసి రాత్రి పదింటికి ఈ రోజు అవదు. రేపు పొద్దున రండి అన్నారు. నాకు తిక్క రేగి, అక్కర్లేదు మేము రాము అన్నా. ఆ కట్టిన డబ్బులు కావాలంటే మళ్ళీ వేరే ఏదో కౌంటర్ కి మరుసటి రోజు వెళ్ళి తెచ్చుకోవాలిట. నేను వినియోగ దారుల కోర్టులో దావా వేసి డబ్బులు తెచ్చుకుంటా నని డిస్చార్జ్ కూడా చెయ్యకుండా తీసుకొచ్చేశా. లాయర్ తో మాట్లాడాను కూడా. మళ్ళీ పని హడావిడిలో పడి ఆ పని పూరి చెయ్యలేక పోయా. (అపోలో వాళ్ళు మరి ఆ డిస్చార్జ్ కాని పేషెంట్ ఫైల్ ఎలా మూసేశారో వాళ్ళకే తెలియాలి). ఇక్కడ కట్టిన 17 వేలు కూడా మేం పోగొట్టుకున్నాం.
కథ 3 :
కొండాపూర్ నించి సోమాజీగూడాలో నా ఆఫీస్ కి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసూ, ఆ తర్వాత ముఖ్యమంత్రిగారి కాంప్ ఆఫీసూ దాటి వెళ్ళాలి. ఈ మధ్యలో ఓ రాజీవ్ గాంధీ విగ్రహం కూడా. తెలుగు దేశం ఆఫీసుముందు నాలుగు లైన్ల కార్లు ఎప్పుడూ రోడ్డు మీదే ఉండాలి. అవి రాంగ్ సైడ్ లో ఎల్ వి ప్రసాద్ హాస్ప్టిటల్ నించి నేరుగా ఎదురు రావచ్చు. ఎలక్షన్ల సీజన్ అయితే సీట్లకోసం వచ్చేవాళ్ళు వాళ్ళ పరపతి చూపించడానికి కొన్ని వందల కార్లు, అవికూడా కువాలీస్, స్కార్ఫియో లాంటి పెద్ద పెద్ద కార్లు, పదుల సంఖ్యలో లగ్జరీ బస్సులు జిల్లాల నించి వస్టాయి. ఆవన్నీ అలా రోడ్డుమేదే అపేసి ఉంటాయి. గన్ మెన్లూ, సెల్ ఫోన్లూ, మడత నలగని ఖద్దరు చొక్కాలూ అదో వాతా వరణం.
ఈ మధ్యలో నా లాంటి ఉద్యోగస్తులు బైకుల మీదా, కార్లలో, బస్సుల్లో అఫీసులకి చేరడానికి పడే పాట్లు హైదరాబాద్ వారికి చెప్పక్కర్లా. మిగతావారి సంగతి నాకు తెలీదు, నాకు మాత్రం నాకు ఇంత కూడా విలువ లేదా ఈ దేశంలో అని విరక్తి కలుగుతుంది. ఆ రాజకీయ నాయకులూ వారి చుట్టూ ఆ పెద్ద పెద్ద వాహనాల్లో జిల్లాలనించి వచ్చి వాళ్ళు ఈ దేశానికి ఉద్ధరించేది ఏమిటో గానీ, నేను వేళకి ఆఫీసు కి వెళ్ళటం కంటే విలువయినది అని హదరాబాద్ లో అందరం అంగీకరించేశాం. అదే సీను మళ్ళీ ముఖ్యమంత్రి గారి కాంప్ ఆఫీసు దగ్గర. ఒక్కోసారి ఆ విగ్రహాల దగ్గర. పొద్దున 9.00 గం.లకి రోడ్లన్నీనిండుగా ఉన్నప్పుడు, ఆ మధ్యలో ఉండే విగ్రహానికి అన్నివందల దండలు ఎందుకు వెయ్యాలో నాకు తెలీదు. ఆ నాయకుల పట్ల నిజంగా అంత గౌరవం ఉందని కూడా నాకేమీ నమ్మకం లేదు. (నిజం చెప్పద్దూ, రాజీవ్ గాంధీ ఉన్నంతలో కొంత నిరాడంబరంగానే జీవించారని చెప్పొచ్చు. అన్నిదండలు ఆయన బతికుండగా వేయించుకున్నాడని నేనను కోను).
కొసమెరుపు: మా అమ్మాయి వాళ్ళ క్లాస్ మేట్ పుట్తినరోజు పండక్కని పిజ్జాహట్ కి వెళ్ళింది. కారు ఆపి, అమ్మాయిని దింపి బయటకి వచ్చేటప్పటికి ఇక్కడెందుకు కారు ఆపావు అని నాకు ఎంతో గుర్తులేదు, ఫైన్ వేసారు మన ట్రాఫిక్ పోలీసులు. V.I.P కాకుండా వెధవపని చేస్తే ఎట్ట్లా?
——-
ఆ పై కథలన్నీ ఓసారి చూస్తే అవన్నీ నాకు పౌరుడిగా "ఇవ్వబడిన" హక్కులు నాకు దొరకని వైనాన్ని చెపుతాయి. లేని హక్కుల కోసం కాదు, ఉన్న, ఇవ్వబడిన హక్కుల కోసం "పోరాడాల్సిన" సందర్భంలో ఉన్నాం! హక్కుల మాట అటుంచి సాధారణ పౌరులుగా మామూలు డిగ్నిటీ, మర్యాద కోరుకోవటం కూడా దురాశే అవుతున్న సందర్భం. కుడి, ఎడమల తేడా లేకుండా ఎలాగోలా దాటి ముందుకు వెళ్ళటమే. పక్కవాడి హక్కుగురించి మనకి మనకే లక్ష్యం లేని "మాస్" మనం.
మేము ఇండియాకి తిరిగి రాంగానే ఓ డ్రవర్ ని పెట్టుకున్నాం. అంతకు ముందు ఓ M.L.A దగ్గర పని చేసే వాట్ట. వాళ్ళతో ఇంకా పరిచయాలు ఉన్నాయి, ఆ M.L.A స్టిక్కర్ పట్టుకొచ్చి అతికిస్తాను, అప్పుడు కారు ఎక్కడన్నా ఆపచ్చు అని మాతో గొడవ. వద్దురా నాయనా మన బతుకేదో మనం బతుకుదామని అతగాణ్ణి ఒప్పించే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ప్రతివాడూ ఏదో ఒకలా ఓ V.I.P అయిపోవాలి అంతే. అప్పుడు హక్కులేం ఖర్మ, లేని హక్కులు కూడా సంప్రాప్తిస్తాయి.
నేనూ మా ఆవిడా పోస్టు గ్రాడ్యుయేట్లం, అమెరికా, ఆస్ట్ర్రేలియా లాంటి దేశాల్లో ఉన్నాం, పని చేశాం, మంచి ఉద్యోగాలే చేస్తున్నాం, బాగానే సంపాయించుకుంటున్నాం, దాదాపు 10 దేశాలు తిరిగాం, అరడజను పైగా భాషలు మాట్లాడగలం, రక రకాల మనుషుల్ని చూశాం, బోలెడంత సాహిత్యాన్ని చదివాం, రచయితలతో, పాత్రికేయులతో, రక రకాల ప్రముఖులతో, ఉద్యమకారులతో, సంఘాలతో, రాజకీయ పక్షాలతో పరిచయాలున్నాయి. మేము సాధారణ, సాధారణ పౌరులకంటే ఒకింత అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళమే. అయినా… మా బతుకుల్లో మాకున్న మాహక్క్లు లకి మాత్రం హామీ లేదు.
ఆ పైన చెప్పిన కథలన్నింటిలో నేను ఓ పాత్రికేయుడితో రాయించో, మా కుల పెద్దతో బెదిరించో, పరిచయమున్న రాజకీయ నాయకుడితోనో, పెద్ద అధికారంలో ఉన్న బంధువుతోనో చెప్పించో నా డబ్బులు నేను తెచ్చుకుని ఉండచ్చు. ఆ అవకాశం నాకు ఉందికూడా. కానీ "అక్కిరాజు గా" "స్వర్ణ గా" మా హక్కులు మాకు దక్కవు. అలా పక్కదారి పట్టక సూటిగా పోవాలి లేదా పోరాడాలి అని ప్రిన్సిపుల్ పెట్టుకుని, అందుకు తగ్గ సమయం లేక పోతే మనమే అలా నష్ట పోతాం, పోతూనే ఉంటాం.
ఇదంతా నా సొంత గొడవ. సమాజంలో అన్నిరకాలుగా ఓ మెట్టు పైనే ఉన్న మాలాంటి వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, 21 వ శతాబ్దంలో కూడా ఏ హక్కులూ కనీసం కాగితం మీద కూడా లేని సమూహాలు ఈ దేశంలో ఎన్నని? దేశాన్ని కొందరి చేతుల్లో పెట్టేసి, మొత్తం మధ్యతరగతి ఓ నిర్లిప్తత ని అలవర్చుకుంది. అంత నిరా సక్తంగా, నిస్తేజంగా, ఏ నిబద్ధతా లేకుండా ఈ సమాజం ఎలా ఎందుకు తయారయిందో ఊహ కందని విషయం.
ఎక్కడో మేధావి వర్గంలో సైద్దాంతిక చర్చలకే పరిమిత మయిన స్వాతంత్రోద్యమాన్ని మాస్ ఉద్యమంగా, మధ్యతరగతిని వీధిలోకి తెచ్చిన ఘనత మహాత్ముడిది. ఇప్పుడు జరగాల్సిన పనికి అలాటి మహాత్ములే కావాల్సి ఉంది. దానికి కావల్సిన సరంజామానంతా తయారు చేసిన నేటి మహాత్ముడు పని పూర్తవకుండా నే వెళ్ళి పోవడం బాధాకరం. ఆశని పాతం.
ఐ.టి. ఉద్యోగుల గురించి, వారి జీవన విధానాల గురించీ ఏమీ తెలియకుండా రాసి పారేసే రచయితలకీ, మీడియాకి నేను "మేధావులూ స్టీరియోటైపులూ" అనే వ్యాసంలో నా నిరసన తెలియ జేశాను. I.T కంపెనీల వల్ల సమాజానికి చేటు అనంటే, అందులో పనిచేసే మామూలు మధ్య తరగతి మనుషులందర్నీ చెడిపోయిన వాళ్ళలా చూసే ఆ వింత జాడ్యాన్ని నేను ప్రశ్నించాను. ఆ వ్యాసంలో ఈ వాక్యాలు చూడండి. "
ఇక సైద్ధాంతికంగా ఆలోచించి ఈ ఐటీ కంపెనీల గురించీ, గ్లోబలైజేషన్ పేరుతో సృష్టించ బడుతున్న అకస్మాత్తు ఆర్థిక అసమానతల గురించి మాట్లాడే విషయం వేరు. ఆ అసమానతలు ఐటీ అవొచ్చూ, బయోటెక్ అవచ్చూ, మన దేశంలోనే ఉన్న టాటా, రిలయన్స్ లాటి కంపెనీలు కావచ్చు. కొన్ని కోట్ల్ల మంది బతికే వ్యవసాయం, చేనేత, చేతి వృత్తులూ సర్వ నాశన మయి పోయి, కొన్ని వేలు, మహా అయితే లక్షల మందికి మాత్రమే ఉపాధి అదికూడా చాలా ఎక్కువ జీతం దక్కేలా చేసే హైటెక్ కంపెనీలకి చేయూత నిచ్చే ఆర్థిక విధానాలని సమర్థించాలా అనే ది పూర్తిగా వేరే విషయం."
మన జనాలు ఎంతగా నిద్ర పోతున్నారంటే, వాళ్ళతరపున అవిశ్రాంతంగా పోరాడిన ఓ ఆశాకిరణం ఒకటి అదృశ్యమయిందనే సంగతి కూడా తెలీనంతగా నిద్రపోతున్నారు.
Probably we don’t deserve Balagopal amongst us!
అక్కిరాజు భట్టిప్రోలు
నవంబర్ 6, 2009
ఆట్లాంటా
అక్కిరాజుగారికి నమస్తే. మీ కథలు చదవడమే గాని, ఇంతవరకు మీ బ్లాగు చూడలేకపోయాను (తెలియక). ఇప్పుడే ఈ వ్యాసం ద్వారా మీ బ్లాగును చూడగలిగాను. బాలగోపాల్ మరణం ‘స్పృహ ‘ వున్న వారందరినీ కలచివేసేదే. అయితే మీ దుఖాన్ని కథా రచయితగా మీరు వ్యక్తం చేసిన పద్ధతి భిన్నమైనది. బాధ కలిగించినా నాకెంతో నచ్చింది.
వ్యాసం అద్బుతంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలన్నీ అలానో దాదాపు అలానో నిత్యం నాముందు కనిపించేవే కదిలించేవే. గొప్ప ఆవేదనకు అక్శరరూపం.
సామాన్యుడికి ఇవ్వబడిన హక్కులు కూడా కొనుక్కోవలసిన దౌర్భాగ్యం రోజురోజుకూ పెరిగిపోతుంది.
బుద్దిజీవు లకు సర్ధుకుపోవటం మినహా మార్గాలు కనపడటం లేదు. పోరాడలేని అశక్తత,చెప్పుకొంటే నామోషీ అని మేకపోతు గాంభీర్యాలు, ట్రివియలైజ్ చేయటాలూ చేసుకొనే ఒక ఆత్మద్రోహం.
ప్రభుత్వాలన్నీ సగటు మనిషిపన్నులపై నడుస్తున్నప్పటికీ సదుపాయాలన్నీ పైతరగతి వాడికీ, క్రింది తరగతి వాడికీ (వానిపట్ల కంపాషన్ నాకుంది. కానీ ఏదైనా విపత్తు జరిగినప్పుడు, “ఎవడొచ్చాడండీ ఇక్కడకు, ఏప్రభుత్వం ఆదుకొంటుంది” అంటూ మైకులముందు ఘొరావ్ చేసేది వారే, మధ్యతరగతి వర్గం ఒంటరిగా, తనొక్కడే శిధిలాల మధ్య గుట్టుగా పునర్నిర్మాణ పనిలో ఉంటాడు)
ఈ విధానాలు పధకాలు మధ్య వర్గపు చేతకాని తనాన్ని చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకొని, బ్రహ్మాండంగా ఆవర్గాన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి.
మీరన్నట్లు
Probably we don’t deserve Balagopal amongst us!
నిజమేనేమో
కొంతకాలం లింగర్ అయ్యే వ్యాసం చదివించారు. నన్ను మరోసారి బాధించారు.
బొల్లోజు బాబా
“దేశాన్ని కొందరి చేతుల్లో పెట్టేసి, మొత్తం మధ్యతరగతి ఓ నిర్లిప్తత ని అలవర్చుకుంది. అంత నిరా సక్తంగా, నిస్తేజంగా, ఏ నిబద్ధతా లేకుండా ఈ సమాజం ఎలా ఎందుకు తయారయిందో ఊహ కందని విషయం”..
కదా?!!!హ్మ్…
ఎక్కడో మేధావి వర్గంలో సైద్దాంతిక చర్చలకే పరిమిత మయిన స్వాతంత్రోద్యమాన్ని మాస్ ఉద్యమంగా, మధ్యతరగతిని వీధిలోకి తెచ్చిన ఘనత మహాత్ముడిది
” Golden words
*మన జనాలు ఎంతగా నిద్ర పోతున్నారంటే, వాళ్ళతరపున అవిశ్రాంతంగా పోరాడిన ఓ ఆశాకిరణం ఒకటి అదృశ్యమయిందనే సంగతి కూడా తెలీనంతగా నిద్రపోతున్నారు. Probably we don’t deserve Balagopal amongst us!*
బాలగోపాల్ చనిపోయిన తరువాత చాలా వ్యాసాలు చాలా మంది రాసారు. కాని ఆయన మీద మీ వ్యాసం చాలా అద్భుతం గా ఉంది. మీరు చాలా బాగా రాశారు.
*దేశాన్ని కొందరి చేతుల్లో పెట్టేసి, మొత్తం మధ్యతరగతి ఓ నిర్లిప్తత ని అలవర్చుకుంది. అంత నిరాసక్తంగా, నిస్తేజంగా, ఏ నిబద్ధతా లేకుండా ఈ సమాజం ఎలా ఎందుకు తయారయిందో ఊహ కందని విషయం. *
మీరు నిద్ర పోతున్నారు అని అనుకుంట్టున్నారు వాస్తవానికి ఎక్కడ ప్రాపర్టి కొంటె ఎంత లాభ మొస్తుంది లాంగ్ రన్ లో అని ఆలోచించె వారు కొందరు. బాగ రుద్ది పిల్లలను చదివించి పెద్ద పొషిషన్ లోచూడాలనుకునే పెద్దలు. ఈ మధ్యకాలంలో ముసలి వారు కూడా మరింత ఉత్సాహంగా మనుమల కొరకు మరింత ప్రాపర్టి కొనాలని బేరసారలు చెస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత భారత దేశం మున్షి ప్రేంచంద్ రాసిన షత్రంజ్ కే కిలాడి కాలాన్ని గుర్తుకు తెస్తోంది.
మీ సమస్య నాకు అర్థమయ్యింది. ఒకడు ఆత్మహత్య చేసుకుంటే అది వ్యక్తిగత సమస్యగా, రైతులు మాస్ గా ఆత్మహత్యలు చేసుకుంటే అది సామాజిక సమస్యగా పరిగణించడం జరుగుతోంది. ముందు సామాజిక సమస్యలు పరిష్కరించకుండా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదు. ప్రభుత్వానికీ, మావోయిస్టులకీ మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకుడు రామకృష్ణ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు చాలా మంది జనం రామకృష్ణని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆ సమస్యలలో ఎక్కువ శాతం వ్యక్తిగత సమస్యలే. ఒక ఫైనాన్స్ కంపెనీ మా దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా వాళ్ళు ఏమీ చెయ్యలేదు. ఆ కంపెనీ నుంచి తమకి డబ్బులు తిరిగిప్పించాలి అని ఒకరు రామకృష్ణని కోరారు. ప్రపంచ బ్యాంక్ విధానాలూ, రైతుల ఆత్మహత్యలూ లాంటి మౌళిక సమస్యలని పక్కన పెట్టి ఈ కేసులు చూడాలా అని రామకృష్ణకి డౌట్ వచ్చింది కానీ మీ సమస్య గురించి ఆలోచిస్తాను అనే సమాధానం చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్నీ, పోలీసుల్నీ నమ్ముకుంటే వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం కావు. సామాజిక ఉద్యమాలు నడిపేవాళ్ళకి వ్యక్తిగత సమస్యల పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా, వద్దా అని డౌట్ ఉంటుంది. వైజాగ్ కి చెందిన నా స్నేహితురాలి తండ్రి ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పని చేస్తున్నాడు. ఆమె తల్లి కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ మహిళా సంఘంలో సభ్యురాలు. ఒక సారి ఆమె తన తండ్రి సహచరుడిని అడిగింది “మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కార్మిక హక్కులూ, మహిళల హక్కులూ గురించి బాగానే మాట్లాడుతారు కానీ పిల్లల హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు? పిల్లలని ఇంటిలో తల్లితండ్రులు, స్కూల్ లో టీచర్లు కొట్టడం హక్కుల ఉల్లంఘన కాదా?” అని. మౌళికమైన సమస్యలు చాలా ఉండగా పిల్లల హక్కులు లాంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం సాధ్యం కాదు అని అతను సమాధానం చెప్పాడు. మానవ హక్కుల సంఘాల వాళ్ళకి తెలుసు, ఐ.టి. ఉద్యోగులకి కూడా సమస్యలు ఉంటాయని. నెలకి మూడు వేలు జీతం తీసుకునే కార్మికుడి ఉద్యోగం పోతే ఎక్కువ బాధ పడాలా? నెలకి 60 వేలు జీతం తీసుకునే వైట్ కాలర్ జాబ్ హోల్డర్ ఉద్యోగం పోతే ఎక్కువ బాధ పడాలా? మాది కూడా హైయర్ మిడిల్ క్లాస్ ఫామిలీయే కానీ సమాజం కోసం నేను ప్రోలెటేరియన్ (కార్మిక వర్గ) ఐడియాలజీ వైపు ఇంక్లైన్ అయ్యాను. మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఐ.టి. ఉద్యోగుల సమస్యల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడరో నేను అర్థం చేసుకోగలను.
నేను చదివాను.
yes sir, all of your feelings right but public are diversified by media. these media needs every time sensation according to same today’s balagopal or any person head lines for incident day only. and more public are interseted in only politics,cinemas and all of waste.
మనకు రావలసిన మొత్తం కొంచెం ఎక్కువయుతే వినియోగదారుల ఫోరాలు ద్వారా పోరాడి తెచ్చుకోడానికి ప్రయత్నించొచ్చు. కానీ చాలా సార్లు చిన్నమెత్తాలు ఇలా ఇరుక్కుపోయినప్పుడు వినియోగదారుల ఫోరాలకు వెళ్లి టైం వేస్టు చేసుకోలేక వదిలెయ్యాల్సి వస్తుంది. మనకు రావలసినది ఎంత చిన్న మొత్తం అయినా ఆయా కంపెనీల మీద భారీగా జరిమానాలు వేసి వాటిలో కొంత వినియోగదారునికి వెళ్లేలా చట్టాలు తెస్తే ఏమయినా ప్రయోజనముంటుందేమో.
nijam gaane, mee vyaasam , amdulO cheppina vishayaalu, cheppina vidhaanam remdoo koodaa baavunnaayi. nijame. balagopal mana madhya vumdataaniki manam tagina vaaLLam kaamemo.
Kalpana Rentala
ఒక వ్యాపారి 100 రూపాయలకి మనని మోసం చేశాడనుకుందాం, అతని మీద కోర్టులో కేసు వేస్తే అతనికి లాయర్ ఖర్చు పది వేలు రూపాయలు అవుతుంది. అయినా వంద రూపాయల కోసం కోర్టుకి వెళ్ళే టైమ్ మనకి ఉండదు. చిన్న మొత్తాలలో మోసపోయిన తరువాత మోసం చేసిన వ్యాపారిని అడిగేవాళ్ళు ఉన్నారు. వ్యాపారులు తమ షాప్ లో పని చేసేవాళ్ళ చేత గూండాగిరి చెయ్యించిన ఘటనలు కూడా ఉన్నాయి.
అద్భుతం మిత్రకేసరీ!
మనకు అన్నామాచార్యుల పాటలను అందించిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు తెలుగు జాతికి ఎంత గొప్ప సేవ చేశారో అంతకన్నా ఎక్కువ గా బాలగోపాల్ గారు పేదల కొరకు, తాను నమ్మిన సిద్దాంతం/విలువల కొరకు పాటు పడ్డారు. వారి సేవలను,దైర్యాన్ని, పనితనాన్ని మరియు మేధస్సును చాలామంది తమకు తోచిన విధం గా ఊహించు కోవలసిందే. నిజం చెప్పాలి అంటె అటువంటి వారిని అంచనా వేయటానికి మన మేధస్సు/అంచనాలు సరి పోదు. నాకు మాత్రం బాలగోపాల్ గారు మన మధ్య నివసించిన శ్రీమద్ రామానుజాచర్యులే. ఆయన ని సాప్రదాయం వాదం లో చెప్పాలి అంటె భారత దేశం లో పుట్టిన ఒక గొప్ప కర్మ యోగి/ఋషి.
నేను వ్రాసిన “సిటీ ఎలైట్” కథ చదవండి. డబ్బున్న వాళ్ళ పిల్లలు నేరాలు ఎందుకు చేస్తారో తెలుస్తుంది. http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_08.html
ఆలోచింపచేసిన వ్యాసం.
akkiraju garu namasthe meeru chrchinchina vishyalu sagatulu manishee edo oka sandarbamlo edurkontuneunnadu. aristotile cheppinatlu madyatharagati prajalu
poratalaku siddamavvadam ledu anduk karanam vaaru deniko okadaniki bandee ayyaru. nedu mana akkulagurinchi poratadaniki entha mandi vastaru balagopal lanti vaycthulu neti samajanaki entho avasaram.
అక్కిరాజూ గారూ
అదరగొట్టారు.. ఆ క్షణానికి రక్తం మరగడం తప్పితే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నమాట అంగీకరించక తప్పని వాస్తవమేమో అనిపిస్తోంది
కృతజ్ఞతలు.