కృత్రిమ భావ ప్రాప్తి “లీడర్”

నిన్న లీడర్ సినిమా చూశా.  చాలా డిస్టర్బ్ చేసే సినిమా అని చెప్పచ్చు.  అలా అని ఇందులో నన్ను కొత్తగా ఆలోచింప జేసి, నన్నేదో సంస్కరించే ప్రయత్నం చేసి అలా డిస్టర్బ్ చేసింది అనుకోకండి. ఈ సినిమాని ఇప్పుడున్న సామాజిక సందర్భంలోంచి చూస్తే, చాలా బాధ కలుగుతోంది.

మన సామాన్యుడి సామాజిక నిస్పృహ రెండు గంటలపాటు తెర మీద కాదు, అంతకన్నా ఎక్కువ దాని ముందు కూర్చున్న ప్రేక్షకులలో ఆవిష్కృత మవుతుంటే  నాకు పట్టరాని దుఃఖం వచ్చింది.   ఎవరన్నా సినిమాల మీద తెగ రెసెర్చిలు చేశేవారుంటే వారికి  నాదో సలహా, విన్నపం.  సామాజిక స్పృహ ఉన్న సినిమాలు గత 50 ఏళ్ళలో ఎలా మారాయో గమనించండి.

మరీ దూరం స్వాతంత్ర్యోద్యమ కాలం, స్వతంత్ర భారతంలోని మొదటి రెండు దశాబ్దాల కాలం నాటి సినిమాల గురించిన అవగాహన నాకు లేదు.  పరుచూరి శ్రీనివాస్ చెప్పాల్సిందే.  

వాటి తర్వాత వచ్చిన    “మనుషులు మారాలి”, “బలి పీఠం”, “మరో మలుపు” లాటి సినిమాలు  మనుషుల్లో రావల్సిన మార్పుల గురించిన సినిమాలు.  ఆధునిక సమాజంలో  పౌరుడి సంస్కారం ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉండాలి అని చెప్పే చందాన అవి ఉండేవి.

ఆ తర్వాత ఎమర్జెన్సీ కి అటూ ఇటూగా.  సైద్ధాంతిక రాజ కీయాల మీద ప్రజలకి నమ్మకం ఉన్న రోజున విప్లవం సినిమాలు వచ్చాయి.  “ఎర్ర మల్లెలు”, “విప్లవ శంఖం”,  “రంగుల కల”  చెప్పలేనన్ని సినిమాలు.  ఇవి కూడా సైద్ధాంతిక ప్రాతిపదిక మీద వచ్చినా, ఇందులో కూడా సినిమాటిక్  విలన్లే ఉండి, ఆ ఒకళ్ళిద్దరిని సంహరించడమే విప్లవమనీ  చాల అమాయక మయిన పరిష్కారాలు చూపించిన సినిమాలు అవి.   అయినా సరే  ఓ సైద్ధాంతిక ప్రాతి పదికన బాధ్యత వహిస్తూ కలిసికట్టుగా ఉద్యమించే ప్రజలూ, బాధితులూ వాటిల్లో ఉంటారు.

ఆ తర్వాత కాలంలో విద్యార్థి సంఘాలు దాదాపు మూత పడిపోయాయి.  మన రిఫార్ములూ, MNC లూ,   H1 వీసాలూ, కోచింగ్ సెంటర్ లనబడే జైళ్ళూ  ప్రధానంగా విద్యార్థు లని సమాజానికి ఏ బాధ్యత వహించని వాళ్ళగా,  వహించ నవసరం లేని వాళ్ళుగా తయారు చేసాయని మనకందరికీ తెలుసు.   “బాగా చదువుకున్న వాళ్ళే నక్సలైట్లు అవుతారట”   అనే మాటలు చదువుకునే టప్పుడు వినే వాళ్ళం. దానికి భిన్నంగా న్యూస్  పేపర్ కూడా చదవని విద్యార్థులు ఆ తర్వాత కాలంలోనే తయారయారు. 

ఈ దశలోనే  రాజకీయానికి బ్లాంక్ చెక్ ఇవ్వబడింది.  విద్యార్థులూ, మధ్యతరగతీ  జరుగుతున్న వ్యవహారాలనించి పూర్తిగా బాధ్యత వహించడం మానేసివన సందర్భం.   ఏ సొంత అభిప్రాయమూ ప్రకటించలేని సందర్భం.    మిస్ యినివర్స్,  మిస్ వరల్డ్ గెలవడం  అభివృద్ది అనుకున్న సందర్భం.    కోక్, పెప్సీలు తక్కువ ధరకే దొరకటం  గురించి మధ్యతరగతి తెగ ఆనంద పడ్డ సందర్భం.   వీటన్నిటి వెనకా రాజకీయం  సామాన్యుడు ఊహించలేని స్థితిలోకి చేరుకున్న వైనం.  కోటి రూపాయల అవినీతి అంటే ముక్కున వేలేసుకున్న వాళ్ళకి “వెయ్యి కోట్లు”  “ఐదు వేల కోట్లు”  లాంటివి మామూలు విషయాలయి పోయాయి.   అంత డబ్బు ఎక్కడ తయారవుతోంది. ఎవడికీ నష్టం లేకుండా అంత ఎలా ఒక చోట చేర గలదూ అనేది  తెలియక కాదు, “మనకి సంబంధం లేని విషయం” అనుకునే వాళ్ళే అందరూ తయారయిన పరిస్థితి ఇది.

ఈ సందర్భంలో కొత్త రకం “మనం బాధ్యత వహించనక్కరలేని” సినిమాలు వచ్చాయి.   సూపర్ హీరో సినిమాలు.    భారతీయుడు, అపరిచితుడు,  రోజా , దిల్సే, స్టాలిన్  లాంటి సినిమాలు.   సర్వం నాశనమయిపోయింది, ఎవడో కథానాయకుడు  వచ్చి  ఏదో  చేయాలి తప్పా మన చేతుల్లో ఏమీలేదనే తిరోగమన వాదాన్ని పెంచిపోషించే సినిమాలు.

అవీ దాటేశాం.   ఆ తర్వాత వచ్చిన  సినిమాలు ఇంకో రకం సూపర్ హీరోలని పట్టుకొచ్చాయి.   వీళ్ళు  NRI  హీరోలు.  స్వదేశ్  షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళన్న మాట.   ఈ లీడర్ ఆ కోవకి చెందిన వాడే.   కుప్ప   కూలిపోయిన  మన ప్రజాస్వామిక వ్యవస్థ లోంచి  బయట పడి, పాశ్చాత్య నాగరిక ప్రపంచాన్ని చూసిన సంస్కారంలోంచి  మనమెందుకు ఇలా లేము అని మథన పడ్డ కొందరు యువకుల అమాయకపు ఆవేశం, నిజాయితీ వీటిల్లో ఉంటుంది. 

ఈ ఆలో చనల ప్రమాదం ఏంటంటే,  వీటి వెనక మళ్ళీ తెలియకుండా చెప్పే కొన్ని సూత్రీకరణలుఉంటాయి.    ఇక్కడి సామాన్యుడి మీద నమ్మకం లేక పోవడం.  ఇక్కడి సామాన్యుడు బాధ్యత వహించ నక్కర్లే కుండా కొత్త రకం హీరోల కోసం ఎదురు చూడాలనడం.   ఇలాటివి.   ఎలగూ సూపర్ హీరో  అపరిచితుడు గానీ, NRI  గానీ రాడని మనకి తెలుసు కాబట్టి, మనకి ఖచ్చితంగా మిగిలేది,  నిరాశ, నిస్తేజం.  ఎలాగూ అందరూ దోచేసుకుంటున్నారని నమ్మేశాం కాబట్టి,  ఇక మనమేం చేసినా పర్లేదనే మనకి  పనికొచ్చే వాదం.    రాజ కీయ నాయకుడు ట్రాఫికి ని గంటకి పైగా ఆపగాలేంది, నేను ఈ అర కిలో మీటరు రాంగ్ రూటు లో వెళ్ళి కాస్త ట్ర్ర్ర్రాఫిక్ కి అడ్డం పడితే తప్ప్మేంటి?  వాడు వెయ్యి కోట్లు తినగా లేంది నేను వెయ్యి రూపాయలు తింటే తప్పేంటి?   అప్పుడప్పుడూ ఇలాటి సినిమాలు చూసి, దానికి బాధ్యత ఆ వెయ్యికోట్ల రాజకీయ నాయకుడికీ,  ఎప్పటికీ రాని ఈ సూపర్ హీరో లీడర్ కీ పంచేసి  ఇంటికిపోవడం.    ఇదీ మిగిలేది, ఇలాటి సినిమాల తర్వాత. 

ఇన్ని సినిమాల మధ్యలో ఒకే ఒక్క సినిమా నా దృష్టిలో లీడర్  ని చూపించిన సినిమా.  అది రుద్రవీణ.   ఓ వ్యక్తి  విప్లవకారుడవడానికి, మొట్ట మొదట సంఘర్షించేది తనతోనే.   పేలే లాండ్ మైన్లన్నీ తన గుండేల్లో తానే పేల్చుకుంటాడు మొదటగా.   ఆ తర్వాత కుటుంబంతో.  ఆ తర్వాత ఊరితో.  దానికి ఓ ఉద్యమ రూపం వచ్చాక నాయకు డవుతాడు.   చెప్పలేనన్ని  త్యాగాలు చేస్తాడు దారిలో.   

తెర మీద ఏం జరిగిందనేది కాదు.   తెర ముందు కూర్చున్న వాడికి మాత్రం కొంత కృత్రిమ భావ ప్రాప్తి  ని, మరింత నిస్తేజాన్నీ, బాధ్యతా రాహిత్యాన్నీ నింపే సినిమా ఈ లీడర్.  

“ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోస పోకుమా” అని మహా కవి ఏనాడో చెప్పినా మనకి అర్థం అవదు. 

నాయకుడు లేని చోట…

ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి  జనవరి 10, 2010 ఆదివారం  నాడు ప్రచురించింది. 

ఈ వ్యాసాన్ని  ఆంద్రజ్యోతి లో చదవాలంటే ఇదిగో లంకె!    జ్యోతి లో కొద్దిగా ఎడిట్ చేసి వేశారు.  పూర్తి పాఠం కావాలంటే ఇక్కడ చదవండి.

-ఆక్కిరాజు

_____________________________________

 

ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తుంటే, పూర్తిగా బలహీన పడ్డ పునాదుల మీద నిలబడ్డ పేద్ద భవంతిని చూస్తున్నట్టుగా ఉంది. పూచిక పుల్లల మీద నిలబెట్టిన గుండ్రాయి చందం. ఎవడిని ఎవడూ నమ్మడు. నాయకులన బడే వాళ్ళని నమ్ముదామనుకున్నా, వాళ్ళేమి నమ్ముతున్నారో, దేనికి వాళ్ళు చివరంటా నిలబడతారో ఊహించలేని పరిస్ఠితి. భాషతో, పదాలతో ఆటలు. అస్పష్ట ప్రకటనలతో ఆ క్షణాన్ని ఎలాగోలా దాటవేయాలని చూసే అసమర్థ రాజకీయ వేత్తలు.

తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకన్నా బాధాకరమయిన సమస్య మనకి ఒకళ్ళో ఇద్దరో నాయకులు లేకపోవడం. నమ్మదగ్గ నాయకులు లేకపోవడం. అసలు సమాజంలోనే నమ్మకం లేక పోవడం, లేకుండా పోవడం.

ఎక్కడో చదివాను. నీతి, న్యాయం అని. నీతి నీకు చెప్పబడ్డ మార్గం. అది చట్టం కావచ్చు, మతం కావచ్చు. న్యాయం అనేది నీ సంస్కారం, నీ విజ్నత (Conscience & wisdom) . ఈ హింస "న్యాయ"మేనా అని అర్జునుడు ప్రశ్నిస్తే, "నీతి" బోధ చేశాడు కృష్ణ్దుడు. ప్రభుత్యాలకు నీతి ఉంటుంది. నాయకులు న్యాయమని పించిన వాటిని సామాజిక నీతిగా, రీతిగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మారుతున్న సామాజిక న్యాయాన్ని ఎప్పటికప్పుడు సామాజిక నీతిగా మారాల్సిన ఆదర్శం దాగి ఉంది.

నాయకుడన్న వాడు తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఉండగలగాలి. ఇద మిథ్దంగా ఆ సంగతి చెప్పగలగాలి. దానికి అందర్నీ ఒప్పించ గలగాలి. వారందరికీ మార్గదర్శకుడు కాగలగాలి. అది ప్రస్తుత నీతికి ఎదురొచ్చేదయితే, రాళ్ళ దెబ్బలు తినే ధైర్యం ఉండాలి. రాళ్ళు విసిరే జబ్బు కాదు ఉండాల్సింది. ఎక్కడా అలాటి నాయకులు కనపడరేం? "అన్ పాప్యులర్" అయిన ఆలోచన అయినా సరే "అదే నా నమ్మకం" అని చెప్పగలిగే నాయకులు లేని వికలాంగుల ప్రజాస్వామ్యం ఇది.

ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నది రాజకీయ వేత్తలు. నాయకులు కారు. We only have politicians but not leaders. ఈ రాజకీయ వేత్తలు ప్రజల్లోకి చూస్తారు ఏది ఎక్కువ ప్రజామోద్యమయిన మార్గం అని. తమలో తాము చూసుకునే శక్తిలేక. శక్తిలేక అనేకంటే, దానివల్ల వారికి కావల్సిన లాభం లేనందువల్ల అనటం సమంజసం. పైగా అందరి మాటనే తన మాటగా వల్లె వేయడమే ప్రజాస్వామ్యమని నమ్మ పలుకుతారు. తన నమ్మకాన్ని, తన సిద్ధాంతాన్నీ, తన మార్గానికీ ప్రజామోదాన్ని సాధించి దానికి ప్రాతినిధ్యం వహించడమే ప్రజాస్వామ్యమని చెప్పే నాథుడు లేడు. అందుకే సమాజం రెండుగా అంతకన్నా ఎక్కువగానో చీలిపోయి, ఆవేశాలు బజారులోకి చేరాక, ఇలాటి రాజకీయ వేత్తలకి ఏంచేయాలో తోచదు. స్వంతగా ఓ మార్గం లేని వాళ్ళు ఎక్కడ కక్కడ, ఎప్పటి కప్పుడు ఓ మార్గాన్ని వెతుకులాడతారు, అందరి ఓట్లకోసం. అది సహజంగా ఎవరికీ రుచించని పస లేని మార్గమే అవుతుంది. లేదా అస్పష్టతలతో పరిస్థితులని జటిలంచేసే వెర్రి ప్రయత్నమన్నా అవుతుంది. "ఇప్పుడంతా ప్రజల చేతుల్లోకి పోయిందీ" వాళ్ళు చెప్పిందే మేము చేస్తున్నాము అనే వాడు నాయకుడుగా ఆత్మ హత్య చేసుకున్నట్టు, ఒకవేళ ఏనాడయినా నాయకుడయి ఉండి ఉంటే. అదే పరిస్ఠితి వస్తే నిజమయిన నాయకుడు అన్నిటికీ రాజీనామా చేసి, ఇంట్లో కూర్చోవాలి.

కావలసింది ఇప్పుడు కాస్త వెన్నెముక ఉన్న నాయకులు. ఏది తాను నమ్ముతున్నది. ఎందువల్ల అదే అనుసరణీయం అని చెప్పగల నాయకులు. అలాటి నాయకులు అలాటి భావాలూ బయటకు వస్తే, ఏ ఆలో చన వెనక ఎందరున్నారో తెలుస్తుంది. అప్పుడేమి జరిగినా బాధ ఉండదు. కాసిని తక్కువ బస్సులు తగలబడతాయి. కాసింత తక్కువ మంది ఆహుతయి పోతారు. అలాటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించ గలిగిన నాయకుల వల్ల నమ్మకం అనేది కలుగుతుంది. నాకు హిందీ జాతీయ భాషగా ఉండడం ఎంత మాత్రమూ రుచించని విషయం. ఆ విషయంలో కొన్ని తరాల క్రితం ఎన్నో ఉద్యమాలు రెండు వైపులా జరిగాయి. కానీ మొరార్జీ దేశాయ్ మాత్రం దాన్ని చివరంటా సమర్థిస్తూనే ఉన్నాడు. ఆ ఆలోచన పట్ల నాకు ఎంత వ్యతిరేక భావం ఉన్నా, మొరార్జీ ని దేశ నాయకుడు అని నేను అంగీకరిస్తాను.

అయినా అలాటి నాయకులని ఆశించే అర్హత మనకి లేదేమో. వాళ్ళు కూడా మనలోంచి ప్రజల్లోంచి రావాల్సిందే కదా? మన మెంత నమ్మ కస్తులమో ఆలో చిద్దాం. ట్రాఫిక్ పోలీసు వాడు లేకపోతే మనకి సిగ్నల్ రంగులు కనపడవు. ప్రతీ పౌరుడూ బాధ్యతగా ఉండాలంటే, ప్రతి పౌరుడి వెనకా ఓ పోలీసు వాడుండాలి. 60 లక్షల ప్రజలున్న నగరంలో 30 లక్షల మంది సాధారణ పౌరులు, 30 లక్షల మంది పోలీసులు. (పోలీసులంతా నమ్మకస్తులని కాసేపు అనుకుందాం). రోడ్ల మీద అంతా చెత్త పేరుకు పోతోంది అని గొడవ చేస్తే, ఓ కార్పొరేషన్ అధికారి టి.వి లో అన్నాడు. కొన్నిలక్షల మంది చేస్తున్న చెత్తని కొన్ని వేల మంది మున్సిపల్ పని వాళ్ళు ఎప్పటికీ శుభ్రం చేయలేరు అని. పౌరులు రోడ్ల మీద చెత్త చేయకుండా ఉండటం ఒకటే మార్గం. ఆ బాధ్యత లేని పౌరులు, శుభ్రమయిన వాతావరణానికి అర్హత లేని వాళ్ళవుతారు.

అదే రకంగా మనకి ఏ రకంగా చూసినా పక్కవాణ్ణే కాదు, ఎవడిని వాడే నమ్ముకోలేని పరిస్థితి. దిగువ మధ్యతరగతి నించి వచ్చిన నాలాటి వాడికి ఉదాహరణలుగా చెప్పడానికి అజరుద్దీన్ లాటి వాళ్ళని చూపించే వారు. ఓ సాధారణ మధ్యతరగతి లో పుట్టి, దాదాపు ప్రపంచంలోనే ఓ ఉన్నత స్థాయి క్రికెటర్ గా మారగల అకుంఠిత దీక్ష, శ్రమ, పట్టుదల చూపించగలిగిన అజరుద్దీన్ కథ ఎవరికయినా ఆదర్శం కాదగ్గ్గది. విద్యార్థి దశలో కథలు కథలు గా అజరుద్దీన్ గురించి వినడం నాకు గుర్తు. అలాటి కథానాయకుడు ఒక్కసారిగా మొత్త్తం దేశాన్నే మోసం చేశాడు అని ఋజువయితే, నా బోటి విద్యార్థులకు ఎటువంటి అపనమ్మకం సమాజం పట్ల ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గ్లోబలైజేషన్ అన్నారు. కొత్తరకం హీరోలు వచ్చారు. ఇక్కడంతా ఏ మాలిన్యం అంటని మల్లెపువ్వులు అన్నారు. అలాగే అనుకున్నాం. మధ్యతరగతికి అదో కొత్త అందుబాటులోకి వచ్చిన ద్రాక్ష తోట. వాళ్ళ బొమ్మల్ని అన్నింటా ప్రచురించి కొలిచాం. మన రాజకీయ వ్యవస్థ కి దాదాపు సమాంతరంగా వీళ్ళే మరో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్నారు, వీరే కొత్త హీరోలనుకున్నాం. అంతట్లోనే రామలింగరాజు గారు ఆ నమ్మకాన్ని కూడా కూల్చేశారు.

అసలు ఈ తరం అంతా ఇంతే. విలువల గురించి తెగ ఊదరగొట్టే పాత తరమే కాస్త నయమేమో ననుకున్నాం. స్వాతంత్ర సమర యోధుణ్ణనీ ఆ విలువలన్నీ వొంట పట్టించుకున్నాననే చెప్పే అందరికంటే సీనియర్ అయిన గవర్నర్ గారి రాసలీలలు ఆ నమ్మకాన్ని కూడా వమ్ముచేసేశాయి.

పోనీ వీళ్ళేదో వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, దాన్ని జెనరలైజ్ చేసి అందర్నీ నమ్మక ద్రోహులూ అనే జాతి నింద చేస్తున్నానను కోవచ్చు. అలా స్టీరియో టైపులు తయారు చెయ్యద్దని నేనే మరో వ్యాసం రాసి ఉన్నాను. నేను చెప్పదలుచు కున్నది, హైదరాబాదు కు దాపు రించిన ఓ ప్రత్యేక మయిన పరిస్థితి. ఎవరైతే (గవర్నర్ తప్పించి) ఈ నగరానికి వన్నె తెచ్చారని భావించామో వాళ్ళే ఈ నగరానికి నమ్మదగనిది అని చూపించారు. ఓ టెండూల్కర్ ముంబయికి, డ్రావిడ్ బెంగళూరు కి, శ్రీకాంత్ చెన్నయ్ కి దొరికి, మనకి మాత్రం అజహరుద్దీన్ దొరికాడు. ఆట విషయంలో వాళ్ళందరి సరసనా నిలవగలిగిన అజహరుద్దీన్, మనకి చేసింది సామాన్యమయిన అన్యాయం కాదు. అలాగే, ప్రేమ్ జీ, నారాయణ మూర్తి, దొరై లకి బదులు మనకి రామలింగరాజు దొరికాడు.

ప్రొఫెషనల్స్ నించి మనం ఆశించేది నీతి. నాయకులనించి ఆశించేది నీతి తో పాటు, న్యాయం. గోపీచంద్, సానియా మిర్జా, వి.వి.యస్. లక్ష్మణ్ లాంటి మంచి ముత్యాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక్క విషపు చుక్క చాలు అని మనకు తెలుసుగా. వీళ్ల మీద ఏ అపవాదూ లేకపోయినా, వీళ్ళని కూడా మనం ఎంతో కొంత అనుమానంగానే చూట్టం నేర్చుకున్నాం. ప్రపంచంలో మరెక్కడా లైఫ్ స్టల్ లాంటి షాపుల్లోకి వెళ్ళేటప్పుడు సంచులు బయట పెట్టి టొకెన్ తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఒక్క మన హైదరాబాద్ లోనూ, బారత దేశంలోనూ మాత్రమే ఈ పరిస్ఠితి. రైల్వేస్టేషన్ లో స్టీలు గ్లాసులకి చైన్లు కట్టాల్స్లిన అవసరానికి దీనికీ పెద్ద తేడాలేదు.

పెద్ద పెద్ద హోదాల్లో ఉండి, ఆఫీసు పనులమీద హోటళ్ళలో ఉండి తుళ్ళూ, సబ్బులూ ఎత్తుకొచ్చే వాళ్ళు మనకి చాలా మందే తెలుసు. ఒక వింత స్థితికి చేరాం మనం. ఎవణ్ణి ఎవడూ నమ్మలేని వికృత శూన్యంలో ఉన్నాం. నీతి కోసం, న్యాయం కోసం చూపించ దగ్గ ఉదాహరణలు లేని పరిస్థితిలో ఉన్నాం. లేరని కాదు. నమ్మకం పోగొట్టుకున్నాం. ఫలానా వాడు కాచ్ డ్రాప్ చేస్తే "ఎంత పుచ్చుకున్నాడో" ననే అనుమానం. ఓ రాజకీయ వేత్త "ఇక నించీ నేను తెలంగాణానే సమర్థిస్థాను" అంటే వీణ్ణి మరెవడో కొనేశాడు అంటాం.

ఈ పరిస్థితికి ఎవర్ని బాధ్యుల్ని చెయ్యటం? మన లెంపకాయల మీద చాచి కొట్టి బుద్ది చెప్పే ఓ నాయకుడు కావాలి. ఓట్లు వచ్చినా పోయినా తన మార్గాన్ని నిర్థుష్టంగా చెప్పగలిగిన ఓ నాయకుడు కావాలి. ఒంటరిగా, ఎవ్వరూ లేనప్పుడు కూడా రెడ్ లైట్ దాటని పురః ప్రజలు కావాలి. అప్పుడు తెలంగాణా సమస్యలాంటి సమస్యలకి ప్రజాస్వామికంగా ఎలా పరిష్కారం కనుగొన వచ్చో మనకి తెలిసి వస్థుంది. అంతటి హృదయ సంస్కారం ముందు మనలో, మామూలు మనలో వస్తే, మనలోంచే అలాంటి నాయకులు వస్తారు. అప్పటి దాకా… ఈ బస్సులు ఇలా తగల బడుతూనే ఉంటాయి.

బాలగోపాల్ మరణం తో నా కేమిటి బాధ?

 

సెప్టెంబర్ నెలలో నేను రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధి దగ్గర ఉన్నాను. అక్టోబర్ లో మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్ చూశాను అట్లాంటాలో. ఈ రెంటి మధ్యలో మా అమ్మానాన్నలు చనిపోయి ఓ సంవత్సరం గడిచిన రోజు. భధ్రాచలం డివిజన్లో గిరిజన విద్యార్థుల కోసం ఎంతో శ్రమించిన మానాన్న జ్నాపకాలు మమ్మల్ని ముంచెత్తుతున్న సమయం. అదే సందర్భంలో బలగోపాల్ చనిపోయారని వార్త.

బాలగోపాల్ గురించి అనేక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ చదివాక, ఓ మామూలు పౌరుడిగా నేనెందుకు బాధ పడాలి బాలగోపాల్ గురించి అని చెప్పాలనిపించింది. ఆయన్ని ఎప్పుడన్నా కలిశానేమో గుర్తుకూడా లేదు నాకు. బహుశా ఏ సాహిత్య సభలోనో మరో చోటో ఒకే చోట ఉండి ఉండొచ్చు. కానీ ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం సున్నా. అయినా ఆయన మరణం నన్నెందుకు అంతగా బాధించాలి?

కథ 1 :

మా ఆవిడ క్రెడిట్ కార్దు పోయింది. పోవటమే కాదు, దాన్ని ఎవడో వాడడం కూడా మొదలు పెట్టాడు. దాదాపు 15 వేలు ఖర్చు పెట్టేశాడు. విషయం తెలిసిన వెంటనే బాంకుకు ఫోన్ చేసింది. బాంకు వాడు పోలీసు కంప్లయింట్ ఇచ్చి ఆ రిపోర్టు చూపిస్టే ఆ 15 వేలు ఇచ్చేస్తానన్నాడు. (అమెరికా లో ఇలాగే జరిగితే పోలీసుల తో పని లేకుండానే బాంకులు తిరిగి ఇచ్చేస్తాయి). సరే ఉండేది కొండాపూర్ కదా, మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కంప్లయింట్ ఇవ్వడానికి. వాళ్ళకి రెండు సమస్యలు కనపడ్డాయి. ఒకటి, ఆ దొంగ చివరి సారి ఎక్కడ ఖర్చు పెట్టాడో అక్కడికి వెళ్ళి కంప్లయింట్ ఇవ్వాలి. రెండోది, మీ ఆయన లేకుండా ఒక్కళ్ళే ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్ కి అని! తను మళ్ళీ రెండో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళింది. అక్కడా అదే పరిస్థితి. మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని. మీ అయన ఏడీ అని.

మా ఆవిడకి వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. అన్నిటి కన్నా ప్రధానమయింది, నువ్వులేకుండా నేను పోలీసు స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ చేసే హక్కు నాకు లేదా? ఇంత అవమానమా అని! ఆ కోపంతో మేం వెళ్ళలా. 15 వేలూ అలా మాకు తిరిగి దక్కలా. ఆ అవమానానికి మా ఆవిడ దాదాపు కళ్ళనీళ్ళు పెట్ట్టుకుంది. ఒక్కదాన్నీ ఆఫీసు పని మీద దేశాలు తిరగ్గలిగిన దాన్ని, ఉన్న ఊళ్ళో పోలీస్ స్టేషన్ కెళ్ళాలంటే నాకు ఆ పాటి వ్యక్తిత్వం లేదా అని! (ఇప్పుడు ఓ మహిళ హోం మంత్రి కూడా).

కథ 2 :

మా చుట్టాల్లో ఒకాయనకి మరెవరూ లేరు. గుండెలో నొప్పి అంటే యాంజియో గ్రామ్ చెయ్యాలన్నారు. సరే నేను చేయిస్తానన్నాను. అపోలోలొ ఒకే రోజులో అయిపోతుంది వెళ్ళి 16 వేలు కట్టండి అన్నారు. సాయంత్రం 4 గంటలకి వెళ్ళి కడితే 7 గంటల కల్లా వెళ్ళి పోవచ్చునన్నారు. సరే అయిపోతుంది కదా అనుకున్నాం. మా ఆవిడా నేను, ఒకళ్లు ఇంట్లో మా అమ్మాయి దగ్గర. మరొకళ్ళు హాస్పటల్లో ఉండి చేయించచ్చు అనుకున్నాము. టైం గడుస్తుంది కానీ పని జరగదు. కొత్త కొత్త టెస్టులు రాస్తారు, యాంజియో గ్రాం మాత్రం జరగదు. డాక్టర్ లేదు అని ఒకసారి. ఏదో బ్లడ్ టెస్తు రిజల్టు సరిగ్గాలేదు అని ఒకసారి ఇలా సాగి పోతూనే ఉంది. మా అమ్మాయిని కార్లో డ్రవర్ దగ్గర ఉంచి ఇద్దరం హాస్పటల్లో అటూ ఇటూ పచార్లు. చీకట్లో డ్రవర్ తో పాటు తెల్లారి బడికి వెళ్ళాల్సిన మా అమ్మాయి గంటకి పైగా ఎదురు చూడ్డం. అంతా చేసి రాత్రి పదింటికి ఈ రోజు అవదు. రేపు పొద్దున రండి అన్నారు. నాకు తిక్క రేగి, అక్కర్లేదు మేము రాము అన్నా. ఆ కట్టిన డబ్బులు కావాలంటే మళ్ళీ వేరే ఏదో కౌంటర్ కి మరుసటి రోజు వెళ్ళి తెచ్చుకోవాలిట. నేను వినియోగ దారుల కోర్టులో దావా వేసి డబ్బులు తెచ్చుకుంటా నని డిస్చార్జ్ కూడా చెయ్యకుండా తీసుకొచ్చేశా. లాయర్ తో మాట్లాడాను కూడా. మళ్ళీ పని హడావిడిలో పడి ఆ పని పూరి చెయ్యలేక పోయా. (అపోలో వాళ్ళు మరి ఆ డిస్చార్జ్ కాని పేషెంట్ ఫైల్ ఎలా మూసేశారో వాళ్ళకే తెలియాలి). ఇక్కడ కట్టిన 17 వేలు కూడా మేం పోగొట్టుకున్నాం.

కథ 3 :

కొండాపూర్ నించి సోమాజీగూడాలో నా ఆఫీస్ కి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసూ, ఆ తర్వాత ముఖ్యమంత్రిగారి కాంప్ ఆఫీసూ దాటి వెళ్ళాలి. ఈ మధ్యలో ఓ రాజీవ్ గాంధీ విగ్రహం కూడా. తెలుగు దేశం ఆఫీసుముందు నాలుగు లైన్ల కార్లు ఎప్పుడూ రోడ్డు మీదే ఉండాలి. అవి రాంగ్ సైడ్ లో ఎల్ వి ప్రసాద్ హాస్ప్టిటల్ నించి నేరుగా ఎదురు రావచ్చు. ఎలక్షన్ల సీజన్ అయితే సీట్లకోసం వచ్చేవాళ్ళు వాళ్ళ పరపతి చూపించడానికి కొన్ని వందల కార్లు, అవికూడా కువాలీస్, స్కార్ఫియో లాంటి పెద్ద పెద్ద కార్లు, పదుల సంఖ్యలో లగ్జరీ బస్సులు జిల్లాల నించి వస్టాయి. ఆవన్నీ అలా రోడ్డుమేదే అపేసి ఉంటాయి. గన్ మెన్లూ, సెల్ ఫోన్లూ, మడత నలగని ఖద్దరు చొక్కాలూ అదో వాతా వరణం.

ఈ మధ్యలో నా లాంటి ఉద్యోగస్తులు బైకుల మీదా, కార్లలో, బస్సుల్లో అఫీసులకి చేరడానికి పడే పాట్లు హైదరాబాద్ వారికి చెప్పక్కర్లా. మిగతావారి సంగతి నాకు తెలీదు, నాకు మాత్రం నాకు ఇంత కూడా విలువ లేదా ఈ దేశంలో అని విరక్తి కలుగుతుంది. ఆ రాజకీయ నాయకులూ వారి చుట్టూ ఆ పెద్ద పెద్ద వాహనాల్లో జిల్లాలనించి వచ్చి వాళ్ళు ఈ దేశానికి ఉద్ధరించేది ఏమిటో గానీ, నేను వేళకి ఆఫీసు కి వెళ్ళటం కంటే విలువయినది అని హదరాబాద్ లో అందరం అంగీకరించేశాం. అదే సీను మళ్ళీ ముఖ్యమంత్రి గారి కాంప్ ఆఫీసు దగ్గర. ఒక్కోసారి ఆ విగ్రహాల దగ్గర. పొద్దున 9.00 గం.లకి రోడ్లన్నీనిండుగా ఉన్నప్పుడు, ఆ మధ్యలో ఉండే విగ్రహానికి అన్నివందల దండలు ఎందుకు వెయ్యాలో నాకు తెలీదు. ఆ నాయకుల పట్ల నిజంగా అంత గౌరవం ఉందని కూడా నాకేమీ నమ్మకం లేదు. (నిజం చెప్పద్దూ, రాజీవ్ గాంధీ ఉన్నంతలో కొంత నిరాడంబరంగానే జీవించారని చెప్పొచ్చు. అన్నిదండలు ఆయన బతికుండగా వేయించుకున్నాడని నేనను కోను).

కొసమెరుపు: మా అమ్మాయి వాళ్ళ క్లాస్ మేట్ పుట్తినరోజు పండక్కని పిజ్జాహట్ కి వెళ్ళింది. కారు ఆపి, అమ్మాయిని దింపి బయటకి వచ్చేటప్పటికి ఇక్కడెందుకు కారు ఆపావు అని నాకు ఎంతో గుర్తులేదు, ఫైన్ వేసారు మన ట్రాఫిక్ పోలీసులు. V.I.P కాకుండా వెధవపని చేస్తే ఎట్ట్లా?

——-

ఆ పై కథలన్నీ ఓసారి చూస్తే అవన్నీ నాకు పౌరుడిగా "ఇవ్వబడిన" హక్కులు నాకు దొరకని వైనాన్ని చెపుతాయి. లేని హక్కుల కోసం కాదు, ఉన్న, ఇవ్వబడిన హక్కుల కోసం "పోరాడాల్సిన" సందర్భంలో ఉన్నాం!   హక్కుల మాట అటుంచి సాధారణ పౌరులుగా మామూలు డిగ్నిటీ, మర్యాద కోరుకోవటం కూడా దురాశే అవుతున్న సందర్భం. కుడి, ఎడమల తేడా లేకుండా ఎలాగోలా దాటి ముందుకు వెళ్ళటమే.  పక్కవాడి హక్కుగురించి మనకి మనకే లక్ష్యం లేని "మాస్" మనం.

మేము ఇండియాకి తిరిగి రాంగానే డ్రవర్ ని పెట్టుకున్నాం. అంతకు ముందు M.L.A దగ్గర పని చేసే వాట్ట. వాళ్ళతో ఇంకా పరిచయాలు ఉన్నాయి, M.L.A స్టిక్కర్ పట్టుకొచ్చి అతికిస్తాను, అప్పుడు కారు ఎక్కడన్నా ఆపచ్చు అని మాతో గొడవ. వద్దురా నాయనా మన బతుకేదో మనం బతుకుదామని అతగాణ్ణి ఒప్పించే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ప్రతివాడూ ఏదో ఒకలా V.I.P అయిపోవాలి అంతే. అప్పుడు హక్కులేం ఖర్మ, లేని హక్కులు కూడా సంప్రాప్తిస్తాయి.

నేనూ మా ఆవిడా పోస్టు గ్రాడ్యుయేట్లం, అమెరికా, ఆస్ట్ర్రేలియా లాంటి దేశాల్లో ఉన్నాం, పని చేశాం, మంచి ఉద్యోగాలే చేస్తున్నాం, బాగానే సంపాయించుకుంటున్నాం, దాదాపు 10 దేశాలు తిరిగాం, అరడజను పైగా భాషలు మాట్లాడగలం, రక రకాల మనుషుల్ని చూశాం, బోలెడంత సాహిత్యాన్ని చదివాం, రచయితలతో, పాత్రికేయులతో, రక రకాల ప్రముఖులతో, ఉద్యమకారులతో, సంఘాలతో, రాజకీయ పక్షాలతో పరిచయాలున్నాయి. మేము సాధారణ, సాధారణ పౌరులకంటే ఒకింత అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళమే. అయినామా బతుకుల్లో మాకున్న మాహక్క్లు లకి మాత్రం హామీ లేదు.

ఆ పైన చెప్పిన కథలన్నింటిలో నేను ఓ పాత్రికేయుడితో రాయించో, మా కుల పెద్దతో బెదిరించో, పరిచయమున్న రాజకీయ నాయకుడితోనో, పెద్ద అధికారంలో ఉన్న బంధువుతోనో చెప్పించో నా డబ్బులు నేను తెచ్చుకుని ఉండచ్చు. ఆ అవకాశం నాకు ఉందికూడా. కానీ "అక్కిరాజు గా" "స్వర్ణ గా" మా హక్కులు మాకు దక్కవు. అలా పక్కదారి పట్టక సూటిగా పోవాలి లేదా పోరాడాలి అని ప్రిన్సిపుల్ పెట్టుకుని, అందుకు తగ్గ సమయం లేక పోతే మనమే అలా నష్ట పోతాం, పోతూనే ఉంటాం.

ఇదంతా నా సొంత గొడవ. సమాజంలో అన్నిరకాలుగా ఓ మెట్టు పైనే ఉన్న మాలాంటి వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, 21 వ శతాబ్దంలో కూడా ఏ హక్కులూ కనీసం కాగితం మీద కూడా లేని సమూహాలు ఈ దేశంలో ఎన్నని? దేశాన్ని కొందరి చేతుల్లో పెట్టేసి, మొత్తం మధ్యతరగతి ఓ నిర్లిప్తత ని అలవర్చుకుంది. అంత నిరా సక్తంగా, నిస్తేజంగా, ఏ నిబద్ధతా లేకుండా ఈ సమాజం ఎలా ఎందుకు తయారయిందో ఊహ కందని విషయం.

ఎక్కడో మేధావి వర్గంలో సైద్దాంతిక చర్చలకే పరిమిత మయిన స్వాతంత్రోద్యమాన్ని మాస్ ఉద్యమంగా, మధ్యతరగతిని వీధిలోకి తెచ్చిన ఘనత మహాత్ముడిది. ఇప్పుడు జరగాల్సిన పనికి అలాటి మహాత్ములే కావాల్సి ఉంది. దానికి కావల్సిన సరంజామానంతా తయారు చేసిన నేటి మహాత్ముడు పని పూర్తవకుండా నే వెళ్ళి పోవడం బాధాకరం. ఆశని పాతం.

ఐ.టి. ఉద్యోగుల గురించి, వారి జీవన విధానాల గురించీ ఏమీ తెలియకుండా రాసి పారేసే రచయితలకీ, మీడియాకి నేను "మేధావులూ స్టీరియోటైపులూ" అనే వ్యాసంలో నా నిరసన తెలియ జేశాను. I.T కంపెనీల వల్ల సమాజానికి చేటు అనంటే, అందులో పనిచేసే మామూలు మధ్య తరగతి మనుషులందర్నీ చెడిపోయిన వాళ్ళలా చూసే ఆ వింత జాడ్యాన్ని నేను ప్రశ్నించాను. ఆ వ్యాసంలో ఈ వాక్యాలు చూడండి. "

ఇక సైద్ధాంతికంగా ఆలోచించి ఐటీ కంపెనీల గురించీ, గ్లోబలైజేషన్ పేరుతో సృష్టించ బడుతున్న అకస్మాత్తు ఆర్థిక అసమానతల గురించి మాట్లాడే విషయం వేరు. అసమానతలు ఐటీ అవొచ్చూ, బయోటెక్ అవచ్చూ, మన దేశంలోనే ఉన్న టాటా, రిలయన్స్ లాటి కంపెనీలు కావచ్చు. కొన్ని కోట్ల్ల మంది బతికే వ్యవసాయం, చేనేత, చేతి వృత్తులూ సర్వ నాశన మయి పోయి, కొన్ని వేలు, మహా అయితే లక్షల మందికి మాత్రమే ఉపాధి అదికూడా చాలా ఎక్కువ జీతం దక్కేలా చేసే హైటెక్ కంపెనీలకి చేయూత నిచ్చే ఆర్థిక విధానాలని సమర్థించాలా అనే ది పూర్తిగా వేరే విషయం."

 .టి కంపెనీల్లో పనిచేసే మనుషుల్ని దాటి, సమాజంలో ఆ కంపెనీల స్థానాన్ని గురించిన చర్చజరగాలి అని నేను అభిలషించా. అలాంటి చర్చ చెయ్యగలిగిన వాడు ఓ మేధావి అవుతాడు. సత్యం కంపెనీ దుమారం తర్వాత బాలగోపాల్ రాసిన ".టి భావజాలం తొలగిపోయేనా" అనే ఈ వ్యాసం చూడండి. .టి లో పని చేసే వాళ్ళని పత్యేకించి, వాళ్ళని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు ఒక్కటి కూడా ఉండవు ఇందులో. ఉద్యోగాలు కోల్ఫోతున్న వారి పట్ల జాలి కూడా ఉంది. కాపోతో, వీరికి కూడా ఎప్పట్నించో ఉపాధి కోల్పోతున్న ఇతర కార్మికుల తో సమానమయిన జాలినే చూపించాలంటాడు. ".టి ఒక పరిశ్రమ. కొన్ని వనరులు తీసుకుంటుంది, కొన్ని ఉత్పత్తులు ఇస్తుంది. కొంత ఉపాధి కల్పిస్తుంది."

మన జనాలు ఎంతగా నిద్ర పోతున్నారంటే, వాళ్ళతరపున అవిశ్రాంతంగా పోరాడిన ఓ ఆశాకిరణం ఒకటి అదృశ్యమయిందనే సంగతి కూడా తెలీనంతగా నిద్రపోతున్నారు.

Probably we don’t deserve Balagopal amongst us!

అక్కిరాజు భట్టిప్రోలు

నవంబర్ 6, 2009

ఆట్లాంటా

నాగార్జున సాగరంలో కథా సమారాధన

    img_1274

     (Click Here For More Pictures)

    ఫిబ్రవరి 7, 8  తేదీలలో కొంత మంది తెలుగు కథా రచయితలు కథల గురించి మాత్రమే మాట్లాడాలని ఒట్టు పెట్టుకుని కలిశారు.   “కథల్ని బేరీజు వేసుకోవటం తప్పా వేరే ఉద్దేశం లేదు” అంటూ ఖదీర్ బాబు చాలా చిన్న విషయంగా  శనివారం ఉదయం సంభాషణని ప్రారంభించిన కార్యక్రమం  “ఇరవయ్యొకటవ శతాబ్దం కొత్త డిజైన్ లని సృష్టించాల్సిన శతాబ్దం” అంటూ  చినవీరభద్రుడు ఆదివారం మధ్యాహ్నం ముగించే దాకా సాగింది.

    మొత్తం  ౩౦ మంది రచయితలు హైదరాబాద్, కర్నూలు, తిరపతి  తదితర ప్రాంతాలనించి శుక్రవారం రాత్రికే విచ్చేశారు.   యూత్ హాస్టల్ లో వసతి.  హైదరాబాదు నుండి చాలామంది కలిసి వచ్చిన వాను ఆర్థరాత్రికి చేరింది.  

    కార్యక్రమం ఎన్నో అంకాలుగా జరిగినా,  అన్నింటినీ  కాస్త అదుపులో ఉంచడానికి తుమ్మేటి రఘోత్తమ రెడ్డిగారు నడుంబిగించారు.  ఆయన మొఖమ్మీద చిరునవ్వు చెరక్కుండానే చర్చల్ని ఒకరి వెంట ఒకరు మాట్లాడేలా చూడగలిగారు.

    శనివారం ఉదయం మొట్ట మొదటి అంకం విహారి గారి తో ప్రారంభమయింది.  తాను రచయిత, పాఠకుడు, విమర్శకుడు అనే మూడు పాత్రలూ ధరిస్తాననీ , మూడు కోణాల్లోనూ తెలుగు కథని వివరిస్తానని దాదాపు ఓ గంట ఉపన్యసించారు.   ఈ మధ్య కాలంలో వస్తున్న కథల  గురించి ఆయన మాట్లాడారు. 

    ఆతర్వాత  పాఠకులు ఎందుకు కథల్ని చదవట్లేదనీ, ఎందుకు రచయితలు పత్రికల్ని బతిమిలాడి  స్థలం కేటాయింపుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోందని చర్చ జరిగింది.   కొంత మార్కెట్ ఎలా పెంచుకోవాలనీ పుస్తకం ధరలు తగ్గించడం లాటివీ, పాథకుల కు విశ్వాసం కలిగించే కథలు రాసి  కథల కోసం పత్రికల్ని కొనే స్థితికి రాగలిగితే పత్రికలే స్థలం కేటాయించాల్సి వస్తుందనీ చర్చలో దొర్లాయి.

    మరో  అంకం సురేష్, కాత్యాయనీ, అనంత్ ల ఉపన్యాసాలతో జరిగింది.  మరుసటి రోజు ఉదయం నరేందర్ గారు కథాసంపుటి తేవటం లోని సాధక బాధకాలను చర్చించారు.  ఆ తర్వాత  చినవీరభద్రుడు గారు సుదీర్ఘమయిన ఉపన్యాసం చేయడంతో కార్యక్రమం ముగిసింది.  ఈ మొత్తం చర్చలో  గుర్తుంచుకో వల్సిన కొన్ని అభిప్రాయాలు..


    విహారి :

    • కథలు బాగుంటున్నాయి కానీ వెంట బడట్లేదు.  కాలక్షేపం కథలు ఉంటాయా అంటే, చదివి వదిలేసే కథల్ని అలా అనుకోవచ్చేమో.   ఈరోజుల్లో పట్టుకుని కుదిపేసే కథలు తక్కువే.  సమాజంలో ఉండే రొచ్చుని చూపిస్తే సరిపోదు.  రచయిత నాకందిస్తోంది ఏమిటి అని పాఠకుడు చూస్తూనే ఉంటాడు.    జీవితాన్ని విశ్లేషించాలి, వ్యాఖ్యానించాలి.  అదికూడా  వాచ్యంగా, నినాదంలా కాకుండా చెయ్యగలగాలి.

    • కథకుడిగా చూస్తే చాలా పరిమితులు ఉన్నాయనిపిస్తుంది.  పత్రికా ప్రపంచంలో చాలా అవాంఛనీయ మైన పరిస్ఠిత్లుతులు ఉన్నాయి.  పత్రికకో రకమైన కథలు వస్తున్నాయి.  కథ పంపాక దాని వివరాలు రచయితకి తెలియవు.  

    • విమర్శకుడిగా చూస్తే, ప్రస్తుతం విమర్శ పేరుతో వస్తున్నదేదీ విమర్శ కాదు.  నా భావజాలానికి నచ్చినదైతే మెచ్చుకుంటాను, లేక పోతే చెండాడతాను అనే పద్దతి.   

    • రచయితలు కథకులకి దగ్గరగా, పాఠకులకి దూరంగా జరుగుతున్నారేమో చూసుకోవాలి.    వస్తువుల్ని లిమిట్ చేసేసుకుంటున్నాం.    మధ్యతరగతి కథల పట్ల చిన్నచూపు ఎక్కువయింది.  కొడవటిగంటి ఎక్కువ మధ్యతరగతి కథలే రాశారని గుర్తు పెట్టుకోవాలి. 

    • రచయితలకి ఆత్మ ముగ్ధత్వం ఎక్కువయింది.  

    • మొత్తంమీద చూస్తే దాదావు అన్ని కథల్ని ఏడు మూస కథల్లోంచి తయారు చేసినట్టుగా చెప్పొచ్చు.   కరువు, ప్రపంచీకరణ, మిగిలిన వాదాలూ కలిపి ఏడు మూసలు.  

    • చెడ్డ కథని మంచి కథగా చూపకూడదు.

    సురేష్ :

    • సంక్షోభంలోంచే సాహిత్యం వస్తుందా అని చూశాను.   సౌత్ అమెరికానించీ, నార్త్ అమెరికానించీ కూడా మంచి సాహిత్యం రావడం గమనించాను.   తెలుగులో వాస్తవికత ఎక్కువ.  లాటిన్ అమెరికాలో  జానపద కథల లాంటి శైలి కనపడుతుంది.  మాజిక్ రియలిజం అలాటిదే.  నార్త్ అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నాయి.  ఓ “Anti story”  మూవ్ మెంట్ అంటూ కూడా రాశారు.    మన రచయితల్లో అలాటి ప్రయోగాలు తక్కువ.

    కాత్యాయని :  

    • ప్రచురణలు ఎక్కువే కానీ గుర్తు పెట్టుకునేవి ఎన్ని?   ఒకే రకంగా రాయటం , వాదాలూ, నినాదాలూ లాటి సులభ మార్గాలు ఎన్నుకుని రాయటం ఎక్కువయింది.     

    • రాసే వస్తువు పట్ల నమ్మకం ఉండాలి.  చినవీరభద్రుడు  రాసిన “రాముడు కట్టిన వంతెన”  లో జరిగిందిదే.   రాముడి ఇమేజి ఈ మధ్య కాలంలో మారి పోయి ఉంది.  దానికి భిన్నంగా కథ రాస్తూ తనని తానే కన్విన్స్ చేసుకోడానికి  రాస్తున్నట్టుగా అనిపించిన కథ అది.

    • వాపోత కథలు, సెల్ఫ్ పిటీ కథలూ ఎక్కువవు తున్నాయి

    అనంత్ :

    • ఇప్పటి కథల్లో పాత్రలు కొత్తగా ప్రవర్తించడం లేదు.  అవి కొత్తగా, తెలివిగా వాదిస్తున్నాయి అంతే.    మన రచయితలకి “హేతువు” గుదిబండ అయింది.    

    • కథకులు  సంక్లిష్ట మయిన విషయాలను స్పృశించడం లేదు.   సమాధానం చెప్పాల్సిన అవసరం లేని కథల్ని రాస్తున్నారు.

    రామ్మోహన్ : 

    • అర్బన్ లైఫ్ కి సంబంధించిన కథలే సరిగా రావడం లేదు. 

    ఖదీర్ : 

    • కథా సంపుటాలు వారి వారి ఇష్టాల ప్రకారమే వచ్చే పుస్తకాలైతే   “మాకిష్ట మయిన కథలు” అని వేసుకుంటే సరిపోతుంది.  వీటిని  “ఈ సంవత్సరపు అత్యుత్తమ కథలు” అని వేస్తుంటే ఇవే ప్రమాణంగా మారి ఇలా రాస్తే సరి పోతుందనుకుంటున్నారు రచయితలు.

    నరేందర్ :

    • అర్బనా రూరలా  అనే కన్నా కథ జీవితంలోంచి వచ్చిందా లేదా అనేది ముఖ్యం.

    • మంచి కథల కోసం అన్ని పత్రికలూ  చూడాల్సిన అవసరం లేదు.   మెజారిటీ మంచి కథలు ఆదివారం ప్రత్యేక సంచికల్లోనే వస్తున్నాయి. 

    • అనేక మంది మితృలకి ఫలానా పుస్తకంలో మంచి కథల్ని  ఎంపిక చేసి చెప్పమంటాం.  అంలా షార్ట్ లిస్ట్ చేసిన కథల్లోంచి చివరి ఎంపికని సంపాదకులం ఎంచుకుంటాం.

    • ఎంపిక అనే దాంట్లో  సబ్జెక్టివిటీ ఉంటుంది.

    • ఖదీర్ బాబు రాసిన వ్యాసంలో పైపైన రాసిన కొన్ని వ్యాఖ్యలు హర్షించేట్టు లేకపోయినా  కథల పట్ల ఆయన అవేదనని గుర్తించాం.  ఆయన  మేం ఎంపిక చేయలేదు అన్నకొన్ని కథల పట్ల ఇప్పటికీ నాకేమీ సదాభిప్రాయం లేదు.  

    • ఇలా ఎంపిక చేసిన కథలు బాగాలేవు అనే వాళ్ళు ఇందులో రాని మంచి కథల గురించి మంచి వ్యాసాలు రాస్తే ప్రయోజన కరంగా ఉంటుంది.

    • అసలు కథలు వేయడం తగ్గించి అందుకు సంబధించిన వ్యాసాలూ, చర్చలూ వేద్దామా అని కూడా ఆలోచించాం

    రాజయ్య :

    • సమాజానికీ , సాహిత్యానికీ సంబంధం ఏమిటి?  సమాజం నిరంతరం మారుతూ ఉన్నది.  కథ కూడా మారాలి, మారుతున్న సమాజాన్ని పట్టుకోగల్గాలి.

    చినవీరభద్రుడు :

    • కథావార్షిక చర్చలో పాల్గొన్నప్పుడు చర్చలో ప్రస్తావించిన కథలకీ చివరికి పుస్తకంలో వచ్చిన కథలకీ సంబంధం లేదు.    కథల ఎంపికకీ ప్రచురించిన చర్చకీ సంబంధం లేక పోవడం నిరాశ కలిగించింది.   నరేంద్ర రాసిన చాలా మంచి కథ “నిషా”  పుస్తకంలో రాక పోవడం విషాదం.   సంపాదకుడయినంత మాత్రాన తన కథని నిరాకరించాల్సిన అవసరం లేదు.  పైగా చర్చలో మెప్పు పొందిన కధ కూడా.   

    • అందరూ అన్నట్టుగానే కథలకంటే  కథలమీద వ్యాసాలు పుస్తకంగా వస్త్తేనే బాగుండే టట్టుంది.

    • కథా చర్చల్లో గాసిప్ ఎక్కువయింది.  శాస్త్రీయ ఆలో చన లేక పోవటం మూలంగానే కథ చుట్టూ రాజకీయం ఎక్కువగా జరుగుతోంది.  

    • కథా ప్రక్రియ మీద చర్చ చాలా తక్కువ గా జరుగుతోంది. 

    • రచయితలు కథా ప్రక్రియకంటే సమాజ విశ్లేషణే ప్రధానంగా సాగిస్తున్నారు.   సామాజిక విశ్లేషణ విశ్వవిద్యాలయాలు  ఆ విషయం చదువుకున్న వాళ్ళూ చేయాల్సిన పని.  రచయితలు ఆ పనికి పూనుకోవడం హాస్యాస్పదం.     ఓ రకంగా విశ్వవిద్యాలయాలు ఫెయిల్ అవటం మూలంగా రచయితలే ఆ పనికి పూనుకూవాల్సి వచ్చినట్టుంది.

    • కథాప్రక్రియ గురించి మాట్లాడితే రూప వాదులని అనటం చూస్తాం.    వస్తువుని సరిగ్గా చెప్పాలంటే సరయిన రూపం అవసరం.    ఓ గిన్నె తయారు చేస్తే అది వాడకానికి పనికివచ్చేట్టుగా ఉండాలి.  అదే రూపం, డిజైన్.

    • 20 వ శతాబ్దం పాత డిజన్ లు బద్దలు కొట్టడంతో సరిపోయింది.  ఇప్పుడంతా కొత్త డిజైన్లు తయారు చేయాల్సిన శతాబ్దం.    

    • “విందునాట్యం తర్వాత” అన్న టాల్ స్టాయ్ కథ వంద ఏళ్ళ తర్వాత కూడా మనం గుర్తుంచు కున్నామంటే దాంట్లో సమ పాళ్ళల్లో ఉన్న  రూప సామర్ధ్యమని గుర్తించాలి.

    • గురజాడ, చలం, విరసం   మూడూ తెలుగు సాహిత్యన్ని వేరే సాహిత్యంతో పోల్చలేకుండా చేశాయి.   ఇప్పుడు కొత్తగా  ఇతర సాహిత్యాల వాళ్ళు “ఆడదానికి సరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి” లాంటి మాటలు అంటుంటే మనమెప్పుడో చిన్నప్పుడే చలం దగ్గర ఆ మాటలు వినేశామని గుర్తొస్తుంది.   అలా వస్తు పరంగా మన కథ చాలా దూరం వచ్చేసింది. 

    • కొన్ని మంచి కథల్ని విజువల్ మీడియంలోకి తీసుకురాగలమేమో చూడాలి.  ఉదాహరణకి  రాజయ్య గారి “మనిషి లో విధ్వంసం” అన్న కధని తెర మీదకి తేగలమేమో చూడాలి.

ఇలా అనేక విషయాలు చర్చించి, ఇలాటి మరిన్ని సమావేశాలు జరుపుకోవాలని నిర్ణయించుకుని అందరూ ఎవరి దారి వారు పట్టారు.

    (పైన రాసిన వన్నీ నా నోటు బుక్ లో హడావిడిగా రాసుకున్నవీ, నాకు అర్థ మయినవీ.  రేపొద్దున ఎవరన్నా నేనా ఆఉద్దేశంలో అనలేదూ, అక్కిరాజు తప్పుగా అర్థం చేసుకున్నాడూ, అనంటే,  వారి మాటే నమ్మండి.  నన్ను క్షమించేయండి – అక్కిరాజు)  

జాతస్య…

అరుణ పాణిని గారు  ముగ్గురు ముసలమ్మలుఅనే కథని  మే 2007 లో రాశారు.    ఆ కథ నేను అప్పట్లో చాలా సార్లు చదివాను.   మనకున్న దురలవాట్లలో, ప్రతీ కథని “మంచి కథ” లేదా “చెడ్డ కథ” అనే ఏదో ఒక కేటగిరీలో పెట్టాలి అని ప్రయత్నం చేయడం.   ఎన్నిసార్లు చదివినా  ఈ కథని ఎటూ పెట్టలేక పోయాను.   నా వల్ల కాలేదు.   చావు ఈ కథలో ఎక్కడైనా రొమాంటిసైజ్  అయ్యిందేమో నని అప్పట్లో న అనుమానం.  మన పల్లెల్లో మరే మార్గంలేక  చావుని నిశ్శబ్దంగా ఆశ్రయించే వాళ్లందరిదీ   “డిగ్నిఫైడ్ డెత్” ల జాబితాలో చేర్చేయాల్సొస్తుందేమోననే  “పొలిటికల్ కరక్ట్ నెస్”  భయం.   

ఎన్నో సార్లు చాలా తెలిసిన వాడిలా  ఏదొ రాద్దామని మొదలు పెట్టి ఆపేశా.  కథ బాగారాశారు అని మాత్రం మెయిల్ పంపి ఊరుకున్నా.

ఆ కథ వచ్చినప్పటి నించీ ఇప్పటి లోపు నేను దాదాపు పది చావుల్ని చుశాను.  బహుశా మధ్య వయస్సులోకి చేరేవాళ్ళకి ఇలాంటి సమయం తప్పదనుకుంటా.  మెల్లిగా ఓ తరం దాటిపోతున్న ఓ కౄరమైన సందర్భంలో ఉన్నా ప్రస్తుతం.   వీటన్నిటికీ పరాకాష్ట ఒకరి వెంట ఒకరు మా  నాన్నా, అమ్మా వెళ్ళిపోవటం.     

మా నాన్న నాస్థికుడు, కమ్యూనిష్టు, రకరకాల మెటీరియలిజాలు చదివేసి ఓపికున్నంత కాలం కనబడ్డ వాళ్ళకల్లా ఆ పాఠాలు చెప్పిన మనిషి.    కానీ ఆయన  వయసుతో వచ్చిన అనివార్యమయిన మార్పుల్ని మాత్రం అంగీకరించలేక పోయారు.   మంచి ఫిట్ నెస్ చివరిదాకా కొనసాగించిన ఆయన, దాదాపు చివరి దాకా ఓ కిలో మీటరు నడవగలిగే వారు… ఎనభయ్యేళ్ళకి దగ్గరపడ్డాకూడా.  రెగ్యులర్ గా చెకప్పులూ, మందులూ అన్నీ నిక్కచ్చిగా చూసుకున్నారు.  కానీ చివర్లో ఇక ఇంతకు మించి ఏమీ సాధ్యం కాదు అని ఓ నిర్ణయానికి కష్టంమీదే వచ్చారని నా అనుమానం.   అంతకుముందు ఎన్నోసార్లు, కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఎమర్జెన్సీకి పరిగెత్తిన ఆయన,  చివరికి ఒకే రోజులో మేమంతా మళ్ళీ మామూలుగా ఇంటికి వస్తారు అనుకుని హాస్పటల్ కి తీసుకు వెళ్తే తిరిగి రాలేదు.  కొన్ని గంటల్లో కనీసం నాకు హైదరాబాదు నుండి కొత్తగూడెం వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా వెళ్ళి పోయారు.    మా నాన్న చావుని చివరిదాకా అంగీకరించలేదు, ఇది నిజం. 

 మా నాన్న పోవడానికి ముందునుంచే అనేక రుగ్మతలతో మా అమ్మ బాధ పడుతోంది.  నిజం చెప్పాలంటే, తను లేకుండా, మానాన్న ఉండ గలగడం ఊహించలేనిది (శ్రీరమణ రాసినిఅ మిథునం కథ గుర్తుందా?).  అందుకోసమే బండిలాగిందేమో ననేది చావుల్లో కూడా రొమాంటిసిజమ్ చూడగల నా సినిమాటిక్ ఊహ అయుండొచ్చు.   కానీ, మా అమ్మ కొత్తగూడెంలో సీరియస్ అయినా, హైదరాబాద్  అంబులెన్స్ లో తీసుకొచ్చే అవకాశం ఇచ్చింది.   ఇప్పటికీ అది (హైదరబాద్ తీసుకురావడం) మంచిపనో కాదో తేల్చుకోలేకుండా ఉన్నాను.   అది మొదలు మాత్రమే.  అలా తేల్చుకోలేక పోయిన విషయాలు హైదరాబాదు వచ్చిన దగ్గరనుంచీ ఆవిడ పోయిన దాకా ఎన్నని? 

ఆవిణ్ణి అడిగే స్థితి, ఆవిడ అభిప్రాయం తీసుకునేంత స్పృహ కూడా ఆవిడకి పూర్తిగా ఉండదు.  సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి.   బ్రహ్మాండ మయిన ఇన్స్యూరెన్సూ,  కావాల్సినంత బాంక్ బాలెన్సూ ఉన్ననాకు తీసుకెళ్ళలేని ఆస్పత్రి గానీ డాక్టర్ కానీ హైదరాబాద్ లో లేరు.   చెప్పలేనన్ని ఆప్షన్స్,  ఇంకేమన్నా చేయొచ్చెమో, తెలియని తనంతో చెయ్యట్లేదేమో ననే తపన.    ఏది బాధో, ఎంత ప్రెమో, ఎంత అపరాధ భావనో (గిల్టీ ఫీలింగ్) తెలీదు.  

డాక్టర్లు విసుక్కుని “ఇక్కడ ఓ సంవత్సరం ఉంచేస్తే ఏమన్న అవుతుందను కుంటున్నారా?”  అనేదాకా లాగాం.  అప్పటికీ  మా అన్నయ్య వచ్చి పెద్దరికం వహించేదాకా నేను చేయని రచ్చ లేదు.   అమ్మకూడా ఒంటరిగా ICU  రోజుల తరబడి ఉండి,  “ఇక ఇంటికి తీసుకు పొండిరా  ఇక నావల్లకాదు” అనేదాకా సాగ దీశాం. 

(“అలిసిపోయిన ఆమె గుండెను ఇంకా ఎన్ని రోజులు కష్టపెడతారు, కొన్నిసార్లు మనుషులకు కూడా దేవుడిపై కొంత జాలి ఉండాలి”   అని అరుణగారి కథలో డాక్టర్ అనటం అప్పుడర్థమయింది)

మనిషి పూర్తిగా ఎముకల గూడు అయిపోయి, వంటిమీద సూదిగుచ్చేందుకు కుడా కొత్త కొత్త మార్గాలు వెతికేస్థితి.  తీసిన సూది మరకలతో శరీరం పూర్తిగా నల్లబడి పోయి….  మాఅమ్మ….  ఏమిటి చేసేది?    ఇంటికి తీసుకు వచ్చేశాం.  వచ్చిన కొన్ని రోజుల్లో సినిమాల్లో చూపించినట్టు లిటరల్ గా నా చేతుల్లో నా వంకే చూస్తూ పోయింది మా అమ్మ. 

ఆవిడ పోయే గంట ముందుకూడా నేను మా అన్నని బతిమిలాడుతూ, దెబ్బలాడుతూ ఉన్నాను,  వేరే హాస్పటల్ కి తీసుకెళ్దాం అవస్థ పడుతోంది అని.  నా గోల పళ్ళేక మళ్ళీ డాక్టర్ కి  ఫోన్ చేశాడు మా అన్నయ్య.  “దయచేసి ఆవిణ్ణి ఇంకా అవస్థ పెట్టకండీ” అన్నాడు డాక్టరు.  ఆ ఫోన్ చేసిన గంటలో అంతా అయిపోయింది.

ఆవిడ పోయేదాకా ఆవిడకి ఇంకేదయినా చేయాల్సింది చేయట్లేదేమో నని “గిల్టీ”.  ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే,  ఏ హాస్పటల్ కయినా తీస్కెళ్ళగలను, ఏ వైద్యమయినా చేయించ గలనూ అన్న నా అహంకారంతో   ఆవిణ్ణి కొన్ని వారాలు అవస్థ పెట్టానేమో నని పిస్తుంది.   

వెనక్కి తిరిగి చూసుకుంటే “ముగ్గురు ముసలమ్మలు”  కథ చదివినప్పటికి,  ఆ కథని అర్థంచేసుకో గల విగ్నత  అప్పటికి నాకు లేదని అర్థమయింది.   తెలియని విషయం గురించి అప్పుడేమీ రాయనందుకు ఇప్పుడు ఆనంద పడుతున్నాను.

NPR  లో రకరకాల  Podcasts డౌన్లోడ్ చేస్కుని  iPod లో వినడం నా కలవాటు.  ఈ మధ్య  “Good Death”  అని ఓ ఎపిసోడ్ వచ్చింది.   ఇందులో ఉన్నది  డేవిడ్ రీఫ్ (David Rieff) అనే రచయిత రాసిన  swimming in a sea of death”  అనే పుస్తకం గురించిన చర్చ అదీ ఆ రచయితతోనే.  ఆయన తల్లి మరణం చుట్టూ రాసిన పుస్తకం అట అది (నేను పుస్తకం చదవలేదు….  కనీసం మరో అయిదేళ్లదాకా అయినా ఆ పుస్తకం చదివే ఉద్దేశం లేదు నాకు)

అసలే నా ఆలోచనల్లో సతమత మవుతున్న నాకు అదో పెద్ద షాక్.   చావునంగీకరించలేని తల్లిని గురించి కొడుకు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే మామూలు మధ్యతరగతి తెలుగు సెన్సిబిలిటీస్ ఎలా తట్టుకుంటాయి?  చాలా చాలా ఆలో చించాల్సి వచ్చింది, ఆ కొడుకు మాటల్లోని ఓ కఠోర సత్యాన్ని, ఓ నిత్య సత్యాన్ని,  పొద్దున సూర్యుడు పొడవడం లాంటి ఖచ్చిత మయిన విషయాన్ని  ఆకళింపు చేసుకోవాలి అనే మాటని  “హేతు వాదిని” అనే నేను  ఒప్పుకోవాల్సిందే కదా?  

ఇంకా ఈ రచయిత ఇలా అన్నాడు…   

I don’t believe a word (good death) of what you just said. I don’t know whether you believe it or not. But I know this argument very well. First of all, I think that argument does a real disservice to human variety. People are very different in their lives and very different in their deaths. The idea that one good death fits all seems incredibly reductive to what human beings are all about. It’s like saying all human beings should be cheerful. I don’t know that being cheerful is better than being a melancholy person. People have different temperaments. When you say "grace," it lets family members off the hook. They don’t have to feel so bad that the person is going. So I don’t buy it.”

 

బేరీజు వేసి చూస్తే,  ముగ్గురు ముసలమ్మలు కథలో జరిగింది ఇదేనా?   ఒక చావుని మంచి చావుగా గుర్తించి, మిగతా వాటిని దాంతో పోల్చి న్యాయ నిర్ణయం చేయడం సబబేనా?  అలా చేయొచ్చా? 

ముసలమ్మల కథలో మరో కోణం, అందులో డాక్టర్ ఇలా అనుకుంటుంది..

“ఒకవైపు దేవుడు, భక్తి, నమ్మకం అంటున్నా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి. టెక్నాలజీ, అది వాడటానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి టెంప్టేషన్ ఉండదేమో! అందరమూ మరణాన్ని ఒక డిగ్నిటీతో ఒప్పుకుంటామేమో!”

ఎన్ని సార్లు అన్నానో తెలీదు మా ఆవిడతో, మా అన్నయ్యతో,    మన   affordability  అమ్మకి మేలు చేయట్లేదేమో, మరింత అవస్థ పెడుతోందేమో నని.  అంటమయితే అన్నాను కానీ ఎవరిమాటన్నా విన్నానా చివరిదాకా?    మానవ సంబంధాల్లోని ఆర్థిక సూత్రాలు ఎన్ని వింత పోకడలు పోతాయో కదా! 

ఇప్పుడు చెపుతా వినండి.   ముగ్గురు ముసలమ్మలు కథ ఓ అద్భుతం.  అద్భుతం అంటే మంచా, చెడా అని కాదు.   దీంట్లో చర్చించిన అనేక విషయాల పట్ల  నిన్న అంగీకరించినవి రేపు అంగీకరించక పోవచ్చు.  ఈ రోజు ఉన్న సందిగ్ధం రేపు అర్థమయినట్టు ఉండచ్చు.   లేదా అందుకు విరుద్ధం.     అన్నిటినీ అంగీకరించె “పొలిటికల్ థాట్” ఉంటే నే మంచి కథ అంటాను అనే రకం స్కేల్ కి లొంగని కథ ఇది.

కథ నిర్మాణం గురించి చెప్పాలంటే, శిల్ప పరంగా ఇంకా బాగుండొచ్చు.  ఓ డాక్టరే రాశారు కథ అని పాఠకులకి తెలియక్కర్లా J    నిజానికి ఈ కథని ప్రత్యేకంగా చర్చిద్దామని కాదు ఇది రాసింది.    సాహిత్యానికీ మనం ఉన్న సందర్భానికీ  సంబంధం ఉంది.   హడావిడి పడి చేసే ఓవర్ నైట్ సాహిత్య నిర్ణయాలు  ప్రమాద కరం.  

నా వ్యక్తిగత విషయాల్ని చాలా ఇక్కడ రాసేశాను.  David Rieff ఇంటర్వ్యూ విన్నాక/చదివాక అది తప్పులేదనిపించింది.    ఈ టార్చర్ లో ఉండగా  అన్నాను మా ఆవిడతో బేలగా  “ కనీసం అందరిలా అన్నా పెరిగితే బాగుండేది.  ఈ అనవసరపు అర కొర “మేధస్సు” నాకెందుకు.  హాయిగా  గుడికెళ్ళి భగవంతుడా నీదే భారం అనేసి కాస్త “గిల్టీ” ని దేవుడికి పంచే అవకాశం కూడా లేని ఈ నాస్తికత్వం నాకే ఎందుకు రావాల్సొచ్చింది” అని.         

   

-అక్కిరాజు

ఎలా మాట్లాడేది?

వాగే నోరు ఎక్కువకాలం నిశ్శబ్దంగా ఉండదు.   దాదాపు రెండేళ్ళు ఏ అక్షరం ముక్కా రాయకుండా ఎవ్వర్నీ విసిగించ కుండా ఎందుకుండి పోయావూ అంటే ఏం చెప్తాం?

ప్రతీ జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి.   వాటిని అంతకుముందు చూసి ఉండము.  ఎలా ఎదుర్కోవాలో తెలీదు. 

ఏడవాలనుంటుంది, ఏడవటం మర్చిపోయి చాలాకాల మయుంటుంది.  ఓ గంభీరత్వాన్ని, ఓ పొగరునీ ప్రచారం చేసేసుకున్న “ఇమేజ్” కి ఏడుపు అతకదు.  

బాధ మెలికలు తిప్పేస్తుంటుందు.  చివరిసారి ఎప్పుడు బాధ పడ్డామా అని చూస్తే నిజాయితీ గా చెప్పడం కష్టం. 

పరుగులెత్తీ పరుగులెత్తీ  ఆకలికి మించి విస్తరంతా అన్నీ నింపేసుకున్నాక….

పక్కవాడి బాధ గురించి బాధ పడ్డం ఓల్డ్ ఫాషన యి పోయాక…

అవార్డు కథలు అర్థంచేసు కోడానికీ, రాయడానికీ తప్పా బాధ పడ్డం అవసరం లేక పోయాక…

లోపల్నించి కుదిపేయ గల సాహిత్యమే కరువయి పోయాక…

బాధపడ్డం పూర్తిగా అలవాటు తప్పిపోయాక,   ఇప్పుడు మళ్ళీ బాధ పడాల్సొస్తే ఎలా?  ఏడవలేక, దిగమింగుకో లేక, ఏడ్చేందుకు టైమూ లేక, ఈ సందర్భంలో  ఇప్పుడు బాధల్నెక్కడ భరించేది? 

ఒక్క సారి కుదిపేసి,  ఎక్కణ్ణించి వచ్చామో ఆగి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్ఠితి ఎదురయ్యాక… ఏమిటి మాట్లాడేది?   ఎలా మాట్లాడేది?

(జులై 23, 2008 నాడు మానాన్న,  అక్టోబర్ 9, 2008 నాడు మా అమ్మ ఒకరి వెంట ఒకరు ఈ లోకం నించి వెళ్ళిపోయారు – అక్కిరాజు)

రి సైకిల్ : పటమటి మేఘాలు

రచనా కాలం : మార్చి 1999
మబ్బులంటే మాకు భయం!
ఒకప్పుడు రెండు పక్కల్నించీ వస్తుండేవి.
చిక్కగా నల్లగా, భయంకరంగా ఉరుముతూ!
ఏ మబ్బులకింద ఉన్నా మనిలేకుండా అందరం భయపడే వాళ్ళం.
" అదుగో, ఆ మబ్బులు ఢీకొంటే, అమ్మో ఇంకేముందీ? అంతా ప్రళయమే, అందరూ ఊడ్చిపెట్టుకు పోతారూ " అని భయ పెట్టేవాళ్ళు. అందరం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ చూస్తుండే వాళ్ళం.
అవి పోటా పోటీగా ఉరుముతూ వుండేవి, భయపెడుతూ వుండేవి. అవి చెరో ప్రక్కనించీ ఊరంతటినీ ఎంత దొరికితే అంతమేరకు కమ్మేశాయి. వాటికి పోటీ, "నువ్వెంత నాశనం చెయ్యగలవో నేనంతకన్నా ఎక్కువే చెయ్యగలను " అంటున్నట్టుగా వుండెవి. వూరంతా సగానికి విడిపోయింది. సగం ఆ మబ్బులకింద, సగం ఈ మబ్బులకింద!
మాకంతా అయోమయంగా వుండేది.
కొందరు పెద్దలు పటమటి దిక్కుగా వెళ్ళారు. కొందరు అందుకు విరుధ్ధంగా తూర్పుకు వెళ్ళారు. మరికొందరు ఒక అడుగు అటుకి ఒక అడుగు ఇటుకి వేస్తూ ఎటూ వెళ్ళకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే వున్నారు. కానీ అందరికీ గుబులుగానే వుండేది. అడుగడుక్కీ తలెత్తి పైకి చూస్తూనే వుండే వాళ్ళం. ప్రతి రోజూ దుర్వార్తలకోసమే ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. కానీ ఏవో అక్కడా ఇక్కడా చెదురు మొదురు జల్లులు తప్పా పెద్దగా ఎమీ విపరీతాలు జరిగిన వార్త లేదు.
అలా ఎంతకాలం గడిచిందో తెలీదు. ఓనాడు పొద్దున్నే మేం నిద్దర్లేచే సరికి పరిస్థితి అంతా వేరుగా వుండింది. తూర్పు దిక్కును శాశించిన కారుమబ్బులు చెల్లా చెదురై వున్నాయి! అందరం ఒకర్నొకరం ఏం జరిగిందంటే ఏం జరిగిందని ప్రశ్నించుకున్నాం. " ఆ పడమటి మబ్బులు ఈ తూర్పు మబ్బుల్ని మింగేశాయి, ఇంకే మాత్రం పోటీ లేదు, ఇంకే ప్రళయం రాదు " అని ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు చెప్పారు.
కాబోలు ననుకున్నాం, కొంత తెరిపి దొరికిందనుకుని భయంగానూ, భక్తితోనూ ఆ పటమటి మబ్బుల్లోకి చూశాము. మా కుర్రకారైతే మరీను! మరింక ఏ ప్రమాదమూ లేదంటూ అందరికన్నా తమకే ఎక్కువ తెలిసినట్టు వాదించటం మొదలు పెట్టారు. కొందరం మాత్రం, " ఈ తూర్పు నించి వచ్చిన పెద్దల్ని కూడా అడిగి చూద్దాం " అన్నాం. ఎందుచేతనో ఆ ఆలోచన అందరికీ నచ్చినట్లు లేదు. ఆ పెద్దలు కూడా మునుపటిలా అంతగా ఉత్సాహం చూపించట్లేదు, అంత ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ వాళ్ళంతా ఒక్కటే మాట గొణిగారు. " అసలు ప్రమాదం ఇప్పుడే ప్రారంభమవుతోందీ, ఆ పోటీ మేఘాలు తిరిగొచ్చేలోగా అందరం కొట్టుకు పోకుండా వుంటే చాలు" అంటూ. వాళ్ళ నెవ్వరూ పెద్దగా పట్టించుకున్న జాడ లేదు.
సరే, ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఓనాడు అర్థరాత్రి ఆ మబ్బులు ఒక్కసారిగా ఉరమటం మొదలు పెట్టాయి. ఒకటే మోత. ఏంటది, ఏంజరుగుతోందా అని చూశాం. తూర్పూ, పడమరా కలిచే చోట మధ్యలో, కొద్దిగ తూర్పు వైపే, ఈ మేఘాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయిట. చాలామందే పొయ్యారని వార్త. అది ఆరంభం మాత్రమే అని అప్పటికింకా మాకు తెలీదు. ఆ తర్వాత అలాటి వార్తలు మాకు అలవాటయి పోయాయి.
మా కుర్రకారు, ఆ పటమటి నించి వచ్చిన పెద్దలు మాత్రం " ఇదంతా మానవ కళ్యాణమే, ఆ పోతున్న వాళ్ళంతా పోదగిన వాళ్ళే, ఆ తూర్పు మేఘాలు రానంత కాలం అంతా కళ్యాణమే" అని అదేపాట మళ్ళీ మళ్ళీ పాడారు.
"ఎవరు పోదగిన వాళ్ళో ఎవరు కాదో నిర్ణయించాల్సింది ఎవరూ ?" అని అడిగితే, ఆ పటమటి మబ్బులకే అన్నీ తెలుసూ, అవే అన్నీ నిర్ణయిస్తాయి అన్నారు!
ఏమో, మాకెందుకో అంత నమ్మకం కలగట్లేదు. పోటీ మేఘాల్ని సమర్థించిన పెద్దల్ని అడిగితే వాళ్ళంటారూ, " వస్తాయర్రా, ఆ పోటీ మేఘాలు మళ్ళీ వస్తాయి. అవి ఒక్కసారిగ ఎలా మాయమయ్యాయో అలాగే మళ్ళీ వస్తాయి. మీరు నిద్దర్లేచి చూసే సరికల్లా, ఆ పటమటి మేఘాల్ని అటు చివ్వరిదాకా తరిమేసి వుంటాయి". అలా అని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు.
అది నిజమో కాదో తెలీదు కానీ, ఇప్పటికన్నా అదే నయమని మాత్రం మాకు నమ్మకం కుదిరిపోయింది. ప్రతిరోజూ పొద్దున్నే తూర్పు వైపు తిరిగి చూడ్డం ఇప్పటి మా అలవాటు. ఆ పటమటి మబ్బులు మాత్రం ఇంకా ఏదో మూల ఏదో ఒక విపత్తుని సృష్టిస్తున్నాయని మాత్రం వార్తలు రోజూ వింటూనే వున్నాం!
-అక్కిరాజు భట్టిప్రోలు
మార్చ్ 25, 1999

రిసైకిల్ : శీతవేళ రానీయకు రానీయకు!

రచనా కాలం : జూన్ 1999
నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2)
__________________________

కృష్ణశాస్త్రి
అమృతవీణ (గేయసం హిత – 1)
గేయం – 141
__________________________

శీతవేళ రానీయకు – రానీయకు
శిశిరానికి చోటీయకు – చోటీయకు
ఎద లోపలి పూలకారు
ఏ నాటికీ పోనీయకు
శీత…..

ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా
అదరి పోవకు – ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా
లెక్క చేయకు – లెక్క చేయకు
శీత…..

చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో – మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను – నీలోకం నిలుపుకో
శీత……

ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు – వీలు కా దనీ పంపించు
శీత….

______________________

(ఇక్కణ్ణించి నా గోల)

ఆ గీతం చదవని వాళ్ళు వుంటారేమోగానీ, వినని వాళ్ళు ఉంటారని నేనను కోను. ఈ గీతాన్ని అద్భుతమైన సినిమా పాటగా మలచి ‘ మేఘసందేశం ‘ సినిమాలో వాడారు. రమేష్ నాయుడు సంగీత దర్శకుడు. జేసుదాసు, సుశీలలు ఈ పాటకి పూర్తిగా న్యాయం చేశారు. కవితలో వున్న ఆవేశాన్ని పూర్తిగా వినిపించ గలిగిన ఈ ముగ్గురూ అభినందనీయులు. కృష్ణ శాస్త్రివే "ఆకులో ఆకునై", "ముందుతెలిసెనా ప్రభూ" అనే గీతాల్ని కూడా ఈ సినిమాలో వాడుకున్నారు…. చాలా చక్కగా!

ఇది సినిమా పాట అవటం మూలంగానే నేనిన్ని సార్లు వినగల్గాననేది, అందుమూలంగానే ఇది నన్నింతగా ఆకట్టుగో గలిగిందనేవి నిజాలు.

ఏవిటీ ఈ పాటలో వున్నదంటారా….. అబ్బో చాలా వుంది! ఈ పాట నేను చాలా కాలం నుండీ వింటున్నాను. జాగ్రత్తగా వినండి, నో, చదవటం సరిపోదు, అర్జంటుగా కాసెట్ కొని వినండి. ఇందులో 1000 విటమిన్ లున్నాయి, వయసుని పెరక్కుండా నియంత్రించే మంత్రం వుంది… నిజంగా!!

నిస్సత్తువలో, నీరసంలో, అలసి, వోడిపోతున్న క్షణాన ఈ పాట పెట్టుకుని కళ్ళుమూసుకుని, గట్టిగా గొంతు కలిపి పాడండి…….

" ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకు
ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా లెక్క చేయకు
లెక్క చేయకు
శీత….. "

ఈ చరణం పూర్తయ్యేసరికి కొత్త వుత్సాహం, కొత్త ధైర్యం వస్తాయి. నో! ఈ పాట మీకు నిజాన్ని మరిపించి, పరిస్థితుల్నించి దూరంగా పారిపొమ్మని చెప్పదు. అలా వో కొత్త భావ ప్రపంచాన్ని తయరుచేసి మిమ్మల్ని ఆ మత్తులో ముంచెత్తదు. అలాంటి పనికిరాని ‘ రొమాంటిక్ ‘ కవిత్వం కాదిది. నిజానికి ఇది మీకు ‘ఓటమికి ‘ తావులేదని చెపుతుంది. ఓటమిని అంగీకరించద్దని చెపుతుంది. కొత్త ఉత్సాహంతో మళ్ళీ నడుంకట్టమని చెపుతుంది. ‘ పెను నిద్దర వదిలి ‘ ‘ మును ముందుకు ‘ పొమ్మంటుంది. లెక్కచేయకు అంటుంది కానీ, పారిపోమని చెప్పదు!

కట్టలు తెంచుకున్న ఆనందోత్సాహంలో ఉన్నప్పుడు. చుట్టూతా వున్న వాళ్ళందరూ ఆకాశానికెత్తేసి, ఇంద్రుడివీ, చంద్రుడివీ అని పొగిడేస్తున్నప్పుడు, క్షణాలు, నిమిషాలు, గటలు, రోజులు వడివడిగా హాయిగా సాగిపోతున్నప్పుడు….. అప్పుడు…. కొంచెం సందు చూసుకుని వంటరిగా కూర్చుని ఈ పాట వినండి………

" చైత్రంలో తొగ రెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కై పెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో – మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను – నీలోకం నిలుపుకో
శీత…… "

అంతే… ఈ చరణం పూర్తయ్యేటప్పటికి వళ్ళు జలదరిస్తుంది. నో! ఈ ఆనందం, ఈ సౌఖ్యం, ఇవన్నీ మాయలనీ, మిథ్యలనీ, అశాశ్వతాలనీ, నిష్ప్రయోజనాలనీ మెట్టవేదాంతం చెప్పి, మిమ్మల్ని నిర్వీర్యం చెయ్యదీ పాట! అందుకు విరుద్ధంగా…. మీ కళ్ళద్దాలు మీకు తెలియకుండానే మరింత దూరం చూడ్డం మొదలు పెడతాయి. అయ్యో మరికెంత మిగిలిపోయిందా నేచూడాల్సిందీ అనే తపన మొదలవుతుంది. మీ లక్ష్యాలూ, ఆశలూ, ఆదర్శాలూ, ఆవేశాలూ…. అన్నీ కొత్త శక్తులు నింపుకుంటాయి. నూతనోత్సాహం, కొత్త ప్రయాణం, కొత్త పరీక్షలు, కొత్త వెలుగులు, కొత్త గెలుపులు, కొత్త వోటములు…….

ఇలా సాగీ సాగీ……. ఓనాడు మీకు (మీకు… మీకే), అబ్బో చాలా దూరం వచ్చేశామే అనే అనుమానం వస్తుంది. చుట్టూతా వున్న వాళ్ళంతా కూడా (మీతో పాటు బయల్దేరిన వాళ్ళే) చతికిల పడి కూర్చుని, " ఒరే వెంకట్రావూ! ఇంకా ఎందుకురా ఈ తపన, ఇంకేం చెయ్యగలవు చెప్పు? హాయిగా కాళ్ళు జాపుకుని యములోడొచ్చేదాకా కూర్చోలేవు " అని చెపుతారు. ఈ మాట, మీరు చదివే పుస్తకాలని పట్టీ, తిరుగుతున్న మనుషుల్ని బట్టీ, చూస్తున్న ప్రదేశాలని బట్టీ మీకు 100వ ఏట గానీ, 80వ ఏట గానీ, 40వ ఏట గానీ, 20వ ఏట గానీ, 10 వ ఏట గానీ చివరికి… 5వ ఏట కూడా వినబడగలదు!! ఈ వృద్ధాప్యం, దాందుంప తెగ, ఏవయసులో నయినా రాగలిగిన జబ్బు, జాడ్యం. కానీ ఆ మాట వినపడ్డ వెంటనే వాళ్ళతో పాటు చతికిలబడకండి….. ఒక్కసారి ఈ పాట వినండి…..

" ఉదయాన కలత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపు టడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించు – వీలు కా దనీ పంపించు
శీత…. "

ఈ చరణం పూర్తయ్యే సరికల్లా మీరు…… గాలిపటానికి సూత్రం కట్టి, ఎగరేయటానికి గోదారొడ్డుకి వెళ్ళ్తూ వుంటారు. జాగ్రత్త, పరిగెట్టకండి, పై జేబులో గోలీలు కింద పడిపోగలవు!! ఇదీ ఈ పాటలో ఉన్నది….. శక్తి, energy, power!

P.S. " ఎంత వయసొచ్చినా ఈ కోతి వేషాలు మానవేమిరా " అనే మా అమ్మకి మాత్రం చెప్పకండేం ఈ పాట గురించి!

- అక్కిరాజు భట్టిప్రోలు

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!

(విన్నపం : హమ్ ఆప్కే హై కౌన్, సాజన్, కహోనా ప్యార్ హై, టైటానిక్, నువ్వు నాకు నచ్చావు ఇత్యాదులు గొప్ప సినిమాలు అని నమ్మేవాళ్ళు దయచేసి దీన్ని చదవద్దు! )
_________________________________________________

"జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!"

నూటికి నూరు పాళ్ళూ సీతారామ శాస్థ్రి నన్ను చూసే రాశాడు అంటాను… మూడు బీర్లకి ముందైనా తర్వాతైనా!

"నీకు నా బాధలు తప్పా ప్రపంచం బాధలు బానే కనపడతాయి." అనే మా ఆవిడే సాక్షి మొదటి మాటకి.
అందరూ తెగ ఫీలయి పోయే వీర సెంటిమెంటు సినిమా చూస్తూ పగలబడి నవ్వి చుట్టు పక్కల అందరి తిట్లూ తింటం రెండో మాటకి సాక్ష్యం.

సిమ్లాలో హోటల్లో కూర్చుని ఇది రాస్తున్నాను. మా పెళ్ళయి పదేళ్ళయిందని ఓ పది రోజుల ఉత్తర భారత పర్యటనలో ఉన్నాం లెండి. సరే పదేళ్ళ క్రితమే జరిగిందాన్ని తలుచుకుని మురిసి (??) పోవడానికి మేం వస్తే, ఇక్కడ మాకు హిందీ సినిమాలు చూపిస్తున్నారు. డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్ కి వెడితే దాందుంప తెగ ఒక సమస్యా నాకు? మొత్తం టేబిల్ చుట్టూ నాలుగు జంటలు… పెళ్ళయి బహుశా వారం కూడా అయ్యుండదు. ఒకానొక ఊహా ప్రపంచంలో తేలియాడుతూ… అబ్బో చెప్పేందుకు మాటలు చాలవు (?)! మా ఖర్మానికి ఈ హోటల్ పేరు హనీమూన్ ఇన్! రోకట్లో తల పెట్టి ఇప్పుడు వగచి ప్రయోజనం ఏముంది! చుట్టూతా ఒకటే సీన్లు ??!!?

నువ్వు నాకు ఫొటో తియ్యి… నేను నీకు తీస్తా!
నువ్వలా నాజూకుగా అయిస్క్రీం నోట్లో పెట్టుకో… నేను నీకు వీడియో తీస్తా!
నీకెందుకు కష్టం… నేను తెచ్చిస్తాగా… !
ఇలా తల పెట్టు… ఈ గులాబీ నీ తల్లో పెడతా!

ఇక మా సంగతి! మా అమ్మాయి (7 సంవత్సరాలు) అది ఏ నక్షత్రంలో పుట్టిందో తెలీదు గానీ అది నా తెలివి తేటల్ని పరీక్షించని క్షణం లేదు గత ఏడేళ్ళలో! మా అమ్మాయికి ఉన్న చెడ్డ లక్షణం నిజాలు మాట్లాడటం మాట్లాడి తీరటం! అది పొర బాటున ఏ నిజం మాట్లాడుతుందో నని తెగ భయపడి పోవటం నా వంతు. "ఏం ఆ అంకుల్ ఎందుకు ఆంటీకి అయిస్క్రీం తిని పిస్తున్నాడు…. పాపం ఆంటీ చేతికి దెబ్బ తగిలిందా" అని గట్టిగా అడిగితే ఏం చెయ్యడం?

దానికి తగ్గట్టు.. ముఖ్యమంత్రి చుట్టూ అయ్యేయెస్సులు పరిగెట్టినట్టినట్టు… నేనూ మా ఆవిడా మా అమ్మాయి చుట్టూ పరిగెట్టినా… ఏదో తేడా జరగనే జరుగుతుంది దానికి. ఇక దాన్ని సముదాయించ డానికి ఓ పెద్ద హైడ్రామా తప్పదు.

మా ఆవిడ "మనం తప్పు ప్లేసుకి వచ్చామేమో" అంటుంది పైగా చుట్టూ చూసి… కడుపు మండేట్టు. అప్పుడే అంత ముసలాళ్ళ మయిపోయామా అంటాను కసిగా… మా అమ్మాయి పడేసుకున్న ఫోర్క్ కి రెప్లేస్ మెంట్ తేవడానికి పరిగెడుతూ… అది అంతర్జాతీయ సమస్య కాకముందే!

"సరే అక్కడికేదో నిజంగా వయసులో ఉన్నప్పుడేదో సాధించినట్టు" అంటుంది మా ఆవిడ.

"వాడ్డూయూమీన్ " అంటాను మేక పోతు గాంభీర్యంతో .. ఏం వినాల్సొస్తుందోనని భయంతో!

"ఏ నాడూ ఇలా నన్ను వీడియో తీసిన గుర్తు గానీ, నా తల్లో గులాబీ గుచ్చిన గుర్తుగానీ లేదు" అంటుంది

"అలా నా చొక్కా మీద పడ్డ కెచప్ ని నీ చున్నీ తో తుడిచిన గుర్తు నాకూ లేదు" అంటాన్నేను.. నేనేమన్నా తక్కువ తిన్నానా!

ఇక ఇది గాలివాన గా మారేలోపు మా అమ్మాయి… సడెన్ గా "నేను బాత్రూం కెళ్ళాలీ" అంటుంది చుట్టూ అందరికీ విన పడేలా. సీదా డైనింగ్ టేబిల్ నించి మాఆవిడ దాన్ని ఒక్క గుంజు గుంజి "పద మరి" అని పరిగెడుతుంది దాన్ని తీసుకుని. పి.టి. ఉష, షైనీ అబ్రహాం గుర్తొస్తారు నాకు. దెబ్బకి చుట్టుపక్కల డ్రీమ్ సీక్వెన్సులన్నీ కంట్రోల్-ఆల్ట్-డెల్ అయిపోతాయి! కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం కాదు నాయన లారా వాటి పర్యవసానం డైపర్లూ, బాత్ రూముల ప్రహసనాలే అనే నగ్న సత్యాన్ని మా అమ్మాయి వాళ్ళకి చెప్పేస్తుంది.

(ఇలా డైనింగ్ రూంనించి భోజనం మధ్యలో బాత్రూముకు పరిగెట్టని అమ్మానాన్న లెవరన్నా ఉంటే చూడాలని ఉంది)

వాళ్ళు తిరిగొచ్చేలోపు అయిస్క్రీం తింటూ, క్రీగంట పక్క టేబిల్ మీద కొత్త పెళ్ళికూతుర్ని చూస్తూ ఆలోచిస్తా…

ఇంత ప్రదర్శన అవసరమా… ఇది నిజంగా నిజమేనా అని. ఏవో చిన్న సరదాలు, సరసాలు, ముద్దు ముచ్చట్లూ కూడా తప్పంటే ఎట్లా… అంటే… నేనేం చెప్పలేను! తప్పు ఒప్పుల సమస్య కాదు…. అదో స్టాండర్డ్, బెంచ్ మార్కు అయి పోవడం విసుగురావట్లేదా ఎవరికీ? ఆవేశాలని ఇలా ఫైవ్ పండిట్ గైడ్ చదివి నట్టు అందరూ తు.చ తప్పకుండా బట్టీకొట్టి పాటిస్తుంటే ఇంకెవ్వరికీ ఇబ్బందిగా లేదా?

ఇప్పుడు నాకు తెలిసి మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే, సెక్రెటరీస్ డే, డాక్టర్స్ డే … కుక్కల డే, బొద్దింకలడే .. చాలా వచ్చేశాయ్ (ఒ.కె… చివరి రెండు నాకు ఒళ్ళు మండి చేర్చా!). వాడు ఆర్చీస్ వాడూ, హాల్ మార్క్ వాడూ చెపుతాడు… మాఆవిణ్ణి, మాఅమ్మనీ నేను ఎలా ప్రేమించాలో… ఈ దేశంలో ప్రేమకి కొలబద్ద వాడి బాటం లైన్!

ఈ నాకొడుకులకి నే చెప్పేదేంటంటే… ప్రపంచంలో ప్రతి వాడూ వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు. అమెరికా వాడయినా, ఆఫ్రికా వాడయినా, భారతీయుడయినా ఎవడూ వాళ్ళమ్మని తక్కువేమీ ప్రేమించడు! మా అమ్మ బర్త్ డే ఎప్పుడో నాకు ఎప్పుడూ తెలీదు… గుర్తులేదు? అయితే ఏంటిట? ఓ సారి మా అమ్మ దక్కర కెళ్ళి నా గురించి ఏమన్నా చెడుగా అని చూడండి… జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాను!

చిన్న తనంలో (ఇంటర్మీడియట్ ప్రాంతంలో) ఓ సారి టి.వి లో ఓ ఇంటర్వూ వచ్చింది. ఒకానొక ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద వంట వాడు (చెఫ్) ఏదో పేద్ద పేరు తెచ్చుకున్నాడు… సరిగ్గా గుర్తులేదు వాడికేదో ఎవార్డు వచ్చినట్టుంది. వాణ్ణి బోలేడు ప్రశ్నలు వేశారు. అంతా బాగుంది.. చివర్లో వచ్చింది అసలయిన ప్రశ్న! మీరు ఇంత పేరు తెచ్చుకున్నారు కదా… ఇప్పుడు మీకు మీరు చేసిన వంట నచ్చుతుందా… లేక మీ అమ్మ చేసిన వంట నచ్చుతుందా అని! వాడు తడువుకోకుండా "మా అమ్మ వంటే.. అందులో మా అమ్మ ప్రేమ కూరి ఉంటుంది కదా?" అన్నాడు..

నేను కుర్చీలో తెగ ఇబ్బందిగా కదలటం ఎవరూ గమనించలా. కాపోతే… నాచుట్టూ ఉన్న వాళ్ళు తెగ ఆనంద పడి పోయి కళ్ళు తుడుచుకోవటం నాకు ఇప్పటికీ ఒళ్ళు మండించే వ్యవహారం.

ఒక్కటి చెప్పండి! ఏవిటా ప్రశ్న…. ఈ భూప్రపంచంలో ఎవడన్నా టి.వి. కెమెరా ముందు కూర్చుని ఆ ప్రశ్నకి వేరే ఏదన్నా సమాధానం చెప్తారా? మరా ప్రశ్న అడగట మెందుకు… అది విని అంత తెగ ముచ్చట పడి పోవట మెందుకు?

అమెరికన్ వీసాకి అప్లై చేసిన వాళ్ళకి తెలుసు ఇలాంటి ప్రశ్నలు.
"నువ్వెప్పుడన్నా డ్రగ్స్ అమ్ముతూ కానీ, వాడుతూ కానీ పట్టుబడ్డావా?"
"నువ్వు అమెరికా వెళ్ళి అక్క డే ఉండి పోయే ఉద్దేశం ఉందా?"
"నీకు ఊరంతా అంటించే భయంకరమైన అంటురోగం ఉందా?"

ఈ ప్రశ్నలకి "అవును" అని సమాధానం చెప్పే వాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండి ఉంటాడా? అలాంటిదే ఆ పై ప్రశ్న కూడా! ఎప్పుడన్నా అవకాశం రావాలి గానీ కావాలని ఇలాటి వాటికి తిక్కగా సమాధానం చెప్పాలని నాకు మా చెడ్డ కోరిక

"మా అమ్మ వంటా… పరమ చెత్త. సరయిన భోజనం చెయ్యాలంటే నాదక్కరకే రండి" అని చెప్పి చోద్యం చూడాలన్న మాట…. "నువ్వు కావాలనుకునే సమాధానం నేను చెప్పనూ … ఎక్కడ దూకుతావో దూకు" అని మనం ప్రత్యేకంగా అనఖ్ఖర్లా… వాడికి అర్థమయిపోతుంది!

నా ఆలోచనల్లోంచి బయట పడేలోపు మా అమ్మాయి, ఆవిడా తిరిగి వస్తారు.

నేను రాజీ పడే ప్రయత్నంలో… "సరే… రేపు మారేజ్ డేకి ఫ్రెంచ్ షాంపేన్ కొంటాను చూడు మనాలి వెళ్ళేలోపు" అంటాను

మా ఆవిడ మొహం చిట్లించి "నీకు షాంపేన్ తాగాలంటే తాగు.. ఈ డొంక తిరుగుళ్ళెందుకు. నువ్వంత నిజంగా ఫీలయి పోతే మనాలి లో మంచంతా కరిగి పోతుంది. అనవసరంగా ప్రయత్నించకు" అంటుంది.

విచిత్రంగా నాకు… కోపంరాదు… పదేళ్ళలో ఎంత అర్థంచేసేసు కుంది మా ఆవిడ నన్ను అని తెగ ఫీలయ్యి పోతా! ఇంకే షాంపేన్ బాటిలూ అక్కర్లా!

(ఓ పరమ కర్కోటకపు మొరటు తనాన్నించి… పదేళ్ళలో నన్ను ఎంతో కొంత సంస్కరించిన పరమ దుర్మార్గురాలు… మా ఆవిడకి!)

రిసైకిల్ : యంత్రలాభం

రచనా కాలం : ఏప్రిల్ 2001
నా ఒరిజినల్ పోస్టు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ

తెల్లవార్తుంది. యంత్రంలా లేస్తాను కాళ్ళూ చేతులూ మొహం… యంత్ర భాగాలన్నీ శుభ్రం చేసుకుంటాను. యాంత్రిక దినచర్య ప్రారంభమవుతుంది. ఇతర యంత్రాలని కలుస్తూ మాట్లాడుతూ దాటుకుంటూ దినచర్య సాగిపోతూ ఉంటుంది. కొన్ని యంత్రాలకి చక్రాలుంటాయి. మరికొన్నిటికి రంగురంగుల లైట్లుంటాయి. కొన్నిటికి గేర్లూ స్క్రూలూ బోల్ట్లూ ఉంటాయి. కొన్నిటికి మాత్రం నాలాగే కాళ్ళూ చేతులూ తలా మొండెం ఉంటాయి.

కొన్ని పెట్రోలు తాగుతాయి. కొన్ని డీజెల్ని మింగుతాయి. కొన్ని కరంటుతో పని చేస్తాయి. కొన్ని అన్నం, బ్రెడ్డు, పాస్టా, పిజ్జా తింటాయి. కానీ వాటన్నిటికీ మాత్రం దినచర్య ఎవరో ముందుగానే సిద్దంచేసి వుంటారు. ఎవరో గీసిన గీతల వెంట వురుకులూ పరుగులూ.

అలానే ఈ రోజు కూడా సాగిపోతూ వుంటుంది. మరో దినం…. మరో గండం. రోజంతా మాలో మాకు పోటీ. ఒకళ్ళ వంక ఒకళ్ళం ఎప్పుడూ అనుమానంగా భయంగా చూసుకుంటూ వుంటాం. ఏ వుక్కుపాదమో నా పీక మీద అడుగేసి ముందుకెళ్ళిపోతుందేమోననే ఆదుర్దా ఎప్పుడూ నా వెన్నంటే వుంటుంది. ఏ అమెరికా మంత్రమో, జర్మనీ యంత్రమో తమని చెత్త బుట్టలోకి చేర్చేస్తుందేమోనని స్వదేశీ యంత్రాల భయం. అంతా పీచు పీచు మంటూ గొర్రెపోతుల్లా గంభీరంగా పని చేసుకుపోతుంటారు.

నిజం చెప్పొద్దూ… నా కాళ్ళనీ చేతుల్నీ చూసుకుంటుంటే అసహ్యం వేస్తుంది నాకు. ఈ కొరగాని ఎముకల్ని పీకేసి, నాలుగు ఉక్కు ముక్కలూ పేర్చుకుంటే బాగుణ్ణనిపిస్తుంది. మరో నాల్గు రోజులు ఎక్కువ తిండి దొరికే అవకాశం వుండొచ్చు. నాకనిపిస్తుంది, సృష్టి కర్తనేవాడే వుంటే చెప్పాలని, మనిషిని రి-డిజైన్ చెయ్యాల్సిన సమయం వచ్చిందని. ఈ తోలు లివర్నీ పీకేసి ఓ హైడ్రాలిక్ లీవర్ని పెట్టాలి. ఈ తోలు గుండె స్థానంలో ఓ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పెట్టాలి. లేకపోతే ఈ అధునిక యుగంలో బతికేదెట్టా?

ఆలోచనల్లోనే రోజు గడిచి పోతుంది. బతుకుజీవుడా అనుకుంటూ యాంత్రికంగానే కదుల్తాను. రాత్రిక్కూడా విశ్రమించని, విశ్రమించ నవసరంలేని యంత్రాల వంక అసూయతో, భయంతో చూస్తూ. మరో రోజు బతికేసినందుకు నన్ను నేను అభినందించు కుంటాను.

యంత్రలాభం ఎంత లాభమో స్టాక్ ఎక్చేంజిలోనూ అడగొచ్చు, స్మశానంలోనూ అడగొచ్చు…. మనకేది దగ్గరయితే అది.

-అక్కిరాజు భట్టిప్రోలు