SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
నాగార్జున సాగరంలో కథా సమారాధన
Apr 6th, 2009 by akkirajub

  img_1274

  (Click Here For More Pictures)

  ఫిబ్రవరి 7, 8 తేదీలలో కొంత మంది తెలుగు కథా రచయితలు కథల గురించి మాత్రమే మాట్లాడాలని ఒట్టు పెట్టుకుని కలిశారు. “కథల్ని బేరీజు వేసుకోవటం తప్పా వేరే ఉద్దేశం లేదు” అంటూ ఖదీర్ బాబు చాలా చిన్న విషయంగా శనివారం ఉదయం సంభాషణని ప్రారంభించిన కార్యక్రమం “ఇరవయ్యొకటవ శతాబ్దం కొత్త డిజైన్ లని సృష్టించాల్సిన శతాబ్దం” అంటూ చినవీరభద్రుడు ఆదివారం మధ్యాహ్నం ముగించే దాకా సాగింది.

  మొత్తం ౩౦ మంది రచయితలు హైదరాబాద్, కర్నూలు, తిరపతి తదితర ప్రాంతాలనించి శుక్రవారం రాత్రికే విచ్చేశారు. యూత్ హాస్టల్ లో వసతి. హైదరాబాదు నుండి చాలామంది కలిసి వచ్చిన వాను ఆర్థరాత్రికి చేరింది.

  కార్యక్రమం ఎన్నో అంకాలుగా జరిగినా, అన్నింటినీ కాస్త అదుపులో ఉంచడానికి తుమ్మేటి రఘోత్తమ రెడ్డిగారు నడుంబిగించారు. ఆయన మొఖమ్మీద చిరునవ్వు చెరక్కుండానే చర్చల్ని ఒకరి వెంట ఒకరు మాట్లాడేలా చూడగలిగారు.

  శనివారం ఉదయం మొట్ట మొదటి అంకం విహారి గారి తో ప్రారంభమయింది. తాను రచయిత, పాఠకుడు, విమర్శకుడు అనే మూడు పాత్రలూ ధరిస్తాననీ , మూడు కోణాల్లోనూ తెలుగు కథని వివరిస్తానని దాదాపు ఓ గంట ఉపన్యసించారు. ఈ మధ్య కాలంలో వస్తున్న కథల గురించి ఆయన మాట్లాడారు.

  ఆతర్వాత పాఠకులు ఎందుకు కథల్ని చదవట్లేదనీ, ఎందుకు రచయితలు పత్రికల్ని బతిమిలాడి స్థలం కేటాయింపుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోందని చర్చ జరిగింది. కొంత మార్కెట్ ఎలా పెంచుకోవాలనీ పుస్తకం ధరలు తగ్గించడం లాటివీ, పాథకుల కు విశ్వాసం కలిగించే కథలు రాసి కథల కోసం పత్రికల్ని కొనే స్థితికి రాగలిగితే పత్రికలే స్థలం కేటాయించాల్సి వస్తుందనీ చర్చలో దొర్లాయి.

  మరో అంకం సురేష్, కాత్యాయనీ, అనంత్ ల ఉపన్యాసాలతో జరిగింది. మరుసటి రోజు ఉదయం నరేందర్ గారు కథాసంపుటి తేవటం లోని సాధక బాధకాలను చర్చించారు. ఆ తర్వాత చినవీరభద్రుడు గారు సుదీర్ఘమయిన ఉపన్యాసం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ మొత్తం చర్చలో గుర్తుంచుకో వల్సిన కొన్ని అభిప్రాయాలు..

  విహారి :

  • కథలు బాగుంటున్నాయి కానీ వెంట బడట్లేదు. కాలక్షేపం కథలు ఉంటాయా అంటే, చదివి వదిలేసే కథల్ని అలా అనుకోవచ్చేమో. ఈరోజుల్లో పట్టుకుని కుదిపేసే కథలు తక్కువే. సమాజంలో ఉండే రొచ్చుని చూపిస్తే సరిపోదు. రచయిత నాకందిస్తోంది ఏమిటి అని పాఠకుడు చూస్తూనే ఉంటాడు. జీవితాన్ని విశ్లేషించాలి, వ్యాఖ్యానించాలి. అదికూడా వాచ్యంగా, నినాదంలా కాకుండా చెయ్యగలగాలి.

  • కథకుడిగా చూస్తే చాలా పరిమితులు ఉన్నాయనిపిస్తుంది. పత్రికా ప్రపంచంలో చాలా అవాంఛనీయ మైన పరిస్ఠిత్లుతులు ఉన్నాయి. పత్రికకో రకమైన కథలు వస్తున్నాయి. కథ పంపాక దాని వివరాలు రచయితకి తెలియవు.

  • విమర్శకుడిగా చూస్తే, ప్రస్తుతం విమర్శ పేరుతో వస్తున్నదేదీ విమర్శ కాదు. నా భావజాలానికి నచ్చినదైతే మెచ్చుకుంటాను, లేక పోతే చెండాడతాను అనే పద్దతి.

  • రచయితలు కథకులకి దగ్గరగా, పాఠకులకి దూరంగా జరుగుతున్నారేమో చూసుకోవాలి. వస్తువుల్ని లిమిట్ చేసేసుకుంటున్నాం. మధ్యతరగతి కథల పట్ల చిన్నచూపు ఎక్కువయింది. కొడవటిగంటి ఎక్కువ మధ్యతరగతి కథలే రాశారని గుర్తు పెట్టుకోవాలి.

  • రచయితలకి ఆత్మ ముగ్ధత్వం ఎక్కువయింది.

  • మొత్తంమీద చూస్తే దాదావు అన్ని కథల్ని ఏడు మూస కథల్లోంచి తయారు చేసినట్టుగా చెప్పొచ్చు. కరువు, ప్రపంచీకరణ, మిగిలిన వాదాలూ కలిపి ఏడు మూసలు.

  • చెడ్డ కథని మంచి కథగా చూపకూడదు.

  సురేష్ :

  • సంక్షోభంలోంచే సాహిత్యం వస్తుందా అని చూశాను. సౌత్ అమెరికానించీ, నార్త్ అమెరికానించీ కూడా మంచి సాహిత్యం రావడం గమనించాను. తెలుగులో వాస్తవికత ఎక్కువ. లాటిన్ అమెరికాలో జానపద కథల లాంటి శైలి కనపడుతుంది. మాజిక్ రియలిజం అలాటిదే. నార్త్ అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఓ “Anti story” మూవ్ మెంట్ అంటూ కూడా రాశారు. మన రచయితల్లో అలాటి ప్రయోగాలు తక్కువ.

  కాత్యాయని :

  • ప్రచురణలు ఎక్కువే కానీ గుర్తు పెట్టుకునేవి ఎన్ని? ఒకే రకంగా రాయటం , వాదాలూ, నినాదాలూ లాటి సులభ మార్గాలు ఎన్నుకుని రాయటం ఎక్కువయింది.

  • రాసే వస్తువు పట్ల నమ్మకం ఉండాలి. చినవీరభద్రుడు రాసిన “రాముడు కట్టిన వంతెన” లో జరిగిందిదే. రాముడి ఇమేజి ఈ మధ్య కాలంలో మారి పోయి ఉంది. దానికి భిన్నంగా కథ రాస్తూ తనని తానే కన్విన్స్ చేసుకోడానికి రాస్తున్నట్టుగా అనిపించిన కథ అది.

  • వాపోత కథలు, సెల్ఫ్ పిటీ కథలూ ఎక్కువవు తున్నాయి

  అనంత్ :

  • ఇప్పటి కథల్లో పాత్రలు కొత్తగా ప్రవర్తించడం లేదు. అవి కొత్తగా, తెలివిగా వాదిస్తున్నాయి అంతే. మన రచయితలకి “హేతువు” గుదిబండ అయింది.

  • కథకులు సంక్లిష్ట మయిన విషయాలను స్పృశించడం లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేని కథల్ని రాస్తున్నారు.

  రామ్మోహన్ :

  • అర్బన్ లైఫ్ కి సంబంధించిన కథలే సరిగా రావడం లేదు.

  ఖదీర్ :

  • కథా సంపుటాలు వారి వారి ఇష్టాల ప్రకారమే వచ్చే పుస్తకాలైతే “మాకిష్ట మయిన కథలు” అని వేసుకుంటే సరిపోతుంది. వీటిని “ఈ సంవత్సరపు అత్యుత్తమ కథలు” అని వేస్తుంటే ఇవే ప్రమాణంగా మారి ఇలా రాస్తే సరి పోతుందనుకుంటున్నారు రచయితలు.

  నరేందర్ :

  • అర్బనా రూరలా అనే కన్నా కథ జీవితంలోంచి వచ్చిందా లేదా అనేది ముఖ్యం.

  • మంచి కథల కోసం అన్ని పత్రికలూ చూడాల్సిన అవసరం లేదు. మెజారిటీ మంచి కథలు ఆదివారం ప్రత్యేక సంచికల్లోనే వస్తున్నాయి.

  • అనేక మంది మితృలకి ఫలానా పుస్తకంలో మంచి కథల్ని ఎంపిక చేసి చెప్పమంటాం. అంలా షార్ట్ లిస్ట్ చేసిన కథల్లోంచి చివరి ఎంపికని సంపాదకులం ఎంచుకుంటాం.

  • ఎంపిక అనే దాంట్లో సబ్జెక్టివిటీ ఉంటుంది.

  • ఖదీర్ బాబు రాసిన వ్యాసంలో పైపైన రాసిన కొన్ని వ్యాఖ్యలు హర్షించేట్టు లేకపోయినా కథల పట్ల ఆయన అవేదనని గుర్తించాం. ఆయన మేం ఎంపిక చేయలేదు అన్నకొన్ని కథల పట్ల ఇప్పటికీ నాకేమీ సదాభిప్రాయం లేదు.

  • ఇలా ఎంపిక చేసిన కథలు బాగాలేవు అనే వాళ్ళు ఇందులో రాని మంచి కథల గురించి మంచి వ్యాసాలు రాస్తే ప్రయోజన కరంగా ఉంటుంది.

  • అసలు కథలు వేయడం తగ్గించి అందుకు సంబధించిన వ్యాసాలూ, చర్చలూ వేద్దామా అని కూడా ఆలోచించాం

  రాజయ్య :

  • సమాజానికీ , సాహిత్యానికీ సంబంధం ఏమిటి? సమాజం నిరంతరం మారుతూ ఉన్నది. కథ కూడా మారాలి, మారుతున్న సమాజాన్ని పట్టుకోగల్గాలి.

  చినవీరభద్రుడు :

  • కథావార్షిక చర్చలో పాల్గొన్నప్పుడు చర్చలో ప్రస్తావించిన కథలకీ చివరికి పుస్తకంలో వచ్చిన కథలకీ సంబంధం లేదు. కథల ఎంపికకీ ప్రచురించిన చర్చకీ సంబంధం లేక పోవడం నిరాశ కలిగించింది. నరేంద్ర రాసిన చాలా మంచి కథ “నిషా” పుస్తకంలో రాక పోవడం విషాదం. సంపాదకుడయినంత మాత్రాన తన కథని నిరాకరించాల్సిన అవసరం లేదు. పైగా చర్చలో మెప్పు పొందిన కధ కూడా.

  • అందరూ అన్నట్టుగానే కథలకంటే కథలమీద వ్యాసాలు పుస్తకంగా వస్త్తేనే బాగుండే టట్టుంది.

  • కథా చర్చల్లో గాసిప్ ఎక్కువయింది. శాస్త్రీయ ఆలో చన లేక పోవటం మూలంగానే కథ చుట్టూ రాజకీయం ఎక్కువగా జరుగుతోంది.

  • కథా ప్రక్రియ మీద చర్చ చాలా తక్కువ గా జరుగుతోంది.

  • రచయితలు కథా ప్రక్రియకంటే సమాజ విశ్లేషణే ప్రధానంగా సాగిస్తున్నారు. సామాజిక విశ్లేషణ విశ్వవిద్యాలయాలు ఆ విషయం చదువుకున్న వాళ్ళూ చేయాల్సిన పని. రచయితలు ఆ పనికి పూనుకోవడం హాస్యాస్పదం. ఓ రకంగా విశ్వవిద్యాలయాలు ఫెయిల్ అవటం మూలంగా రచయితలే ఆ పనికి పూనుకూవాల్సి వచ్చినట్టుంది.

  • కథాప్రక్రియ గురించి మాట్లాడితే రూప వాదులని అనటం చూస్తాం. వస్తువుని సరిగ్గా చెప్పాలంటే సరయిన రూపం అవసరం. ఓ గిన్నె తయారు చేస్తే అది వాడకానికి పనికివచ్చేట్టుగా ఉండాలి. అదే రూపం, డిజైన్.

  • 20 వ శతాబ్దం పాత డిజన్ లు బద్దలు కొట్టడంతో సరిపోయింది. ఇప్పుడంతా కొత్త డిజైన్లు తయారు చేయాల్సిన శతాబ్దం.

  • “విందునాట్యం తర్వాత” అన్న టాల్ స్టాయ్ కథ వంద ఏళ్ళ తర్వాత కూడా మనం గుర్తుంచు కున్నామంటే దాంట్లో సమ పాళ్ళల్లో ఉన్న రూప సామర్ధ్యమని గుర్తించాలి.

  • గురజాడ, చలం, విరసం మూడూ తెలుగు సాహిత్యన్ని వేరే సాహిత్యంతో పోల్చలేకుండా చేశాయి. ఇప్పుడు కొత్తగా ఇతర సాహిత్యాల వాళ్ళు “ఆడదానికి సరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి” లాంటి మాటలు అంటుంటే మనమెప్పుడో చిన్నప్పుడే చలం దగ్గర ఆ మాటలు వినేశామని గుర్తొస్తుంది. అలా వస్తు పరంగా మన కథ చాలా దూరం వచ్చేసింది.

  • కొన్ని మంచి కథల్ని విజువల్ మీడియంలోకి తీసుకురాగలమేమో చూడాలి. ఉదాహరణకి రాజయ్య గారి “మనిషి లో విధ్వంసం” అన్న కధని తెర మీదకి తేగలమేమో చూడాలి.

ఇలా అనేక విషయాలు చర్చించి, ఇలాటి మరిన్ని సమావేశాలు జరుపుకోవాలని నిర్ణయించుకుని అందరూ ఎవరి దారి వారు పట్టారు.

  (పైన రాసిన వన్నీ నా నోటు బుక్ లో హడావిడిగా రాసుకున్నవీ, నాకు అర్థ మయినవీ. రేపొద్దున ఎవరన్నా నేనా ఆఉద్దేశంలో అనలేదూ, అక్కిరాజు తప్పుగా అర్థం చేసుకున్నాడూ, అనంటే, వారి మాటే నమ్మండి. నన్ను క్షమించేయండి – అక్కిరాజు)

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa